కొలిమిగుండ్లలో ఉద్రిక్తత

25 Jul, 2015 10:39 IST|Sakshi

కొలిమిగుండ్ల(కర్నూలు): సిమెంట్ కర్మాగారం కోసమంటూ సేకరించిన భూమిలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టలేదని, పడావు పడిన ఆ భూమిని సాగు చేసుకునేందుకు నిర్వాసిత రైతులు చేపట్టిన ప్రయత్నం ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది. కర్నూలు జిల్లా కొలిమిగుండ్లలో శనివారం ఈ ఘటన చోటుచేసుకుంది. మండల కేంద్రానికి సమీపంలోని కోటపాడు, కల్వటాల గ్రామాల రైతులకు చెందిన దాదాపు రెండు వేల ఎకరాల భూమిని ప్రిజం సంస్థ సిమెంటు కర్మాగారం నిర్మాణం కోసం ఎనిమిదేళ్ల క్రితం సేకరించింది. అయితే, ఇప్పటికీ ఎలాంటి పనులు ఆ స్థలంలో చేపట్టలేదు.

దీంతో నిర్వాసిత రైతులు గత రెండు రోజులుగా ఆ స్థలంలో పెరిగిపోయిన కంపచెట్లను జేసీబీల సాయంతో తొలగింపు చేపట్టారు. శనివారం అక్కడ కొనసాగుతున్న పనులను పోలీసులు అడ్డుకున్నారు. జేసీబీలను అక్కడి నుంచి తరలించేందుకు ప్రయత్నించగా రైతులు అడ్డుకున్నారు. తమకు జీవనాధారమైన భూమిని కొనుగోలు చేసిన సదరు సంస్థ అక్కడ కర్మాగారం ఏర్పాటు చేస్తే ఉద్యోగాలు, ఉపాధి దొరుకుతుందని ఆశపడ్డామని వాదులాటకు దిగారు. ఉన్న భూమిని కోల్పోవటంతోపాటు ఉపాధి దొరకలేదని, గత్యంతరం లేకనే తాము ఆ భూమిలో సాగు ప్రయత్నాలు చేపట్టామని తెలిపారు.
 

>
మరిన్ని వార్తలు