కౌలు రైతుకు హామీ మాఫీ

12 Sep, 2014 01:07 IST|Sakshi
కౌలు రైతుకు హామీ మాఫీ
  • నట్టేట ముంచిన నిబంధన
  •  జీవో 174లో కౌలు రైతుకు దక్కని స్థానం
  •  కౌలు కార్డు లేకుంటే అంతే సంగతులు
  •  సర్కార్ మెలికపై మండిపాటు
  • గుడివాడ :  రుణమాఫీకి సంబంధించి చంద్రబాబు ప్రభుత్వం విధిస్తున్న నిబంధనలు కౌలు రైతు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి.   ఎన్నికలకు ముందు రైతులందరికీ రుణమాఫీ వర్తింపజేస్తామని హామీ ఇచ్చిన చంద్రబాబు అధికార పీఠమెక్కిన అనంతరం మడమ వెనక్కి తిప్పారు. వ్యవసాయానికి మాత్రమే తీసుకున్న బంగారు రుణాలు కుటుంబానికి రూ.1.50 లక్షల చొప్పున రద్దు చేస్తానని ఆర్భాటంగా  ప్రకటించారు.

    చచ్చినోడి పెళ్లికి వచ్చిందే కట్నమనుకున్న రైతులు అయిన కాడికన్నా తీసుకోవచ్చని   బ్యాంకుల వద్ద బారులు తీరారు.  తీరా బ్యాంకు అధికారుల వద్దకు వచ్చిన  కౌలు రైతులకు  ‘కౌలు కార్డు’  ఉంటేనే రుణమాఫీకి అర్హులవుతారని చావు కబురు చల్లగా చెబుతుండడంతో అక్కడే కూలబడిపోతున్నారు. అయితే రుణమాఫీపై ప్రభుత్వం వేసిన కోటయ్య కమిటీ చేసిన సిఫార్సుల్లో కూడా లేని నిబంధనలు పెట్టి రుణమాఫీని తప్పించుకునేందుకు ప్రభుత్వం అడ్డదారులు వెదుకుందనడానికి ఇదే నిదర్శనమని  రైతుసంఘాల నేతలు విమర్శిస్తున్నారు.
     
    వడపోతతో భారం తగ్గించుకుంటున్నారు..

    ‘మీరు తీసుకున్న పంట రుణాలన్నీ రద్దు అవుతాయి.. ఒక్కపైసా చెల్లించ వద్దు తమ్ముళ్లు’ అని చెప్పిన చంద్రబాబు మాటలతో ఆనందించిన చిన్న సన్నకారు, కౌలు రైతులు వాస్తవ పరిస్థితి చూసి నివ్వెరపోతున్నారు.  రుణమాఫీపై విడుదల చేసిన జీవో నంబరు 174లో కౌలు రైతులు, జేఎల్జీ గ్రూపులు, రైతుమిత్ర గ్రూపుల ఊసులేకుండా చేశారు.

    జిల్లాలో దాదాపు లక్షమందికి పైగా కౌలు రైతులు ఉన్నారు. కౌలు కార్డులు తీసుకున్న వారు కేవలం 20శాతం మందే. వ్యవసాయరుణం, బంగారంపై వ్యవసాయ రుణం పొందిన రైతులు తమ ఆధార్‌కార్డు, రేషన్‌కార్డు, పట్టాదార్ పాస్‌పుస్తకం ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు. కౌలు రైతు అయితే భూయజమాని పట్టాదార్ పాస్‌పుస్తకంతోపాటు, కౌలు కార్డు ఇవ్వాలని చెబుతున్నారు.

    పట్టాదార్ పాస్ పుస్తకం జిరాక్స్‌తోపాటు ఒరిజినల్ పుస్తకం చూపించాలని బ్యాంకు అధికారులు అంటున్నారు. దీనికి తోడు రుణమాఫీ జరిగితే సంబంధిత పట్టాదార్ పాస్‌పుస్తకంపై రుణమాఫీ జరిగినట్లు ముద్రవేస్తాం.. మీ రైతు ఒప్పుకుంటాడా? అని బ్యాంకు అధికారులు ప్రశ్నిస్తున్నారు.  కౌలు రైతుకు పట్టాదార్ పాస్‌పుస్తకం ఒరిజినల్ ఇవ్వటానికి ఏ రైతు ఒప్పుకోని పరిస్థితి ఉంది. కేవలం కౌలు కార్డు ఉంటేనే కౌలు రైతుగా గుర్తిస్తామని లేదనంటే కుదరదని బ్యాంకు అధికారులు తెగేసి చెబుతున్నారు.  
     
    కౌలు కార్డులు తీసుకోవడానికి నిరాసక్తి చూపిన వైనం...


    2010లో కౌలు రైతులకు గుర్తింపు కార్డులు ఇచ్చి వారికి నేరుగా బ్యాంకుల్లో పంట రుణాలు ఇవ్వాలని అప్పటి దివంగత ముఖ్యమంత్రి  వైఎస్.రాజశేఖర్‌రెడ్డి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో మొదట్లో కౌలు రైతులు పెద్ద సంఖ్యలోనే కార్డులు పొందారు. అనంతర కాలంలో కౌలు రైతులకు అనేక బ్యాంకులు పంట రుణాలు ఇవ్వటానికి నిరాసక్తి చూపాయి. దీంతో కౌలు కార్డులు ఉన్నా ఉపయోగం లేదనే తీరుతో రానురాను కౌలు గుర్తింపు కార్డులు తీసుకోవటానికి కౌలు రైతులు ముందుకు రాలేదు.  
     
    రుణానికి సరిపడా పొలం చూసితేనే..

    రైతు తీసుకున్న రుణానికి సరిపడా పొలాన్ని చూపితేనే రుణమాఫీ ఉంటుందని బ్యాంకు అధికారులు పేర్కొంటున్నారు. ఉదాహరణకు ఒక రైతు ఎకరం పొలానికి మూడేళ్లుగా వరుసగా రూ.25వేలు చొప్పున రూ.75వేలు బంగారు రుణం తీసుకున్నా అది కేవలం రూ 25వేలకే పరిమితమవుతుందని అంటున్నారు. దీంతో రైతులు దిక్కుతోచని పరిస్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు.
     

మరిన్ని వార్తలు