తెనాలిలో కన్నెర్రజేసిన రైతులు

24 Apr, 2018 06:40 IST|Sakshi
ఆర్డీవో కార్యాలయం ముందు బైఠాయించిన రైతులు

ఆర్డీవో కార్యాలయం ముట్టడి,బైఠాయింపు

తెల్లజొన్న, మొక్కజొన్న కొనుగోలుకు డిమాండ్‌

25 సాయంత్రానికి ప్రకటన రావాలి

లేకుంటే 26న ఆర్డీవో కార్యాలయంలో వంటావార్పు

తెనాలి: అఖిలపక్ష రైతు సంఘాల పిలుపు మేరకు సోమవారం తెనాలిలో ఆర్డీవో కార్యాలయాన్ని పెద్దసంఖ్యలో రైతులు, కౌలురైతులు ముట్టడించారు. కార్యాలయం గేటు మూసివేసి అడ్డుగా కూర్చున్నారు. మరికొందరు కార్యాలయం ప్రధానద్వారం వద్ద బైఠాయించారు. ఇంకొందరు కార్యాలయం లోపలకు ప్రవేశించి ఉద్యోగుల సీట్ల పక్కనే పడుకున్నారు. రైతుల ఆందోళనతో కొద్దిసేపు మీకోసం కార్యక్రమానికి ఆటంకం కలిగింది. తెల్లజొన్న, మొక్కజొన్నను ప్రభుత్వమే కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్‌ చేశారు. కార్యాలయంలోకి ప్రవేశించిన రైతునాయకులను పోలీసులు బలవంతంగా బయటకు తీసుకొచ్చారు. అనంతరం రైతు నాయకులు మాట్లాడుతూ ఏప్రిల్‌ 25వ తేదీ సాయంత్రంలోగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేస్తామని ప్రభుత్వం ప్రకటించకుంటే, 26న ఆర్డీవో కార్యాలయంలో వంటా వార్పూ కార్యక్రమం పెడతామని హెచ్చరించారు. ముట్టడి సమావేశానికి ఏపీ కౌలురైతు సంఘం జిల్లా అధ్యక్షుడు తోడేటి సురేష్‌బాబు అధ్యక్షత వహించారు.

ఆంధ్రప్రదేశ్‌ రైతుసంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు పి.నరసింహారావు మాట్లాడుతూ ప్రభుత్వం మద్దతు ధరను ప్రకటించి చేతులు దులుపుకోవడం సరికాదని, బాధ్యత వహించి చివరిగింజ వరకు మార్క్‌ఫెడ్‌ ద్వారా కొనుగోలు చేయాలని డిమాండ్‌ చేశారు. కేంద్రప్రభుత్వం తెల్లజొన్నలకు 2017–18లో క్వింటాలుకు రూ.1725 మద్దతు ధర ప్రకటించి కొనుగోలు చేయలేదని, మళ్లీ 2018–19కు క్వింటాలుకు రూ.2600 ప్రకటించడం విడ్డూరంగా ఉందన్నారు. మహారాష్ట్ర రైతాంగ ఉద్యమస్ఫూర్తితో కదిలితేనే ప్రభుత్వం దిగివస్తుందన్నారు. కౌలురైతు సంఘం జిల్లా కార్యదర్శి కంచుమాటి అజయ్‌కుమార్‌ మాట్లాడుతూ జిల్లాలో 145 మంది రైతులు ఆత్మహత్య చేసుకోవడం సిగ్గుచేటన్నారు. ఏపీ రైతుసంఘం జిల్లా ఉపాధ్యక్షుడు ములకా శివసాంబిరెడ్డి మాట్లాడుతూప్రభుత్వం రూ.200 బోనస్‌ ప్రకటన రైతులను అవమానించేదిగా ఉందన్నారు.

ఏపీ కౌలురైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు వల్లభనేని సాంబశివరావు మాట్లాడుతూ ఇప్పటికే పంట అమ్ముకున్న రైతులకు ఏ విధంగా న్యాయం చేస్తారో ప్రభుత్వం చెప్పాలని నిలదీశారు.  రైతాంగ ఆవేదనను జిల్లా కలెక్టరు దృష్టికి తీసుకెళ్లానని ఆర్డీవో నరసింహులు రైతు ప్రతినిధులతో చెప్పారు. డెల్టా పరిరక్షణ సమితి అధ్యక్షుడు డాక్టర్‌ వేమూరి శేషగిరిరావు, రైతుసంఘాల ప్రతినిధులు చెరుకుమల్లి సింగారావు, కొల్లిపర బాబూప్రసాద్, మట్లపూడి థామస్, బొనిగల అగస్టీన్, మేకల చిట్టిబాబు, కావూరి సత్యనారాయణ, మంగళగిరి వెంకటేశ్వర్లు, కంతేటి శ్రీమన్నారాయణ, పి.జోనేష్, ఎన్‌.రాజ్యలక్ష్మి, నక్కా నాగపార్వతి, దాసరి రమేష్‌ మాట్లాడారు.

మరిన్ని వార్తలు