ట్రాన్స్‌కో పంజా!

23 Dec, 2013 23:27 IST|Sakshi

వర్గల్, న్యూస్‌లైన్:  రబీ సీజన్ ప్రారంభ దశలో ట్రాన్స్‌కో బకాయిల పంజా విసురుతోంది. మండలాల వారీగా ఎక్కడికక్కడ వ్యవసాయ విద్యుత్ బకాయిల వసూళ్లు ముమ్మరం చేసింది.  వసూళ్ల కోసం రైతులపై తీవ్ర ఒత్తిడి పెంచుతున్నది. మున్నెన్నడూ లేని రీతిలో ట్రాన్స్‌ఫార్మర్ల వారీగా విద్యుత్ సరఫరా నిలిపేస్తూ రబీ సాగును ప్రశ్నార్థకంలో పడేస్తున్నది. పైర్లు ఎండుతున్నా కనికరించబోమన్నట్లు వ్యవహరిస్తున్న ట్రాన్స్‌కో అధికారుల తీరుపట్ల రైతులు ఆందోళన, ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత రెండ్రోజులుగా వర్గల్ మండలంలో వ్యవసాయ విద్యుత్ బకాయిలు వసూలును ట్రాన్స్‌కో అధికారులు ముమ్మరం చేశారు.

ఇందులో భాగంగా ట్రాన్స్‌ఫార్మర్ పరిధిలో బకాయిదారులుంటే చాలు ఆ ట్రాన్స్‌ఫార్మర్‌కే విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నారు. దీంతో ఆ ట్రాన్స్‌ఫార్మర్ పరిధిలో బకాయిలు చెల్లించిన రైతులు సైతం కరెంటు సరఫరాలేక ఇబ్బంది పడుతున్నారు. ఎండుతున్న పంటలు చూస్తూ కుమిలిపోతున్నారు. రాత్రిపూట కరెంటుతో కుస్తీలు పడుతుంటే ట్రాన్స్‌ఫార్మర్లు బంద్ చేయడం సబబు కాదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆదివారం మజీద్‌పల్లి, గుంటిపల్లి గ్రామాల్లో అనేక ట్రాన్స్‌ఫార్మర్లకు ట్రాన్స్‌కో అధికారులు విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిపేశారు. అదేవిధంగా సోమవారం సైతం మల్లారెడ్డిపల్లిలో విద్యుత్ బకాయి వసూలు క్యాంపు నిర్వహించి నాలుగు ట్రాన్స్‌ఫార్మర్లకు విద్యుత్ సరఫరా నిలిపేశారు. నిన్నమొన్నటిదాకా తుపాను కష్టాలు, అకాల వర్షాలతో నష్టాల పాలై రబీ సాగుకు వెళుతుంటే ఒక్కసారిగా బకాయి వేధింపులకు పాల్పడడం పట్ల రైతులు మండిపడుతున్నారు.
 పంట మొదట్లనే గివేం కష్టాలు సారూ..
 నాకున్నది రెండెకరాలు. ఒక బోరున్నది. నీళ్లు కూడా బాగానే ఉన్నాయి. ఎకరం వరి, ఇంకో ఎకరంలో కూరగాయ పంటలు వేస్తాను. గట్లనే ఇప్పుడు కూడా నారు పోశాను. గింజలు వేసిన్నో లేదో కరెంట్ బంద్ పెట్టిండ్రు. ఇంకో ఎకరంలో పల్లికాయ వేసిన. దానికి కూడా నీటి తడి ఆగిపోయింది. శేను ఆగమాగమైతున్నది. నేను కరెంటు బకాయి కట్టిన. రాత్రి కరెంటు తోని ఇబ్బంది పడుతుంటే అది కూడా రాకుండా చేస్తే మాసొంటి గరీబోల పరిస్థితి ఏం కావాలె. కష్ట కాలం నుంచి బయట పడుదామంటె గిట్ల చేసుడు న్యాయం కాదు.  
 - పెద్దోల్ల నర్సింలు (గుంటిపల్లి)
 బకాయిలు కట్టకుంటే సరఫరా నిలిపేస్తాం వ్యవసాయ విద్యుత్ బకాయలు రూ.లక్షల్లో పేరుకుపోయాయి. మండలంలో దాదాపు రూ.90 లక్షల దాకా బకాయలున్నాయి. బకాయ వసూలుపై స్పష్టమైన ఆదేశాలున్నాయి. రైతులు బకాయలు చెల్లించకుంటే ట్రాన్స్‌ఫార్మర్ల వారీగా సరఫరా నిలిపివేస్తున్నమాట వాస్తవమే. బకాయలు చెల్లిస్తేనే ఆయా ట్రాన్స్‌ఫార్మర్లకు విద్యుత్ సరఫరా పునరుద్ధరిస్తాం.గుంటిపల్లిలో బకాయలు కొంత మేర వసూలు కావడంతో విద్యుత్ సరఫరా పునరుద్ధరించాం. రైతులు బకాయలు కట్టి సహకరించాలి.
            -ట్రాన్స్‌కో ఏఈ శ్రీనివాస్

మరిన్ని వార్తలు