రైతుల ఉద్యమ శంఖారావం

20 Aug, 2013 03:09 IST|Sakshi

కడప, న్యూస్‌లైన్:  ‘రాష్ట్ర విభజన సరైన పద్ధతికాదు. ప్రజల్లో విడిపోవాలనే ఆలోచన ఏకోశానా లేదు. కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే విభజన జరుగుతోంది. విభజన జరిగితే ఇప్పటికీ అన్ని రంగాల్లో వెనుకబడిన రాయలసీమ మరింతగా వెనుకబాటుతనానికి గురవుతుంది. ముఖ్యంగా రైతులు తీవ్ర దుర్భిక్షాన్ని ఎదుర్కొంటారు. ఇప్పటికే అనేక త్యాగాలతో తప్పులు చేశాం. ఇకనైనా ఆ తప్పులు సరిదిద్దుకుందాం. సమైక్యంతోపాటు సీమ రైతు సంక్షేమానికి కలిసికట్టుగా పోరాడుదాం’’ అని రైతు జేఏసీ పిలుపునిచ్చింది.

సోమవారం కడప నగరంలోని వైఎస్‌ఆర్ మెమోరియల్ ప్రెస్‌క్లబ్‌లో రైతు జేఏసీ కన్వీనర్ నర్రెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి ఆధ్వర్యంలో రాయలసీమ జిల్లాల రైతులతో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన మాజీ మంత్రి రాజగోపాల్‌రెడ్డి మాట్లాడుతూ మద్రాసు నుంచి విడిపోగానే రాయలసీమ ప్రాంత అభ్యున్నతి కోసం శ్రీబాగ్ ఒడంబడిక జరిగిందన్నారు. ఆ ఒడంబడిక అమలుకానందునే నేడు ఈ దుర్భిక్షం దాపురించిందని ఆవేదన వ్యక్తంచేశారు. తెలంగాణాకు ఏ అన్యాయం జరగలేదని ఆ ప్రాంతం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందని స్పష్టంచేశారు.  విభజన జరిగితే సీమకు నీళ్లు రావడం కష్టమవుతుందన్నారు.

సీమకు హంద్రీనీవా నీళ్లు ఎప్పుడొస్తాయో తెలియడం లేదన్నారు. ఈ ప్రాంతంలో ప్రాజెక్టులు పూర్తికాక వరదనీరు సముద్రంలో కలిసిపోయిందన్నారు. దేవుడా సోనియాగాంధీకి మంచి బుద్ధిని ప్రసాదించి రాష్ట్రాన్ని కలిసివుండేలా చూడాలని వేడుకున్నారు. రాష్ట్ర విభజన సరైన పద్ధతి కాదని, ప్రజల్లో విడిపోవాలనే భావన ఏ కోశాన లేదన్నారు. జేఏసీ నాయకులు సింగారెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ కేంద్రం, ఈ ప్రాంత రైతులు, ఉద్యోగులు, విద్యార్థులు అన్ని వర్గాలకు చెందిన ప్రజల మనోభావాలను దృష్టిలో ఉంచుకోకుండా విభజన ప్రకటన ఇవ్వడం  దారుణమన్నారు.

సమైక్య ఉద్యమంకోసం ప్రతి రైతు కుటుంబం నుంచి ఒకరు ఉద్యమంలో పాల్గొనాలన్నారు. అంతకుముందు రైతు జేఏసీని ఏర్పాటుచేసి కన్వీనర్‌గా నర్రెడ్డి చంద్రశేఖర్‌రెడ్డిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కార్యక్రమంలో విజయవాడ రైతు నాయకులు కుమారస్వామి, కర్నూలు జిల్లా నాయకులు సిద్దారెడ్డి, మహేశ్వరరెడ్డి, మౌర్య రామచంద్రారెడ్డి, కిరణ్‌కుమార్, తిరుపతిరెడ్డి, రైతు సంఘాల నాయకులు పాల్గొన్నారు.
 

మరిన్ని వార్తలు