గడపదాటని తెల్ల బంగారం

29 Oct, 2017 13:19 IST|Sakshi

గిట్టుబాటు కాని పత్తి సాగు

దిగుబడి బాగున్నా ధరలు పతనం

తడిసి మోపెడవుతున్న కోత కూలీ

పెట్టుబడులు కూడా చేతికందని దుస్థితి

రైతు గడప దాటని పంట

దిగుబడిని ఇళ్లలోనే దాచుకుంటున్న వైనం

మద్దతు ధరలపై ఆశలు కరువు

యర్రగొండపాలెం: ప్రారంభంలోనే పత్తి ధరలు పతనమయ్యాయి. ఖరీఫ్‌లో వేసిన పత్తి పంట ఆశాజనకంగా ఉన్నప్పటికీ వరుసగా వర్షాలు కురవడంతో పూత, కాయపగిలిన దశలో ఉన్న పత్తి పంట నష్టాలను చవిచూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎక్కువగా పురుగు సోకడంతో పలు పర్యాయాలు మందులు పిచికారీ చేయాల్సి వచ్చింది. ఎరువులు పురుగు మందులకే రైతులు పెట్టుబడులు పెట్టలేక అల్లాడిపోయారు. ఎకరా పత్తి పంటకు రైతు స్థోమతను బట్టి రూ.60 వేలు నుంచి రూ.1.50 లక్షల వరకు పెట్టుబడులు పెట్టారు. దిగుబడులు కూడా ఎకరాకు 15 క్వింటాళ్లు దాటవచ్చని రైతులు అంచనాలు వేస్తున్నారు. ప్రస్తుత ధరలను బట్టిచూస్తే పంటపై పెట్టిన పెట్టుబడులు చేతికందే పరిస్థితి కనిపించడం లేదని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.

జిల్లాలో దాదాపు 1,44,938 ఎకరాల్లో ఈ ఏడాది రైతులు పత్తి సాగు చేశారు. వీటి నుంచి దాదాపు ఏడు లక్షల క్వింటాళ్ల దిగుబడి వస్తుందని వ్యవసాయాధికారులు అంచనా వేశారు. గత సంవత్సరం ప్రారంభంలోనే క్వింటా పత్తి రూ.4వేలకు పైబడి ధర పలికింది. ఆ తరువాత క్వింటా రూ.5,650 వరకు రైతులు అమ్ముకోగలిగారు. ఈ ఏడాది కూడా మంచి ధర లభిస్తుందని రైతులు భావించారు. దీనికితోడుగా ఖరీఫ్‌ ప్రారంభలోనే వర్షాలు కురిశాయి. భూములను దుక్కులు దున్నుకొని పత్తి పంటను సాగుచేశారు. మొదట్లో వేసిన పంట రైతుల ఇళ్లకు చేరుతోంది. వెంటనే దళారులు కూడా గ్రామాల్లో పంటను కొనుగోలు చేస్తున్నారు. వర్షాలు కురవడంతో పత్తి తడిచి ముద్దయిందని క్వింటా రూ.1500కు కొనుగోలు చేయడం ప్రారంభించారు. ఆ తరువాత రూ.300 పెంచి రూ.1800కు కొనుగోలు చేస్తున్నారని ఆయా ప్రాంతాల రైతులు తెలిపారు. పత్తి తీయటానికి ఒక్కో కూలీకి రూ.200 చెల్లించాల్సి వస్తోందని, ఆ లెక్కన పది మందికి రెండు వేలు ఇవ్వాల్సి వస్తోందని వారు తెలిపారు. మొదటి కోతకు రెండు నుంచి 4 క్వింటాళ్ల దిగుబడి వచ్చిందన్నారు. ధరలేక పోవడంతోనే ఎక్కువ మంది కోసిన పత్తిని ఇళ్లలో నిలువ ఉంచుకుంటున్నారు.

ప్రత్తి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలి
వెంటనే ప్రత్తి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలి. ప్రత్తి రైతులకు రవాణా ఖర్చుల్లో రాయితీ ఇవ్వాలి. గిట్టుబాటు ధర లభించే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలి. లేకుంటే రైతులు నష్టాలపాలవుతారు.
– పుచ్చకాయల సుబ్బారావు, రాష్ట్ర అధ్యక్షుడు, రైతు సంక్షేమ సేవా సంఘం 

రైతులు అప్పులపాలే..
పత్తి ధరలు ఇదేవిధంగా కొనసాగితే రైతులు అప్పులపాలు అవుతారు. గత నాలుగేళ్లుగా ఇప్పుడిప్పుడే పంట దిగుబడులు చూస్తున్నాం. ధరలు కూడా అదేస్థాయిలో ఉంటే బాగుంటుంది. 
– గోళ్ల వీరయ్య, పత్తి రైతు, కొలుకుల

మరిన్ని వార్తలు