రైల్వే డబ్లింగ్‌ పనులను అడ్డుకున్న రైతులు

19 Jan, 2019 14:00 IST|Sakshi
గొరిజవోలు గ్రామంలో రైల్వే డబ్లింగ్‌ పనుల వద్ద ఆందోళన చేస్తున్న రైతులు

తమ భూములకు పరిహారం ఇచ్చాకే పనులు చేసుకోవాలని డిమాండ్‌

ప్రతిపాదనలు పంపించామన్న రెవెన్యూ అధికారులు

గొరిజవోలు రైల్వే ట్రాక్‌ వద్ద బాధిత రైతుల ఆందోళన

పనులు కొనసాగిస్తే ఆత్మహత్య చేసుకుంటామంటూ హెచ్చరిక

గుంటూరు,యడ్లపాడు(చిలకలూరిపేట): గుంటూరు– గుంతకల్లు రైల్వే డబ్లింగ్‌ నిర్మాణ పనులకు మరోమారు చెక్‌ పడింది. తమ భూముల్లో పనులను నిర్వహిస్తున్న అధికారులు కనీసం నోటీసులు కూడా ఇవ్వకపోవడంపై రైతులు కన్నెర్ర జేశారు. పాలకులు, అధికారుల చుట్టూ తిరిగినా ఎంతకూ పట్టించుకోకపోవడంతో సహనం కోల్పోయారు. దీంతో పలు గ్రామాల ప్రజలు శుక్రవారం గొరిజవోలు గ్రామంలోని రైల్వేట్రాక్‌పై నిర్వహిస్తున్న పనులను అడ్డుకున్నారు. రైతుల అభ్యంతరం మేరకు పనులు ఆపి, ట్రాక్‌ వద్ద నుంచి వారు వెళ్లిపోయాక తిరిగి పనులు ప్రారంభించడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పనులు నిర్వహిస్తే ఆత్మహత్య చేసుకుంటామంటూ భీష్మించుకుని కూర్చోవడంతో అధికారులు పనులు నిలుపుదల చేయకతప్పలేదు. దీంతో రైల్వే డబుల్‌లైన్‌ పనులు మారోమారు నిలిచిపోయాయి.

ఎంత భూమి తీసుకున్నదీ ఎందుకు చెప్పరు?
నాదెండ్ల మండల పరిధిలోని గొరిజవోలు, చందవరం, సాతులూరు గ్రామాల్లో  విజయవాడ ఐఆర్‌ఈఈఎస్‌ అధికా>రులు 2017 మేలో డబ్లింగ్‌ పనులను ప్రారంభించారు. డబుల్‌ లైన్ల ఏర్పాటుకు ఆయా గ్రామాల్లోని రైతుల భూములను సేకరించారు. రెండు ఫేజులుగా నిర్వహించే ఈ పనులకు భూములిచ్చిన రైతులకు ఎంతమేర భూమి సేకరిస్తున్నారో నోటీసులు సైతం అధికారులు ఇవ్వలేదు. ఈ విషయంపై బాధిత రైతులు జిల్లాస్థాయి అధికారులను అనేకమార్లు కలిసి తమ సమస్యను చెప్పుకున్నారు. గతేడాది డిశంబర్‌ 15వ తేదీ నాటికే నోటీసులను ఇచ్చి పరిహారం విషయం కూడా చర్చిస్తామని చెప్పారు. అయితే జనవరి 15 దాటినా తమకు ఎటువంటి సమాచారం అందకపోవడంతో రైతుల్లో గందరగోళం నెలకొంది.

ఈ నేపథ్యంలో బాధిత రైతులంతా కలిసి శుక్రవారం గ్రామంలోని రైల్వేట్రాక్‌ వద్దకు చేరుకున్నారు. నిర్మాణ పనులను అడ్డుకుని నిలుపుదల చేయించారు. తమకు నోటీసులు ఇచ్చి పరిహారం విషయం తేల్చేవరకు పనులను కొనసాగించేందుకు వీల్లేదంటూ పనులను ఆపించారు. గతనెల 24వ తేదీన ఇదే గ్రామంలోని ట్రాక్‌పై పనులు నిలుపుదల చేయడంతో అటు రెవెన్యూ, ఇటు రైల్వే అధికారులు, కాంట్రాక్టర్లు రైతులకు ఫోన్లు చేసి తక్షణమే చర్యలు తీసుకుంటామని చెప్పి పనులు తిరిగి కొనసాగించారు. ఆ తర్వాత సుమారు నెల రోజులు గడుస్తున్నా పట్టించుకోకపోవడంతో రైతులు మళ్లీ పనులను అడ్డుకున్నారు.

ప్రిలిమినరీ నోటీసులు పంపించాం
రైల్వే డబుల్‌ లైన్ల పనులకు మండలంలోని గొరిజవోలులో 16 మంది రైతుల నుంచి 2.92 ఎకరాలను, సాతులూరులో 36 మంది రైతుల నుంచి 6.84 ఎకరాలను సేకరిస్తున్నట్టు ప్రతిపాదనలు గత నెలలోనే కలెక్టర్‌ కార్యాలయానికి పంపించాం. దీనిపై ఉన్నతాధికారులు సమీక్షిస్తున్నారు. తదుపరి           ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటాం. –మేడిద శిరీష, తహసీల్దార్‌

మరిన్ని వార్తలు