సీమకు కన్నీరే!

8 Aug, 2018 07:21 IST|Sakshi
871.30 అడుగులుగా ఉన్న శ్రీశైలం డ్యాం నీటి మట్టం

‘దేశంలో నదుల అనుసంధానం చేసిన ఘనత మాదే. పట్టిసీమ ద్వారా కృష్ణా డెల్టాకు సమృద్ధిగా సాగునీరు ఇచ్చి, సాగర్‌ ద్వారా డెల్టాకు ఇవ్వాల్సిన కృష్ణా జలాలను శ్రీశైలం డ్యాం నుంచి రాయలసీమ జిల్లాలకు తరలిస్తాం. అందులో చుక్కనీరు కూడా కిందకు తీసుకెళ్లం.’ – ఇవీ సీఎం చంద్రబాబుతో పాటు మంత్రులు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, నాయకులు రెండేళ్లుగా చెబుతున్న మాటలు. అయితే.. వారి మాటల్లో చిత్తశుద్ధి లేదని తేలిపోతోంది. శ్రీశైలం డ్యాం నుంచి నీటిని యథేచ్ఛగా దిగువకు తీసుకెళ్తున్నారు. నాలుగేళ్ల నుంచి కనీస నీటి మట్టం అనే నిబంధనను సైతం ఉల్లంఘించి మరీ నాగార్జున సాగర్‌కు తరలిస్తున్నారు. ఇక్కడి అధికార పార్టీ నేతలకు ఈ వాస్తవం తెలిసినా ప్రభుత్వాన్ని నిలదీసేందుకు మాట రావడం లేదు. 

కర్నూలు సిటీ: రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ  అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాయలసీమ జిల్లాలకు సాగునీటి విషయంలో తీవ్ర అన్యాయం జరుగుతోంది. అయినా సీమకు చెందిన టీడీపీ నేతలు ఏ ఒక్కరూ నోరు మెదపడం లేదు. ఈ ఏడాది జిల్లాతో పాటు వైఎస్సార్, చిత్తూరు, అనంతపురం జిల్లాల్లో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. కానీ ఎగువ రాష్ట్రాలైన కర్ణాటక, మహారాష్ట్రలోని కృష్ణా, తుంగభద్ర బేసిన్‌లో భారీ వర్షాలు కురిశాయి. దీంతో ఆయా నదులకు వరద జలాలు పోటెత్తాయి. ఫలితంగా  శ్రీశైలం డ్యాంకు సుమారు 151 టీఎంసీల నీరు చేరింది. ఈ నీటిని సైతం దిగువకు 

తీసుకెళుతున్నారు. కృష్ణా డెల్టా ప్రాంతాలైన గుంటూరు, పశ్చిమగోదావరి, కృష్ణ జిల్లాల్లో తాగునీటి అవసరాల పేరుతో గత నెలలో 52 టీఎంసీలకు, తాజాగా మరో 12 టీఎంసీల నీటికి రాష్ట్ర ప్రభుత్వం కృష్ణా బోర్డు నుంచి అనుమతులు తీసుకుంది. అదే రాయలసీమలోని కర్నూలు, వైఎస్సార్‌ జిల్లాల్లో తీవ్రమైన తాగునీటి ఎద్దడి ఉందని, 21 టీఎంసీల నీటిని వాడుకునేందుకు అనుమతి ఇవ్వాలని ఇంజినీర్లు ప్రతిపాదనలు చేసినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఈ ప్రతిపాదనలకు కృష్ణాబోర్డు నుంచి అనుమతులు ఇప్పించాల్సిన ప్రభుత్వం ఏమీ పట్టనట్టుగా వ్యవహరిస్తోంది.

ఇదే తరుణంలో ఎలాంటి అనుమతులు లేకుండానే గుట్టుచప్పుడు కాకుండా నెల్లూరు జిల్లాకు 9 టీఎంసీల నీటిని తరలించినట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. ఎగువ రాష్ట్రాల్లో కురిసిన వర్షాల వల్ల నీరు వస్తుందన్న భావనతో గత నెల 28న ఎలాంటి ముందస్తూ ప్రణాళికలు లేకుండా నీరుపారుదల సలహా మండలి (ఐఏబీ) సమావేశం నిర్వహించారు. ఖరీఫ్‌లో స్థిరీకరించిన ఆయకట్టుకు మొత్తం నీరు ఇస్తామని మంత్రులు ప్రకటించారు. దీంతో రైతులు వరి సాగుకు నారు పెంచుతున్నారు. ఇలాంటి సమయంలో శ్రీశైలం డ్యాంలో నీరు తక్కువగా ఉందని, ఆయకట్టుకు ఇవ్వలేమని  ఇంజినీర్లు తాజాగా ప్రకటించడంతో ఆయకట్టుదారులు ఆందోళన చెందుతున్నారు.
 
కరువు జిల్లాలకు కృష్ణా జలాలేవీ? 
రాయలసీమ జిల్లాలకు తుంగభద్ర, కృష్ణా జలాలే ఆధారం. కర్నూలు, వైఎస్సార్, అనంతపురం, చిత్తూరు జిల్లాలకు సాగు,తాగునీరు, చెన్నై తాగునీటి అవసరాలకు కలిపి వంద టీఎంసీలకు పైగా నీరు కావాలి. గత నెల 28న ఐఏబీ సమావేశంలో కర్నూలు జిల్లాలో తెలుగుగంగ, ఎస్‌ఆర్‌బీసీ, సిద్దాపురం స్కీమ్‌ కింద 2.51 లక్షల ఎకరాలకు, వైఎస్సార్‌ జిల్లాలో 1,67,000 ఎకరాలకు కృష్ణా జలాలు అందిస్తామని తీర్మానాలు చేశారు. అలాగే తుంగభద్ర జలాలను కేసీ కాలువ కింద కర్నూలు, వైఎస్సార్‌ జిల్లాల్లో 2.65 లక్షల ఎకరాలకు 29.9 టీఎంసీల మేర ఇస్తామన్నారు. ఇలాంటి సమయంలో వచ్చిన నీటిని మొదటి ప్రాధాన్యత కింద కరువు ప్రాంతమైన సీమకు ఇవ్వాల్సి పోయి.. ప్రభుత్వం  తాగు నీటి పేరుతో శ్రీశైలం నుంచి సాగర్‌కు వదిలేస్తోంది. ప్రస్తుతం శ్రీశైలంలో 871.30 అడుగుల నీటి మట్టం, 147 టీఎంసీల నీటినిల్వ ఉంది.

ఇందులో సాగర్‌కు ఇంకా 41 టీఎంసీలు (ముందు అనుమతించిన 52 టీఎంసీలలో 23, ప్రస్తుతం అనుమతించిన 12 టీఎంసీలు కలిపి) విడుదల చేయాల్సి ఉంది. ప్రస్తుతం అనుమతించిన 12 టీఎంసీల నీటిని ఈ నెల 18లోపు విడుదల చేయాలని కృష్ణా నది యాజమాన్య బోర్డు ఉత్తర్వులిచ్చింది.  అలాగే గతంలో అనుమతించిన 52 టీఎంసీల నీటిని సైతం ఈ నెల 23లోపు విడుదల చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొంది.  ప్రస్తుతం ఉన్న 147 టీఎంసీలలో 41 టీఎంసీల నీటిని విడుదల చేస్తే మిగిలేది  106 టీఎంసీలు మాత్రమే. అలాగే నీటిమట్టం 856.8 అడుగులకు తగ్గిపోతుంది. 854 అడుగులకు పైగా నీటి మట్టం ఉంటేనే పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌ ద్వారా సీమకు నీటి విడుదలకు అవకాశం ఉంటుంది. ఈ స్థాయికి తగ్గితే చుక్క నీరు కూడా రాదు.    

21 టీఎంసీలు అడిగాం
జూలైలో 9 టీఎంసీలు, ఆగస్టు నెలకు 21 టీఎంసీల నీరు కావాలని ప్రభుత్వాన్ని అడిగాం. అయితే జూలైకు అనుమతిచ్చారు. ఆగస్టు అవసరాల కోసం అనుమతి రావాల్సి ఉంది. నీటి లభ్యత తక్కువగా ఉంది కాబట్టి తాగునీటికి అధిక ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంది. తాగునీటి అవసరాల కోసం తెలుగుగంగకు కొంత నీటిని వెలుగోడు నుంచి విడుదల చేయనున్నాం. వర్షాలు వస్తేనే సాగునీటి విడుదల సాధ్యమవుతుంది.  
– నారాయణరెడ్డి, సీఈ, జల వనరుల శాఖ కర్నూలు ప్రాజెక్ట్సు 

ఆ నేతలు ఇప్పుడు సమాధానం చెప్పాలి 
చివరి ఆయకట్టు వరకు సాగునీరు ఇస్తామని జల హారతులు పట్టిన నేతలు ఈ రోజు  ఎందుకు ఇవ్వలేకపోతున్నారో సమాధానం చెప్పాలి. గత మూడు ఐఏబీ సమావేశాల్లో సీఎం వల్లే రాయలసీమకు సాగునీరు వచ్చిందని అభినందన తీర్మానాలు చేయించిన ఎమ్మెల్యేలు  ఇప్పుడు నీటిని విడుదల చేయించాలి. మాయమాటలతో రైతులను నిలువునా ముంచుతున్నారు. తీర్మానాలపై ఉన్న ధ్యాస రైతులపై జిల్లా నేతలకు లేకుండా పోయింది. శ్రీశైలంలో నీటి నిల్వలు ఉన్నా ..ఎందుకు ఇవ్వడం లేదో సమాధానం చెప్పాల్సిన బాధ్యత రాజకీయ పార్టీలపై ఉంది

 – బొజ్జా దశరథరామిరెడ్డి, రాయలసీమ సాగునీటి సాధన సమితి కన్వీనర్‌

పట్టిసీమ పేరుతో నిలువునా ముంచుతున్నారు. 
కృష్ణాడెల్టాకు పట్టిసీమ ద్వారా నీటిని ఇస్తామని, డెల్టాకు ఇచ్చే నీటిని రాయలసీమకు మళ్లిస్తామని చెప్పుకుంటూ టీడీపీ నేతలు ఆయకట్టుదారులను నిలువునా మోసం చేస్తున్నారు. దేశంలో అత్యంత తక్కువ వర్షపాతం వైఎస్సార్‌ జిల్లాలో (60 శాతం), ఆ తరువాత కర్నూలు, అనంతపురం జిల్లాల్లో నమోదైంది. అయినా రాయలసీమకు నీళ్లివ్వడం లేదు. ఈ రోజు శ్రీశైలంలో నీరున్నా పోతిరెడ్డిపాడు నుంచి నీటి విడుదల పూర్తి స్థాయిలో తగ్గించారు. తాగునీటి అవసరాల పేరిట సాగర్‌కు నీటిని తీసుకెళుతున్నా.. జిల్లాకు చెందిన టీడీపీ నేతలు ఏ మాత్రమూ పట్టించుకోవడం లేదు.  
 – వంగాల భరత్‌కుమార్‌రెడ్డి, వైఎస్‌ఆర్‌సీపీ రైతు విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి

మరిన్ని వార్తలు