బిగుస్తున్న ఉచ్చు..

13 Sep, 2014 01:49 IST|Sakshi
బిగుస్తున్న ఉచ్చు..

* ముంబై జైల్లో ఉన్న ఎన్‌సీఎస్  ఎం.డిని తీసుకురావడానికి ప్రత్యేక బృందం
* అక్టోబర్ 13న భూముల వేలం
* బినామీ రుణాలపై వెల్లువెత్తుతున్న ఫిర్యాదులు

 
బొబ్బిలి : చెరుకు రైతులకు సకాలంలో బిల్లులు చెల్లిం చకపోవడంతో పాటు వివిధ రకాల మోసాలకు పాల్పడిన ఎన్‌సీఎస్ చక్కెర కర్మాగారం యాజామన్యం చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. బిల్లులు చెల్లించకపోవడంతో రైతు లు కొద్ది రోజుల కిందట ఆందోళనలు చేసిన నేపథ్యం లో కర్మాగారం ఎం.డి నాగేశ్వరరావుతో పాటు డెరైక్టర్లు శ్రీనివాస్, మురళిపై కేసులు నమోదయ్యాయి. ఈ నెల 6న డెరైక్టర్లను అదుపులోకి తీసుకున్న పోలీసులు ఏడో తేదీన అరెస్టు చేశారు. ప్రస్తుతం వారు విశాఖలోని కేంద్ర కార్యాలయంలో ఉన్నారు.
 
వీరిపై ఇప్పటికే అనేక కేసులు నమోదయ్యాయి. డెరైక్టర్లు పోలీసులకు చిక్కడంతో తాజాగా బినామీ రుణాలపై బ్యాంకు నోటీసులు అందుకున్న రైతులు ఫిర్యాదులు చేయడానికి ముందు కు వస్తున్నారు. ఇప్పటికే పార్వతీపురం పోలీస్ స్టేషన్ లో ఒక రైతు తమ పేరుమీద బినామీ రుణాలు తీసుకు ని మోసం చేశారంటూ ఎన్‌సీఎస్ యాజమాన్యంపై ఫిర్యాదు చేయగా, తాజాగా సీతానగరం మండలం బూర్జకు చెందిన ఎర్ర చిన్నంనాయుడు, పణుకుపేటకు చెందిన బంకురు తవిటినాయుడు, పూడి సత్యనారాయణ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
 
ఇదిలా ఉండగా విశాఖ సెంట్రల్ జైల్లో ఉన్న డెరైక్టర్లు చేసుకున్న బెయిల్ పిటీషన్‌ను న్యాయమూర్తి తిరస్కరించారు. బిల్లుల చెల్లింపులు, బినామీ రుణాలపై నమోదైన కేసుల నేపథ్యంలో దర్యాప్తు కోసం డెరైక్టర్లను తమకు అప్పగించాలని పోలీసులు చేసుకున్న వినతిని కోర్టు పరిశీలిస్తోంది. కాగా ఈ కేసుతో సంబంధముండి ఇప్పటికే ముంబైలో అరెస్టు అయి ఆర్ధర్ సబ్ జైల్లో ఉన్న ఎం.డి నాగేశ్వరరావును తీసుకురావడానికి పోలీసుల ప్రత్యేక బృందం  ముంబై పయనమైంది.
 
బిల్లుల చెల్లింపులకు ఏర్పాట్లు
ఒక వైపు యాజమాన్యంను అరెస్టు చేసినా రైతుల ఆందోళనలు చల్లారకపోవడంతో ఇటు రెవెన్యూ అధికారులు అటు పోలీస్ అధికారులు రైతులకు పేమెంట్లు చెల్లించడానికి చర్యలు తీసుకున్నారు. రైతులకు సుమారు 24 కోట్ల రూపాయలు చెల్లించాల్సి ఉండగా, మొదటి విడతగా ఆరు కోట్ల రూపాయలను అధికారులు చెల్లిస్తున్నారు. పది వేల రూపాయల లోపున్న 15 వందల మంది రైతులకు ముందుగా బిల్లులు చెల్లిస్తున్నారు. మిగతా వారికి కూడా బిల్లులు చెల్లించేలా ఏర్పాట్లు చేస్తున్నారు.
 
వచ్చే నెల 13న భూముల వేలం
ఫ్యాక్టరీకి సంబంధించి రెవె న్యూ అధికారులు స్వాధీనం చేసుకున్న భూములను వచ్చే నెల 13న  వేలం వేయనున్నారు. సీతానగరం మండల పరిధిలో ఉండే సుమారు 36 ఎకరాల భూమిని వేలం వేస్తున్నట్లు రెవెన్యూ అధికారులు ఈ నెల 8న ప్రకటన కూడా జారీ చేశారు. పార్వతీపురంలోని ఐటీడీఏ గిరిమిత్ర సమావేశ మందిరంలో వేలం వేయనున్నట్లు అధికారులు చెబుతున్నారు.

మరిన్ని వార్తలు