బొజ్జలే.. భూబకాసురుడు

12 Sep, 2014 01:55 IST|Sakshi
బొజ్జలే.. భూబకాసురుడు

శ్రీకాళహస్తి: ‘‘ముఖ్యమంత్రి చంద్రబాబుగారూ... రాజధాని నిర్మాణం కోసం రైతులు భూములు విరాళంగా ఇవ్వాలని కోరుతున్నారు.. బాగానే ఉంది. అయితే మీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి భూబకాసురుడి అవతారమెత్తారు. ఆయన మాటేంటో స్పష్టం చేయండి.’’ అని వైఎస్సార్‌సీపీ శ్రీకాళహస్తి నియోజకవర్గ సమన్వయకర్త బియ్యపు మధుసూదన్‌రెడ్డి డిమాండ్ చేశారు. భూఆక్రమణలపై పట్టణంలోని తహశీల్దార్ కార్యాలయం వద్ద గురువారం రైతులు  పెద్దఎత్తున ధర్నా చేపట్టారు.
 వైఎస్సార్‌సీపీ నాయకులు వారికి మద్దతుగా నిలిచారు.

ఈ సందర్భంగా బియ్యపు మధుసూదన్‌రెడ్డి మాట్లాడుతూ దేశ విదేశాల భక్తులు శ్రీకాళహస్తీశ్వరాలయంలో రాహుకేతు పూజలు చేయించుకుంటూ ఈ ప్రాంత ఖ్యాతిని ప్రపంచానికి చాటుతున్నారని, మంత్రి గోపాలకృష్ణారెడ్డి మాత్రం శ్రీకాళహస్తి ప్రాంతానికే భూమచ్చ తెచ్చారని విమర్శిం చారు. సొంత మండలంలోని ప్రభుత్వ మిగుల భూములను ఆక్రమించుకోవడానికి బొజ్జల నలుగురు కింకరులను తయారుచేశారని ఆరోపించారు. వంద రోజుల్లో మండలంలోని నలుగురు టీడీపీ నాయకులు ఇనగలూరు, గోవిందరావుపల్లె, మన్నవరం, కలవగుంట గ్రామాల్లో వెయ్యి ఎకరాల భూములను ఆక్రమించి చరిత్ర సృష్టించారని అన్నారు. ఇనగలూరు గ్రామంలో 300 ఎకరాల భూములు ఆక్రమించి నెల్లూరు జిల్లా పొదలకూరు వ్యక్తులకు లీజుకు ఇవ్వడం ఏమిటని ప్రశ్నించారు.

మంత్రి ఒత్తిడితో 300 ఎకరాలు ఆక్రమించిన వ్యకిపై కేసు కూడా నమోదుచేయకపోవడం.. రెవెన్యూ అధికారులు వారి కార్యాలయంలో ఆ నాయకుడితో చర్చలు జరిపి పంపడం సిగ్గుచేటన్నారు. ఒక్క క్షణం కూడా బొజ్జల మంత్రిగా కొనసాగడానికి అర్హుడుకాదని వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. పార్టీ నాయకుడు అంజూరు శ్రీనివాసులు మాట్లాడుతూ శ్రీకాళహస్తి చరిత్రలో ఇంతటి భూకుంభకోణం ఇప్పటి వరకు లేదన్నారు. బొజ్జల సొంత మండలంలో భూఆక్రమణల్లో మంత్రి హస్తం ఉందని స్పష్టంగా తెలుస్తోందన్నారు. ముఖ్యమంత్రి వెంటనే శ్రీకాళహస్తి మండలంలోని భూ ఆక్రమణలపై ఉన్నతస్థాయి కమిటీ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
 
మంత్రి ఒత్తిళ్లకు తలొగ్గకండి

‘సార్ ఒత్తిళ్లకు తలొగ్గి ఉదాసీనత చూపకండి.. మండలంలో వెయ్యి ఎకరాలు ఆక్రమిస్తే నిద్రపోతున్నారా...’ అంటూ తహశీల్దార్ చంద్రమోహన్‌ను నాయకులు, రై తులు నిలదీశారు. మండలంలోని భూములపై ఆంక్షలు విధించామని చెప్పారు.. టీడీపీ నాయకులకు ఆంక్షలు వర్తించవా అంటూ ప్రశ్నించారు. భూములు స్వాధీనం చేసుకోవాలని వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా తహశీల్దార్ చంద్రమోహన్ మాట్లాడుతూ తాను నాయకుల ఒత్తిళ్లకు తలొగ్గే అధికారిని కాదని.. మండలంలో భూఆక్రమణలపై పూర్తి సమాచారం జిల్లా ఉన్నతాధికారులకు పంపుతున్నట్లు పేర్కొన్నారు. పూర్తిగా భూములు స్వాధీనం చేసుకుంటామని స్పష్టం చేశారు.
 

>
మరిన్ని వార్తలు