దత్తతన్నాడు.. దోపిడీకొచ్చాడు..!

5 Jul, 2019 09:53 IST|Sakshi
ఆవేదన వెలిబుచ్చుతున్న చిన్నరెడ్డెమ్మ కుటుంబం

అలీ ఆగడాలపై భగ్గుమంటున్న రైతులు

బలవంతంగానే భూములు లాక్కున్నారని ఆవేదన

తమ భూములు తమకు ఇవ్వాలని డిమాండ్‌

సాక్షి, ఎర్రావారిపాళెం : విదేశాల్లో సంపాదించాను.. ఊర్లన్నీ దత్తత తీసుకుని అభివృద్ధి చేసి రుణం తీర్చుకుంటానంటూ నమ్మబలికి మోసగించాడంటూ రైతులు ఎన్‌ఆర్‌ఐ అబ్దుల్‌ అలీపై తిరుగుబాటు చేస్తున్నారు. అబ్దుల్‌అలీబలవంతపు భూసేకరణపై రైతులు బుధవారం ఎర్రావారిపాళెం తహసీల్దార్‌ కార్యాలయాన్ని ముట్టడించిన విషయం విదితమే. ఈ విషయంపై మరికొంత మంది రైతులతో కలిసి కౌంటర్‌ ఇప్పించడానికి అబ్దుల్‌ అలీ గురువారం ప్రయత్నించాడు.

అయితే ఈ ప్రయత్నం విఫలమైంది. మీడియా, ఇతర మండలాలకు చెందిన రైతుల సమక్షంలోనే బాధిత తిరుగుబాటు చేసి, తమ భూములు ఆక్రమించుకున్నారంటూ వాగ్వాదానికి దిగారు. జీవనాధారంగా ఉన్న మామిడి చెట్లు, భూముల ఆక్రమణతో వీధినపడ్డామని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో అబ్దుల్‌ అలీపై రైతుల వ్యతిరేక వాదనను అడ్డుకోవడానికి ప్రయత్నించిన ఆయన అనుచరులు, రైతుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. తమ భూములు తిరిగి అప్పజెప్పాల్సిందేనంటూ రైతులు డిమాండ్‌ చేస్తున్నారు.


అలీ పెకలించి వేయించిన మామిడి మొక్కలు 

దౌర్జన్యంగా భూములు లాక్కున్నారు..
అధికారులను అడ్డుపెట్టుకుని దౌర్జన్యంగా మా భూములు లాక్కున్నారు. ఎర్రావారిపాళెం మబ్బుతోపు సమీపంలో పందిమల్లచెరువు కింద ఉన్న పొలాలన్నీ బలవంతంగా లాక్కున్నవే. అక్కడ భూముల్లో సర్వే నెం.1923/1, 1923–1ఎలో రెండున్నర ఎకరాలు మాకు ఉండేది. భూమిలో సుమారు 200పైగా మామిడి చెట్లు ఉండేవి. 20 ఏళ్ల నుంచి కాయకష్టం చేసి మామిడి చెట్లు పెంచుకున్నాం. ఏడాదికి మామిడి కాపు ద్వారా లక్షన్నరపైగా ఆదాయం వచ్చేది. అటువంటి భూములను బెదిరించి లాక్కున్నారు. అధికారులు కూడా వత్తాసు పలకడంతో చేసేది లేక ఒప్పుకున్నాం.     – చిన్నరెడ్డెమ్మ, ఎర్రావారిపాళెం, మహిళా రైతు

అధికారులూ వత్తాసుపలకడం బాధాకరం..
అబ్దుల్‌ అలీ ఆక్రమిత భూముల్లో సర్వే నెం.1190లోని భూమి 40 ఏళ్లుగా మా అనుభవంలో ఉండేది. నిరుపేదలైన మేము పలుమార్లు పట్టా ఇవ్వాలని రెవెన్యూ అధికారులను ప్రాధేయపడ్డాం. అక్కడ మాకు పట్టాచేయడానికి వీలు లేదని మా అభ్యర్థనను తిరస్కరించారు. సదరు సర్వే నంబరు భూమిని అబ్దుల్‌ అలీకి కట్టబెట్టారు. పేదవాడు పొట్టగడుపుకోవడం కోసం అభ్యర్థిస్తే ఇవ్వని పట్టా.. ఎన్‌ఆర్‌ఐకి అధికారులు కట్టబెట్టడం దారుణం.     – మల్లూరి మధు, ఎర్రావారిపాళెం

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా