చిన్న రైతులు బలి ?

21 Apr, 2018 09:44 IST|Sakshi

పట్టాదారు పాస్‌ పుస్తకాల కేసులో రైతులకు తిప్పలు   

పెద్ద చేపలను వదిలేసిన పోలీసులు

రైతులకు న్యాయం చేయాలని పోలీసులకు మాచర్ల ఎమ్మెల్యే పీఆర్కే వినతి

సాక్షి, అమరావతి బ్యూరో: రెంటచింతల మండలంలోని మిట్టగుడిపాడు గ్రామంలో సంచలనం రేకెత్తిస్తున్న పట్టాదారు పాస్‌ పుస్తకాల బాగోతంలో ఉన్నతాధికారులు పెద్ద చేపల్ని వదిలేసి చిన్న రైతులపై ప్రతాపాన్ని చూపుతున్నారు. గ్రామానికి చెందిన ముగ్గురు బీసీ రైతులు రెండు దశాబ్దాల కిందట బతుకుదెరువు కోసం ప్రభుత్వ పోరంబోకు భూమికి పట్టాలు ఇప్పించాలంటూ స్థానిక అధికారులకు అర్జీలు దాఖలు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో అదే గ్రామానికి చెందిన మరో రైతు గొట్టం సుబ్బారెడ్డి కూడా తమ పూర్వీకులకు సంబంధించిన సర్వే నంబర్‌ 164/బీ /ఎ భూమిని తన కుమారుడు నాసర్‌రెడ్డికి తన ద్వారా ఆయన భార్య పద్మజకు బదిలీ చేస్తూ రిజిస్టర్‌ డాక్యుమెంట్స్‌ ప్రకారం పాస్‌ పుస్తకం తీసుకున్నారు. అయితే 164/బీ/ఎకు బదులు పొరపాటున 163వ సర్వే నంబర్‌పై భూమి బదలాయిస్తూ పట్టాదారు పాస్‌ పుస్తకాన్ని అధికారులు పై ముగ్గురు రైతులతో కలిపి జారీ చేశారు. ఇదే సమయంలో మరో రైతు రాయ నాగిరెడ్డి కూడా తన పూర్వీకుల నుంచి సంక్రమించిన భూమికి పాస్‌ పుస్తకం తీసుకుని అప్పులుపాలై విక్రయించగా మిగిలిన సుమారు 25 సెంట్ల భూమిని కలిగి ఉన్నారు.

రాజకీయ కక్ష సాధింపు చర్య
 పార్టీ రంగు పులిమి అప్పటి వీఆర్‌వో మేకపోతుల కృష్ణారెడ్డిని, అప్పటి తహసీల్దార్‌ శేషగిరిరావు, అప్పటి ఆర్‌ఐ ప్రసాద్‌రావు , గొట్టం సుబ్బారెడ్డి , మిగిలిన రైతుల్ని కార్యాలయానికి గత డిసెంబర్‌లో పిలిపించి ప్రస్తుత తహసీల్దార్‌ జి.లెవి విచారించారు.  పట్టాదారు పాస్‌ పుస్తకాలు కలిగిన ఐదుగురితో పాటు అప్పటి వీఆర్వో మేకపోతుల కృష్ణారెడ్డి, గొట్టం సుబ్బారెడ్డి, గొట్టం నాసరరెడ్డిపై ఎస్‌ఐ యాదాల కోటేశ్వరరావు చర్యలు తీసుకోవడం విస్మయం కలిగిస్తోంది. అసలు పాస్‌పుస్తకం జారీ కావాలంటే వీఆర్‌వో, ఆర్‌ఐ, తహసీల్దార్, ఆర్డీవో అధికారుల సంతకాలు తప్పనిసరి. అయితే, ఈ కేసులో రైతుల్ని , వీఆర్వోలను బలి చేయడం కేవలం రాజకీయ కక్ష సాధింపు చర్యగా భావిస్తున్నారు. అసలు ఈ కేసుకు సంబంధించి బాధ్యులైన ఆర్‌ఐ ప్రసాదరావు, తహసీల్దార్‌ శేషగిరిరావు, ఆర్డీవో శ్రీనివాస్‌పై చర్యలు తీసుకోవకపోవడం ఆశ్చర్యకరం. ఈవిషయమై మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గుంటూరు రూరల్‌ ఎస్పీ అప్పలనాయుడు, గురజాల డీఎస్పీ కె.వి.వి.ఎన్‌.వి. ప్రసాద్‌ దృష్టికి తీసుకెళ్లి పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి రైతులకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు.

మరిన్ని వార్తలు