ఇది ప్రభుత్వ భూదాహం

15 May, 2015 03:38 IST|Sakshi

జైల్‌భరోలో నినదించిన సీపీఐ 200 మంది అరెస్టు నినదించిన సీపీఐ విజయవాడలో జైల్‌భరోకు భారీగా తరలివచ్చిన నేతలు, కార్యకర్తలు 200 మంది అరెస్టు భూసేకరణ తీరును నిరసిస్తూ సీపీఐ ఆధ్వర్యంలో జిల్లాలో గురువారం జైల్‌భరో కార్యక్రమం నిర్వహించారు. పారిశ్రామికవేత్తలకు కట్టబెట్టేందుకు రైతుల భూములు స్వాధీనం చేసుకుంటున్నారని మండిపడ్డారు.

విజయవాడ : రైతుల భూములను పారిశ్రామికవేత్తలకు అప్పగించేందుకే పేదల నుంచి చంద్రబాబు లక్షలాది ఎకరాల భూమిని స్వాధీనం చేసుకుంటున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ మండిపడ్డారు. పార్టీ జాతీయ మహాసభ పిలుపు మేరకు దేశవ్యాప్త ఆందోళనలో భాగంగా గురువారం సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద జైల్‌భరో కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్రమోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు పారిశ్రామికవేత్తలకు, విదేశీ కార్పొరేట్ సంస్థలకు రైతుల భూములు కట్టబెడుతున్నారని విమర్శించారు. రాజధాని పేరుతో కృష్ణాజిల్లాలో 12వేల ఎకరాలు, గుంటూరు జిల్లాలో 33వేల ఎకరాలు రైతుల నుంచి లాక్కునేందుకు యత్నిస్తున్నారన్నారు. భూసేకరణకు వ్యతిరేకంగా పది వామపక్ష పార్టీలను కలుపుకొని పోరాడతామని హెచ్చరించారు.

సీపీఐ నగర కార్యదర్శి దోనేపూడి శంకర్ మాట్లాడుతూ చంద్రబాబుకు భూదాహం పట్టిందన్నారు. సన్న, చిన్నకారు రైతుల నుంచి వేలాది ఎకరాలు స్వాధీనం చేసుకుని స్వామీజీలు, బాబాలకు కట్టబెడుతున్నారని విమర్శించారు. సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద సీపీఐ నాయకులు, కార్యకర్తలు బైఠాయించి పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అనంతరం రామకృష్ణ, దోనేపూడి శంకర్‌ను పోలీసులు అరెస్టు చేస్తుండగా కార్యకర్తలు అడ్డుకున్నారు. ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది.  దాదాపు 200 మందికిపైగా సీపీఐ కార్యకర్తలను అదుపులోకి తీసుకుని సూర్యారావుపేట పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ ఆందోళనలో నాయకుడు పల్లా సూర్యారావు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు