కరెంట్‌కూ కటకట

26 Aug, 2014 02:08 IST|Sakshi
కరెంట్‌కూ కటకట

*వ్యవసాయ విద్యుత్ సరఫరాపై ఆందోళన
*వర్షాలు పడక .. కరెంట్ లేక అల్లాడుతున్న రైతులు
*మోటార్లు పనిచేయక ఎండుతున్న వరి చేలు
*నాట్లు వేసిన ప్రాంతాల్లో నీళ్లు లేక నెర్రెలిచ్చిన వరి పొలాలు
*కరెంట్‌కూ కటకట
వేమూరు: వర్షాభావ పరిస్థితులు రైతులను ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఈ ఖరీఫ్ సీజన్‌కుగాను గత నెలలో కురిసిన అరకొర వర్షాలు రైతుల్లో ఆశలు చిగురింపచేయడంతో డెల్టాలో అక్కడక్కడా వరి నాట్లు వేశారు. ఈ నెలలో వరుణుడు ముఖం చాటెయ్యటంతో వేసిన నాట్లు నీరు లేక ఎండిపోతున్నాయి. మరి కొందరు దుక్కి చేసిన పొలాల్లో నాట్లు వేసేందుకు నీటి కోసం ఎదురు చూస్తున్నారు. చేసేది లేక అదనపు భా రాన్ని సైతం భరిస్తూ ఆయిల్ ఇంజన్ల ద్వారా నీటిని సమకూర్చుకునే పనిలో పడ్డారు. కనీసం బోర్ల సాయంతోనైనా సాగు చేసేందుకు వ్యవసాయ విద్యుత్ సరఫరా అరకొరగానే ఉందని రైతులు దిగులు పడుతున్నారు.
     
వేమూరు మండలంలో 22 వేల ఎకరాల్లో రైతులు వరిసాగు చేపట్టారు. వీరిలో రైతులు, కౌలు రైతులు ఉన్నారు. ఇక్కడ వ్యవసాయ మోటార్లు వెయ్యి వరకు ఉన్నాయి. మండలంలో ఎ, బి రెండు గ్రూపులుగా వ్యవసాయ విద్యుత్ సరఫరా ఉంది.
     ప్రస్తుతం అమల్లో ఉన్న ఎ గ్రేడ్ విధానంలో రైతులకు ఉదయం నాలుగు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు, రాత్రి పది నుంచి పన్నెండు గంటల వరకు సరఫరానివ్వాలి. అయితే త్రీఫేజ్ సమస్యగా ఉందని రాత్రి వేళ సరఫరా చేయడం లేదు.
     ఉదయం ఐదు గంటల పాటు ఇవ్వాల్సిన సరఫరాను మూడు గంటలు కూడా ఇవ్వటం లేదు. దీంతో రైతులు నానా తంటాలు పడు తున్నారు. అరకొరగా ఉన్న విద్యుత్ సరఫరాతో మోటార్లు పనిచేయక నాట్లు ఎండిపోతున్నాయి.
     ఇక కౌలు రైతుల పరిస్థితి దయనీయంగా ఉంది. ఎకరాకు దాదాపు రూ.25 వేలు కౌలు చెల్లించారు. నీటి కోసం అదనపు ఖర్చుల తో ఇంజన్లు వినియోగిస్తున్నారు. ఇంజన్లు, పైపుల అద్దె, డీజిల్ ఖర్చులు మోయలేని భారంగా ఉన్నాయంటున్నారు.
 పూర్తిస్థాయిలో ఇవ్వలేకపోతున్నాం..
 రైతులకు ఏడు గంటల విద్యుత్ సరఫరా ఇవ్వాల్సి ఉంది. ఉదయం నాలుగు నుంచి తొమ్మిది గంటల వరకు, రాత్రి పది నుంచి 12 వరకు ఇవ్వాలి. అయితే త్రీఫేజ్ సమస్య కారణంగా రాత్రి వేళల్లో విద్యుత్  సరఫరా ఇవ్వలేకపోతున్నాం. ఉదయం ఇస్తున్న సరఫరాలో కూడా కొన్ని సాంకేతిక పరమైన ఇబ్బంది కారణంగా పూర్తిస్థాయిలో ఇవ్వలేకపోతున్నాం.
  - శివప్రసాదు, విద్యుత్ ఏఈ, వేమూరు
 
అలుగురాజుపల్లి రైతుల రాస్తారోకో
మాచర్లటౌన్ :వేళాపాళా లేకుండా ఎప్పుడు పడితే అప్పుడు విద్యుత్ కోతలు విధిస్తూ విద్యుత్ శాఖ సిబ్బంది తమను ఇబ్బందులకు గురిచేస్తున్నారని మండలంలోని అలుగురాజుపల్లి గ్రామానికి చెందిన రైతులు ఆగ్రహంతో సోమవారం గ్రామ ప్రధాన రహదారిపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు.
     ద్వారకాపురి విద్యుత్ సబ్‌స్టేషన్ నిర్మాణం చాన్నాళ్ల కిందటే పూర్తయినా ప్రజా ప్రతినిధులు ప్రారంభించే వరకు చార్జి చేయకుండా ఉండడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఈలోగా వేసిన పంటలకు కరెంటు కోత వల్ల నీరులేక ఎండిపోయే పరిస్థితి నెలకొందన్నారు.
     గ్రామస్తులు రాస్తారోకో చేస్తున్న విషయాన్ని తెలుసుకున్న విజయపురిసౌత్ ఎస్‌ఐ నిస్సార్‌బాషా ఫోన్ ద్వారా రైతులతో సంప్రదింపులు జరిపారు. విద్యుత్ శాఖ అధికారులతో చర్చించి సమస్య పరిష్కారం అయ్యేటట్టు చర్యలు తీసుకుంటానని వారికి తెలిపారు.
     ఇదే విషయాన్ని రూరల్ ఏఈ గౌతమ్‌కు తెలియపర్చారు. దీంతో ఏఈ గౌతమ్ గ్రామ రైతులతో చర్చలు జరిపి మధ్యాహ్నం  నుంచి అలుగురాజుపల్లి ఫీడర్‌కు తాత్కాలికంగా చార్జి చేస్తామని చెప్పడంతో రైతులు రాస్తారోకో విరమించారు.
 
జువ్వలపాలెంలో రైతుల ధర్నా
ప్రభుత్వం వ్యవసాయానికి ఏడు గంటల విద్యుత్‌ను అందించడంలో విఫలమైందని ఆరోపిస్తూ 11 లంక గ్రామాల రైతులు  విద్యుత్ సబ్‌స్టేష్టన్‌ను ముట్టడించి మెయిన్ గేట్ వద్ద ధర్నా నిర్వహించారు. రైతుల కష్టాలు ప్రభుత్వానికి పట్టడం లేదంటూ  కొల్లూరు మండల పరిధిలోని  రైతులు సోమవారం జువ్వలపాలెం విద్యుత్ సబ్‌స్టేష్టన్ వద్ద ఆందోళన చేశారు.

మరిన్ని వార్తలు