రోడ్డెక్కిన పొగాకు రైతులు

1 Jul, 2015 11:39 IST|Sakshi

మద్దిపాడు (ప్రకాశం): గిట్టుబాటు ధరలు లేకపోవడంతో పొగాకు రైతులు మద్దిపాడులో రోడ్డెక్కారు. ముండ్లమూడు క్లస్టర్‌లోని వేంపాడు, రాయపాడు, పోలవరం, భీమవరం గ్రామాల రైతులు బుధవారం వెల్లంపల్లి ఒకటో వేలం కేంద్రానికి పొగాకు తీసుకు వచ్చారు. ఈ క్రమంలో పొగాకు ధరలు పూర్తిగా తక్కువగా ఉండటం, పొగాకును కంపెనీల ప్రతినిధులు కొనుగోలు చేయకపోవడం, నో-బిడ్ చేయడం వంటి వ్యవహారాల తీరుకు నిరసనగా పొగాకు రైతులు రోడ్డెక్కారు.

జాతీయ రహదారి పైకెక్కి వాహనాలను నిలిపివేసి తమ నిరసనను తెలియజేశారు. రైతులు తమ వెంట తెచ్చిన పొగాకును రోడ్డుపై తగలబెట్టి తమ ఆవేదనను వ్యక్తం చేశారు. దీంతో కిలో మీటర్ మేర వాహనాలు నిలిచిపోయాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు. ఈ సందర్భంగా పోలీసులకు, రైతులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ప్రభుత్వం చొరవ తీసుకుని పొగాకు రైతులకు న్యాయం చేయాలని రైతులు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.

మరిన్ని వార్తలు