రాయపూడి రైతుల తిరుగుబాటు

16 Nov, 2014 02:56 IST|Sakshi

మంత్రివర్గ ఉప సంఘాన్ని అడ్డుకున్న అన్నదాతలు
 తుళ్ళూరు : గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం రాయపూడిలో శనివారం రైతుల అభిప్రాయ సేకరణకు ఏర్పాటు చేసిన సమావేశం రణరంగంగా మారింది. రాజధానికోసం భూములు ఇచ్చేది లేదంటూ రైతులంతా తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. తొలుత సమావేశంలో రాజధాని ఏర్పాటు ఆవశ్యకతను, అందుకు భూములు ఇవ్వాల్సిన అవసరాన్ని రైతులకు వివరించారు.
 
 అనంతరం శాసనమండలిలో ప్రభుత్వ విప్ నన్నపనేని రాజకుమారి మాట్లాడుతుండగా ప్రసంగం మధ్యలోనే రైతులు ఆందోళనకు దిగారు. ప్రసంగాలు వినటానికి తాము రాలేదని, నెలల తరబడి ప్రభుత్వం చేస్తున్న రోజుకో వాగ్దానం.. పూటకో ప్రకటనవల్ల తామంతా హడలెత్తిపోతున్నామని, నిద్రాహారాలు మాని కుటుంబసమేతంగా రోదిస్తున్నామని, తమ గోడు వినాలని రైతులు ఆందోళనకు దిగారు. దీనికి శాసనసభ్యుడు శ్రావణ్‌కుమార్ మాట్లాడుతూ... రైతుల వేదన వినటానికే వచ్చానని, మాట్లాడే వారి పేర్లు తహశీల్దారుకు చెప్తే ఆర్డర్‌లో పిలుస్తానని చెప్పారు. ఈ లోగా ఓరైతు ఏది చెప్పినా ప్రభుత్వానికి భూములు ఇవ్వమని చెప్పడంతో పోలీసులు సభావేదికపై నుంచి నెట్టివేశారు. దీంతో ఆగ్రహించిన రైతులు మాట్లాడేందుకు వచ్చిన రైతులపై దౌర్జన్యం చేస్తారా? అంటూ ఆగ్రహిస్తూ కుర్చీలను విరగ్గొట్టి ఆందోళనకు దిగారు.
 
  మాట్లాడేందుకు వచ్చిన రైతుల గొంతులు నులుముతారా? మీ ప్రసంగాలు, మీకు అనుకూలంగా ఉన్నవారి మాటలు మాత్రమే వింటారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ చిన్న గ్రామంలో రైతుల అభిప్రాయాలు తెలుసుకునేందుకు ఇంతమంది పోలీసులతో రావాల్సిన అవసరం ఏమిటని నిలదీశారు. రైతుల గోడు వినటానికి వచ్చే అధికారులు మేళతాళాలతో, భాజభజంత్రీలతో రావడం దేనికి సంకేతమని ప్రశ్నించారు. కార్యక్రమం నిర్వహిస్తున్న తీరుకు నిరసనగా కొంతమంది రైతులు విజయవాడ-అమరావతి కాలచక్ర రహదారిపై బైఠాయించారు. అనంతరం భూములు ఇవ్వబోమంటూ రాయపూడి గ్రామ రైతులు చేసిన తీర్మాన ప్రతులను ఎమ్మెల్యే శ్రావణ్‌కుమార్‌కు ఇచ్చి, స్వీకరించినట్లు సంతకాలు పెట్టించుకున్నారు.

మరిన్ని వార్తలు