రైతు గుండెల్లో ఎల్‌నినో గుబులు

29 Jun, 2015 03:40 IST|Sakshi
రైతు గుండెల్లో ఎల్‌నినో గుబులు

కడప అగ్రికల్చర్ : ఎల్‌నినో...రైతును వెంటాడుతున్న వాతావరణ భూతం.. 2014-15లో కరువుతో అల్లాడిన రైతన్న 2015-16 ఖరీఫ్ సాగుపైనే ఆశలు పెట్టుకున్నాడు. ఈ ఏడాది సకాలంలో రుతుపవనాలు ప్రవేశించాయని వాతావరణ శాస్త్రవేత్తలు చెప్పినా, మరోవైపు ఎల్‌నినో ప్రభా వం వల్ల వర్షపాతం తగ్గవచ్చని, అందులోనూ సాధారణ వర్షపాతం కంటే 10 శాతం తగ్గుతుం దని చెబుతున్నారు. ఈ ఏడాది కరువు తప్పదా అనే ప్రశ్న..? రైతన్నను వెంటాడుతోంది.  

 ఎల్‌నినో అంటే....:
 మహాసముద్రాలపై ఉపరితల ఉష్ణోగ్రతలు(వేడిమి) పెరగడం వల్ల నీళ్లు అమిత వేడిగా మారిపోతాయి. సముద్రాల ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3 నుంచి 4 డిగ్రీలు పెరుగుతాయి. ఇలాఉష్ణోగ్రతలు అనుకోకుండా పెరగడం వల్ల, సముద్రపు నీరు ఆవిరి రూపంలో వెళ్లి  నీరులేని మేఘాలు ఏర్పడతాయి. దీని మూలంగా మేఘాలలో తేమ లేకపోవడం వల్ల వాతావరణంలోను, వర్షపాతంలోను స్థిరత్వం ఉండదు. దీంతో కరువు వస్తుంది. దీన్నే ఎల్‌నినో అంటారని వాతావరణ శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

 ఈ ఎల్‌నినో వల్ల ఒక్కోసారి కరువు కాట కాలు రావచ్చు, అనుకోకుండా అకాల వర్షాలు, ఉన్న మేఘాలన్నీ ఒకే ప్రాంతంలో నీటిని   కుమ్మరించడం వల్ల వరదలు రావడం భారీగా నష్టం సంభవించడం జరుగుతుందని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు.  

  చినుకురాలితే చిరునవ్వు...లేదంటే కన్నీరే...
   జిల్లాలో మెజార్టీ ప్రజల ప్రధాన జీవనాధారం వ్యవసాయం. వ్యవసాయంలో ఎత్తుపల్లాలను ఎదుర్కొంటూ కష్ట నష్టాలకోర్చి వ్యవసాయాన్ని చేపడుతూనే ఉన్నారు. జిల్లాలో 85 శాతం మంది రైతులు వర్షాధారంగానే పంటలు పండిస్తున్నారు. చినుకురాలితే రైతన్న మోములో చెప్పలేనంత చిరునవ్వు...లేదంటే కంట కన్నీరు తప్పని పరిస్థితి. తాజాగా వినిపిస్తున్న ఎల్‌నినోతో అన్నదాతను భయం వెంటాడుతోంది.

 జిల్లాలో వ్యవసాయం తీరు తెన్నులు..
 జిల్లాలో ప్రధానంగా రాయచోటి, లక్కిరెడ్డిపల్లె, పులివెందుల, ముద్దనూరు, పోరుమామిళ్ల వ్యవసాయ డివిజన్లు పూర్తిగా, కమలాపురం, కడప, ప్రొద్దుటూరు డివిజన్లలో కొన్ని మండలాల్లో వర్షం వస్తేనే భూములు పచ్చని పైర్లతో కళకళలాడేది. లేకపోతే బీళ్లుగానే ఉంటాయి. జిల్లాలో మొత్తం 3,84,679 హెక్టార్ల వ్యవసాయ భూమి ఉంది. ఇందులో ఏటా 1,27,394 హెక్టార్లలో వరి, వేరుశనగ, పొద్దుతిరుగుడు, నువ్వులు, జొన్న, మొక్కజొన్న, సజ్జ, కొర్ర, రాగి, మినుము, పెసర, అలసంద, కూరగాయలు తదతర ఆహార పంటలు సాగవుతుండగా, ఆహారేత పంటలు 1,07,763 హెక్టార్లలో సాగవుతున్నాయి. మిగిలిన భూమిలో పలురకాల పంటలున్నాయని వ్యవసాయశాఖ అంచనాలు చెబుతున్నాయి. సకాలంలో వర్షాలు కురిస్తే రైతులు పంటలసాగుకు తెచ్చిన పెట్టుబడితోపాటు నాలుగు రూపాయలు కళ్లజూస్తారు. లేదంటే పంటల సాగుకు చేసిన అప్పులు తీర్చలేక నరకయాతన తప్పదు.

 మూడేళ్లుగా...వర్షపాతాల్లో హెచ్చుతగ్గులు...:
 జిల్లాలో సాధారణ వర్షపాతానికి, కురుస్తున్న వర్షపాతానికి మధ్య చాలా వ్యత్యాసం ఉంటోంది. వర్షపాతం రికార్డులను పరిశీలిస్తే మూడేళ్లుగా కరువు ఛాయలే కనిపిస్తున్నాయి. ఖరీఫ్, రబీ సీజన్‌లకు కలిపి సాధారణ వర్షపాతం 699.6 మిల్లీ మీటర్లు కురవాల్సి ఉంటుంది. 2012-13 లో ఖరీఫ్‌లో  570.5 మిల్లీ మీటర్లు కురిసింది. 2013-14లో అకాల వర్షాలతో 708.7 మిల్లీ మీటర్లు కురిసి పంటలను నష్టపోయారు. 2014-15లో 464.9 మిల్లీ మీటర్ల వర్షం కురవడంతో కరువు పరిస్థితులు నెలకొన్నాయి. తాజాగా ఎల్‌నినో ప్రభావంతో 2015-16 ఈ ఖరీఫ్‌లోను వర్షపాతంలో 10 శాతం లోటు ఉంటుందని వాతావరణ శాస్త్రవేత్తలు సూచిస్తుండడంతో జిల్లా రైతుల్లో అప్పుడే ఆందోళన మొదలైంది. ఈనెల సాధారణ వర్షపాతం 69.0 మిల్లీ మీటర్లు కురవాల్సి ఉండగా ఇప్పటి వరకు 47.2 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది.

 గత ఏడాది ఖరీఫ్ కన్నీటీ గాథ ఇది...
 గత ఏడాది ఖరీఫ్ సాధారణ సాగు విస్తీర్ణం 1,79,536 హెక్టార్లు కాగా అరకొర వర్షాల కారణంగా కేవలం 43,576 హెక్టార్లలోను, రబీలో సాధారణ సాగు భూమి 2,05,143 హెక్టార్లు ఉండగా ఇందులోను అరకొర వర్షాలకు కేవలం 56,433 హెక్టార్లలోనే పంటలు సాగయ్యాయి. జూన్ నెల నుంచి సెప్టెంబర్ వరకు ఆ సీజన్‌లో దాదాపు నెల రోజులపాటు వర్షం కురవకపోవడంతో పంటలు నిలువునా ఎండిపోయాయి. దీంతో రాష్ట్ర ప్రభుత్వం 28 మండలాల్లో కరువు పరిస్థితులు నెలకొన్నట్లు ప్రకటించింది.

మరిన్ని వార్తలు