రైతు ఉద్యమ నేత వాసిరెడ్డి నారాయణరావు కన్నుమూత

13 Jun, 2020 01:57 IST|Sakshi

రైతుల సంక్షేమానికి విశేష కృషి

ఆయన సేవలకు గుర్తింపుగా డాక్టర్‌ నాయుడమ్మ అవార్డుతోపాటు పలు పురస్కారాలు

వీరులపాడు (నందిగామ): రైతు ఉద్యమ నేత, అన్నదాత మాసపత్రిక మాజీ సంపాదకుడు డాక్టర్‌ వాసిరెడ్డి నారాయణరావు (93) హైదరాబాద్‌లో శుక్రవారం గుండెపోటుతో కన్ను మూశారు. 1927, ఆగస్టు 13న వాసిరెడ్డి లక్ష్మయ్య, నాగరాజమ్మ దంపతులకు కృష్ణా జిల్లా నందిగామ మండలం వీరుల పాడులో ఆయన జన్మించారు. 1952లో మద్రాసు వెటర్నరీ కళాశాల నుంచి డిగ్రీ, ఇండియన్‌ వెటర్నరీ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ నుంచి పీజీ పూర్తి చేశారు. తర్వాత ఆంధ్రప్రదేశ్‌ పశుసంవర్థక శాఖలో వివిధ హోదాల్లో ఆయన పనిచేశారు. పశుపోషణ లో అధ్యయనం కోసం కేంద్ర ప్రభుత్వం ఆయనను ఆస్ట్రేలియా పంపింది.

1985లో పశుసంవర్థక శాఖ సంచాలకులుగా పదవీ విరమణ పొందారు. రైతుల సంక్షేమానికి కృషి చేయడంతోపాటు గ్రామాభివృద్ధిలో కీలక పాత్ర పోషించారు. పశుసంవర్థక రంగానికి సంబంధించి రైతులకు మేలు కలిగేలా ఎన్నో వ్యాసాలు, పుస్తకాలు రాశారు. రైతుల అభ్యున్నతికి ఆయన చేసిన కృషికి గుర్తింపుగా ప్రతిష్టాత్మక డాక్టర్‌ నాయుడమ్మ అవార్డు, డా.సీకే రావు ట్రస్టు పురస్కారంతోపాలు పలు అవా ర్డులు అందుకున్నారు.  నారాయణరావుకు భార్య, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు.  

ఏపీ సీఎం జగన్‌ సంతాపం
సాక్షి, అమరావతి: రైతు ఉద్యమ నేత వాసిరెడ్డి నారాయణరావు మృతి పట్ల ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌  తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. డాక్టర్‌ నాయుడమ్మ అవార్డు గ్రహీత అయిన నారాయణరావు రైతులకు సంబంధించిన అనేక అంశాలపై ప్రయోజనకరమైన వ్యాసాలు రాశారని శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆయన కుటుంబసభ్యులకు సీఎం తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

మరిన్ని వార్తలు