కుయ్యో..రొయ్యో

19 Feb, 2019 07:45 IST|Sakshi
రొయ్యలను గ్రేడింగ్‌ చేస్తున్న దృశ్యం

సంక్షోభంలో రొయ్యల సాగు

నష్టాల ఊబిలో వనామీ రైతులు

పండుగప్ప సాగు వైపు మొగ్గు

పశ్చిమగోదావరి, భీమవరం అర్బన్‌: వనామీ రొయ్య పెంపకం ప్రారంభంలో సిరులు కురిపించినప్పటికీ తర్వాత  ఏయేటికాయేడు రైతులకు నష్టాలను మిగులుస్తోంది. దాంతో వనామీ సాగుపై ఆక్వా రైతులు ఆసక్తి చూపడం లేదు. గతేడాది పట్టుబడికి వచ్చిన రొయ్యలకు ధర లేకపోవడంతో అయినకాడికి అమ్ముకుని నష్టాలు చవిచూశారు. ఈ ఏడాది మళ్లీ అదే సమస్య వస్తే ఇబ్బందులు తప్పవన్న ఆలోచనలతో సన్నచిన్న కారు రైతులు దానికి ప్రత్యామ్నాయంగా పండుగొప్పవైపు దృష్టి సారిస్తున్నారు. భీమవరం మండలంలో దిరుసుమర్రు, దెయ్యాలతిప్ప, వెంప, గూట్లపాడు, దొంగపిండి, కొత్తపూసలమర్రు, నాగిడిపాలెం, తోకతిప్ప, లోసరి, అనాకోడేరు, ఎల్‌వీఎన్‌పురం, ఈలంపూడి తదితర గ్రామాల్లో సుమారు 7 వేల ఎకరాలలో వనామీ సాగుచేస్తున్నారు. పంట కాలం మూడు నెలలే ఉండి లాభార్జన ఎక్కువగా ఉండటంతో రైతులు ప్రారంభంలో వనామీపై ఆసక్తి చూపారు. రానురాను వైట్‌ స్పాట్, విబ్రియో, వైట్‌గట్‌ వంటి వ్యాధులు రావడంతో నెలరోజుల లోపే రొయ్యలు మృత్యువాత పడుతున్నాయి. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు.

కొనే నాథుడు కరువు
ప్రస్తుత సీజన్‌లో ఏటా రొయ్య పెంపకంలో పెట్టుబడులు పోను కొంతైనా మిగిలేదని రైతులు చెబుతున్నారు. అంతేకాకుండా ఈ సీజన్‌ రొయ్య పెంపకానికి అనుకూలం కావడంతో అందరికీ ఒకేసారి పట్టుబడికి రావడంతో కొనేవారే ఉండటం లేదని రైతులు వాపోతున్నారు.

పెరిగిన మేత ఖర్చులు, డీజిల్‌ ధరలు
రొయ్యలకు మేతగా వేసే పిల్లెట్లు 25 కేజీలు రూ.1800 నుంచి రూ.2 వేలు, డీజిల్‌ లీటర్‌ రూ.70కి పైగా ఉండటంతో ఖర్చులు పెరిగిపోవడంతో సన్నచిన్నకారు రైతులు ఆసక్తి చూపడం లేదు. ఎకరానికి సుమారు రూ.2 లక్షలు నుంచి రూ. 3 లక్షలు పెట్టుబడి రైతులు పెడతారు. అయితే వేసిన తరువాత చలిగాలులు, వైరస్‌ బారిన పడితే తీవ్రంగా నష్టపోతున్నారు. రొయ్య సీడ్‌ ధర ఎక్కువ ఉండటం, కౌంట్‌ ధర తగ్గిపోవడంతో కౌలు రైతులు మరింత కుదేలవుతున్నారు. దాంతో సన్నచిన్నకారు రైతులు పండుగప్ప, శీలావతి, కట్ల సాగుపై మొగ్గు చూపుతున్నారు.

రోజుకు రూ.17.5 కోట్ల విదేశీ మారకద్రవ్యం
జిల్లాలో నరసాపురం, మొగల్తూరు, భీమవరం, కాళ్ల, ఉండి, పాలకొల్లు, పాలకోడేరు, వీరవాసరం, మండలాల్లో సుమారు 75 వేల ఎకరాలలో వనామీ రొయ్య పెంపకాన్ని సాగిస్తున్నారు. జిల్లా నుంచి సీజన్‌లో 250 టన్నులకు పైగా వనామీ రొయ్యలు విదేశాలకు ఎగుమతులు అవుతున్నట్లు ప్రాథమిక అంచనా. రోజుకు సుమారు రూ.17.50 కోట్ల విదేశీ మారక ద్రవ్యం జిల్లాకు వచ్చి చేరుతోంది.

ఏటా పతనమవుతున్న ధర
2012 నుంచి  వనామీ రొయ్య పెంపకంపై రైతులు మొగ్గు చూపించారు. మొదట్లో 50 కౌంట్‌ రూ.400పైగా ఉండటంతో సిరులు కురిపించింది. దీంతో మూడేళ్లు వనామీ సాగు రైతులకు సిరులు కురిపించింది. 2016 నుంచి నాణ్యతలేని వనామీ సీడ్, యాంటీబయోటిక్స్‌ వాడకం, వైరస్‌ వ్యాప్తి వంటి కారణాల వల్ల పతనమైంది. 2019 మొదటి పంటలో సుమారు 40–50 వేల  ఎకరాలకు పడిపోవడంతో రైతులు ప్రత్నామ్నాయంగా చేపల పెంపకాన్ని సాగిస్తున్నారు. గతేడాది 100 కౌంట్‌ కేజీ  ధర రూ. 160కి పడిపోవడంతో రొయ్య రైతులు నష్టపోకుండా ఆదుకునేందుకు ఎంపెడా 100 కౌంట్‌ కేజీ రూ.200 ఉండేటట్లు చూడాలని వ్యాపారులకు ప్రభుత్వం అదేశించినా ఫలితం శూన్యం.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా