రైతులు పీహెచ్‌డీలు చేయాలి

22 Jul, 2017 02:26 IST|Sakshi
రైతులు పీహెచ్‌డీలు చేయాలి
కుప్పం సభలో సీఎం చంద్రబాబు
 
సాక్షి, చిత్తూరు: రైతులు, రైతు కూలీలు కూడా పీహెచ్‌డీలు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ‘రైతులు, రైతు కూలీలు ముందు ఐదో తరగతి పరీక్ష రాయాలి... తర్వాత పదో తరగతి పరీక్ష రాయండి.. ఇంటర్మీడియట్, బీఏ, ఎమ్మే పరీక్షలు రాయాలి. మీరు చేసే పనిలోనే పీహెచ్‌డీలు చేయండి. పట్టు, పాడి పరిశ్రమలపై,, టమాటాపై పీహెచ్‌డీ చేయండి. దీనివల్ల మీకు నాలెడ్జ్‌ పెరుగుతుంది..’ అని సీఎం అన్నారు. శుక్రవారం చిత్తూరు జిల్లా కుప్పంలో రెండోరోజు పర్యటనలో భాగంగా మార్కెట్‌ యార్డులో ఏర్పాటు చేసిన సభలో చంద్రబాబు మాట్లాడారు.

పాడి పరిశ్రమకు, పండ్ల తోటలకు ప్రాధాన్యత ఇవ్వడంలో భాగంగా ఇజ్రాయెల్‌ టెక్నాలజీని దేశానికి పరిచయం చేశానని పేర్కొన్నారు. మన రాష్ట్రంలో ప్రవేశపెట్టిన తర్వాతే గుజరాత్‌లో నరేంద్రమోదీ ఈ టెక్నాలజీతో అద్భుత ఫలితాలు సాధించారని చెప్పారు. నేను ఒక్క మాట చెబితే చాలు రాష్ట్రం అంతా ఫాలో (అనుసరిస్తోందని) అవుతోందని అన్నారు. 175 నియోజకవర్గాలను సమానంగా అభివృద్ధి చేస్తున్నానని, దీనిని ప్రజలందరూ గుర్తించాలని అన్నారు. నా తెలివితేటలు ఉపయోగించి ఆంధ్రప్రదేశ్‌ను దేశంలోనే కాకుండా ప్రపంచంలోనే నం.1 స్థానంలో నిలుపుతానని చెప్పారు. 
మరిన్ని వార్తలు