తూతూ మంత్రం..!

9 Nov, 2013 03:45 IST|Sakshi

ఖమ్మం కలెక్టరేట్, న్యూస్‌లైన్: రచ్చబండ సమీక్ష సమావేశం నాలుగు గోడలకే పరిమితమైంది. కలెక్టరేట్‌లోని ప్రజ్ఞా సమావేశ మందిరంలో జిల్లా ఇన్‌చార్జి మంత్రి పసుపులేటి బాలరాజు అధ్యక్షతన శుక్రవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. పలువురు ఎమ్మెల్యేలు, వివిధ శాఖల అధికారులు హాజరైన ఈ సమావేశం డీఆర్సీని తలపించినప్పటికీ.. ప్రజా సమస్యలు పెద్దగా ప్రస్తావించలేదు. మీడియాను సైతం అనుమతించలేదు. దీనిపై సత్తుపల్లి, కొత్తగూడెం ఎమ్మెల్యేలు సండ్ర వెంకటవీరయ్య, కూనంనేని సాంబశివరావు అధికారులతో వాగ్వాదానికి దిగారు. సమీక్ష సమావేశంలో రహస్యాలేమీ ఉండవని, అలాంటప్పుడు మీడియాను ఎందుకు అనుమతించడం లేదని ప్రశ్నించారు. అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు మాట్లాడిన విషయాలు మాత్రమే ప్రకటనల ద్వారా వెల్లడిస్తారా అని డీపీఆర్‌ఓను నిలదీశారు.
 
 అసెంబ్లీలో సైతం మీడియాను అనుమతిస్తారని, ఇక్కడ రానీయకపోవడం సరైంది కాదని అన్నారు. అయితే  ఇవేమీ పట్టించుకోకుండానే ర చ్చబండలో ప్రజలకు అందించే సంక్షేమ కార్యక్రమాల వివరాలను ఇన్‌చార్జి మంత్రి బాలరాజు వివరించి ముగించారు. వరుస తుపాన్లు, వరదలతో పంటలకు నష్టం వాటిల్లినా.. చేపట్టాల్సిన చర్యలపై సమీక్షలో చర్చించకపోవడం గమనార్హం. ఏడాది తర్వాత జిల్లా ప్రజాప్రతినిధులు, అధికారుల సమక్షంలో నిర్వహించిన ఈ సమావేశం సాదాసీదాగా ముగియడం పట్ల సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నీలం తుపాన్‌తో దెబ్బతిన్న రోడ్లను ఇంతవరకూ మరమ్మతు చేయలేదని, ప్రజాసమస్యలు పరిష్కారం కావడం లేదని, ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం లేదని, ఈ పరిస్థితిలో ప్రజలకు ఏం సమాధానం చెప్పాలో అర్థం కావడం లేదని పలువురు ఎమ్మెల్యేలు ఆవేదన వ్యక్తం చేశారు.
 
 సమీక్ష నుంచి తుమ్మల వాకౌట్...
 ప్రభుత్వ తీరుపై ఖమ్మం ఎమ్మెల్యే తుమ్మల నాగేశ్వరరావు విమర్శలు గుప్పించారు. గత సమీక్షలో ఇచ్చిన హమీలు ఏ ఒక్కటీ అమలు కాలేదని ఆరోపించారు. ప్రభుత్వ పనితీరు వల్ల ప్రభుత్వ యంత్రాంగంపై ప్రజలకు విశ్వాసం లేకుండా పోతోందన్నారు. ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వానికి చీమకుట్టినట్లు కూడా లేదని, తుపాన్ వచ్చి 15 రోజులు దాటినా ఇప్పటికీ పంట నష్టం సర్వే పూర్తి కాలేదని వాపోయారు. ఇన్ చార్జి మంత్రి జిల్లాకు రారని, ఉన్నవారు పట్టించుకోరని ఆరోపించారు. జిల్లాకు తీవ్ర నష్టం వాటిల్లినా పట్టించుకోకుంటే ఇక ప్రభుత్వం ఎందుకని ప్రశ్నిస్తూ.. సమావేశం నుంచి బయటకు వెళ్లిపోయారు.
 

మరిన్ని వార్తలు