కోకో.. కోటి కష్టాలు

26 Nov, 2018 16:50 IST|Sakshi
ఎలుకలు, ఉడతల దాడితో దెబ్బతింటున్న కోకో కాయలు

పెరుగుతున్న పెట్టుబడులు

పడిపోతున్న దిగుబడులు

తూర్పుగోదావరి ,అమలాపురం: ఒకప్పుడు కాసులు కురిపించి.. కొబ్బరి సంక్షోభ సమయంలో రైతులకు కొండంత అండగా నిలిచిన అంతర పంట కోకో ఇప్పుడు చేదు ఫలితాలను మిగులుస్తోంది. గిట్టుబాటు ధర కూడా లేక రైతులు ఢీలా పడుతున్నారు. అంతర్జాతీయంగా డిమాండ్‌ ఉన్నా.. గింజలు కొనుగోలు చేసే ఒక కంపెనీ గుత్తాధిపత్యం కారణంగా రైతులు అయినకాడకు అమ్ముకుని నష్టపోతున్నారు. పెరుగుతున్న కూలీ ఖర్చులు, పెట్టుబడులు కోకో రైతులకు నష్టాలు వస్తున్నాయి.

ఉభయ గోదావరి జిల్లాల్లో 1.78 లక్షల ఎకరాల్లో కొబ్బరి సాగు సాగుతోంది. ఇందులో 25 శాతం అంటే సుమారు 44 వేల ఎకరాల్లో కోకో అంతర పంటగా సాగుతోందని అంచనా. కొబ్బరిలోనే కాకుండా ఆయిల్‌ పామ్‌ తోటల్లో సైతం కోకోను సాగు చేస్తున్నారు. రెండు జిల్లాల్లో 50 వేల ఎకరాల్లో సాగవుతున్నట్టు అంచనా. కొబ్బరి ధర తగ్గిన ప్రతిసారి కోకో ఆదాయం రైతులను ఆదుకుంటుంది. వాతావరణం సహకరించి దిగుబడులు ఆశాజకంగా ఉన్నప్పుడు కోకో ద్వారా రైతుకు ఎకరాకు రూ.50 వేల వరకు ఆదాయం వచ్చిన సందర్భాలు ఉన్నాయి. అయితే ఏడాది కాలం నుంచి ఈ రైతులకు నష్టాలు వస్తున్నాయి.

ఏటా తగ్గుతున్న ఆదాయం
ఏటా పెట్టుబడులు పెరుగుతుంటే ఆదాయం తగ్గిపోతోంది. కోకో గింజల ధర తగ్గడమే ఇందుకు ప్రధాన కారణమని అంటున్నారు. అంతర్జాతీయ మార్కెట్‌లో మాత్రం కోకోకు ఏటా డిమాండ్‌ పెరుగుతూనే ఉంది. అయితే ధర మాత్రం తగ్గిపోతోంది. కేవలం ఒకటి రెండు కార్పొరేట్‌ కంపెనీలు మాత్రమే కోకో గింజలు కొనుగోలు చేస్తున్నాయి. దీంతో ధరను వారి ఇష్టానుసారం తగ్గిస్తున్నారు. 2014, 2015ల్లో సగటు కోకో గింజల ధర కేజీ రూ.192 కాగా 2016లో రూ.200కు పెరిగింది. ఇక 2017 వచ్చే సరికి సరికి రూ.191.25కు తగ్గింది. ఈ ఏడాది రూ.175కు పడిపోయింది. దీనికి తోడు పెరుగుతున్న తెగుళ్లు కోకో దిగుబడిని దెబ్బ తీస్తోంది. ఇటీవల పిందెలు నల్లగా మారడం, ఎలుక, ఉడతల దాడి సైతం పెరిగింది. దీని వల్ల గతంలో ఎకరాకు సగటు దిగుబడి ఎకరాకు 800ల నుంచి వెయ్యి కేజీల వరకు రాగా, ప్రస్తుతం ఇది కాస్తా 400 కేజీలకు పడిపోయింది. ఇవన్నీ రైతులకు వచ్చే ఆదాయాన్ని గణనీయంగా తగ్గించి వేస్తున్నాయి.

కూలీలతోనే అసలు ఇబ్బంది
కోకో సాగుకు అవుతున్న పెట్టుబడిలో కూలీలకు ఇచ్చేదే ఎక్కువగా ఉంది. కోత, గింజలు ఎండ బెట్టడం, మడులు కట్టడం, కలుపుతీత, ఫ్రూనింగ్‌ వంటి పనులకు రైతుకు ఎకరాకు 225 పనిదినాలు ఖర్చు చేయాల్సి వస్తోంది. సగటు రూ.250 అనుకున్నా కూలీలకే రూ.56,250 ఖర్చు అవుతోందని రైతులు చెబుతున్నారు. ఇటీవల కూలి పనులకు వచ్చే వారు తగ్గిపోతుండడం రైతులకు మరింత ఇబ్బందిగా మారింది.

కేజీ రూ.250 ధర ఉండాలి
కోకో సాగులో ఏటా పెట్టుబడి పెరుగుతోంది. గతంలో వచ్చిన దిగుబడి రావడం లేదు. కోకో సాగు రైతుకు గిట్టుబాటు కావాలంటే గింజల ధర కేజీ రూ.250 వరకు ఉండాలి. అలా అయితేనే ఈ సాగు రైతులకు లాభసాటిగా ఉంటుంది.– అబ్బిరెడ్డి రంగబాబు, రైతు, అమలాపురం

మరిన్ని వార్తలు