అన్నదాతలంటే అలుసా

20 Apr, 2018 10:37 IST|Sakshi

గోదాముల్లో దాచుకున్న ధాన్యానికి రుణాలు ఇవ్వని సర్కార్‌

బడ్జెట్‌ రాలేదంటూ సమాధానం

మార్కెట్‌ శాఖ నిధులు రూ.36 కోట్లు ఉన్నా పట్టించుకోని మంత్రి

అన్ని విధాలా నష్టపోతున్న రైతులు

రైతులు పండించిన ధాన్యాన్ని తెగనమ్ముకోవాల్సిన పనిలేదు.. మార్కెట్‌ శాఖ ఆధ్వర్యంలో ఉన్న గోదాముల్లో నిల్వ చేసుకుంటే రైతుబంధు పథకం కింద వడ్డీలేని రుణం అందిస్తాం.. ధాన్యానికి మంచి ధర వచ్చినప్పుడు విక్రయించుకోవచ్చు.. ఇవి పాలకులు ఆర్భాటపు ప్రకటనలు. క్షేత్ర స్థాయిలో పరిశీలిస్తే అందుకు విరుద్ధంగా ఉంది. ధాన్యానికి ధర వచ్చినప్పుడు అమ్ముకుందామని రైతుల ఆశలు అడియాశలే అవుతున్నాయి. బడ్జెట్‌ రాలేదంటూ పాలకులు, అధికారులు మొహం చాటేస్తుండటంతో అన్నదాతలు అవస్థలుపడుతున్నారు. 

నెల్లూరు(సెంట్రల్‌) : జిల్లాలో రైతులు పండించిన ధాన్యాన్ని మార్కెట్‌ శాఖ గోదాముల్లో దాచుకుని, ధర వచ్చినప్పుడు అమ్ముకోవచ్చని ప్రభుత్వం ఆర్భాటంగా ప్రకటించింది. ధాన్యాన్ని దాచుకున్న రైతులకు 75 శాతం వడ్డీలేని రుణం ఇస్తామని చెప్పిన మాటలు నీటి మూటలయ్యాయి. 

రూ.16.40 కోట్ల బడ్జెట్‌  
జిల్లాలో ఈ ఏడాది 2017–18కి గాను గోదాముల్లో దాచుకున్న రైతులకు రూ.16.40 కోట్ల బడ్జెట్‌ కేటాయించింది. మొత్తం 53 గోదాముల్లో 1,156 మంది రైతులు  ఇప్పటికే ధాన్యాన్ని నిల్వ చేసుకున్నారు. ధాన్యం నిల్వ చేసుకున్న రెండు రోజుల్లో రైతులకు నగదు ఇవ్వాల్సి ఉంది. మొత్తం రూ.16.40 కోట్లలో ఇప్పటివరకు రూ.8 కోట్లు రైతులకు ఇచ్చారు. మిగిలిన రూ.7.60 కోట్ల నగదుకు బడ్జెట్‌ ఇంకా విడుదల కాలేదని అ«ధికారులు చెప్పుకొస్తున్నారు. 

రూ.36 కోట్లు ఉన్నా పట్టించుకోరా...?  
మార్కెట్‌ శాఖలో రూ.36 కోట్ల దాకా నిధులు ఉన్నాయి. ఈ నిధులను రైతుల అవసరాలకు వాడుకోవచ్చు. ప్రధానంగా గోదాములు కట్టడానికి , రైతులకు కావాల్సిన వస్తువులు పంపిణీ చేసేందుకు ఈ నిధులు వాడాల్సి ఉంది. ఈ నిధులను మాత్రం బయటకు తీయకుండా బడ్జెట్‌ రాలేదంటూ రైతులను అధికారులు తిప్పుకుంటుండటం గమనార్హం. వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి కనీసం రైతుల కష్టాలపై దృష్టిపెడితే బాగుంటుందని రైతు సంఘాల నాయకులు హితవు పలుకుతున్నారు. బడ్జెట్‌ ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితి ఉండటంతో మార్కెట్‌ శాఖ నిధులు వాడి, బడ్జెట్‌ వచ్చిన తరువాత మార్కెట్‌శాఖ నిధులకు జమ చేయవచ్చని నాయకులు సూచిస్తున్నారు.

17 లక్షల మెట్రిక్‌ టన్నుల దిగుబడి  
జిల్లాలో ఈ ఏడాది సుమారుగా 17 లక్షల మెట్రిక్‌ టన్నులు ధాన్యం దిగుబడి ఉంటుందని అంచనా. గిట్టుబాటు ధర లేక రైతులు ఇబ్బందులు పడుతుంటే ధర వచ్చినప్పుడు అమ్ముకునేందుకు గోదాముల్లో దాచుకుందామనుకుంటే కేవలం 53 మాత్రమే ఉన్నాయి. వాటిలో కూడా 10 గోదాములు పౌరసరఫరాల శాఖ అధీనంలో  ఉన్నాయి. ఉన్న 43 గోదాముల్లో 60 వేల నుంచి 70 వేల టన్నులు మాత్రమే నిల్వ చేసుకునేందుకు వీలు ఉంటుంది. ఈ పరిస్థితులలో రైతులు ధాన్యాన్ని ఎక్కడ దాచుకోవాలో ప్రభుత్వమే సమాధానం చెప్పాల్సి ఉంది. 

ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం 
గోదాముల్లో దాచుకున్న ధాన్యానికి రైతుబంధు పథకం కింద వడ్డీ లేని రుణం రైతులుకు ఇవ్వాల్సి ఉంది. మాకు వచ్చిన నిధుల వరకు ఇచ్చాం. మిగిలింది బడ్జెట్‌ వస్తే ఇస్తాం. ఈ విషయాలన్నీ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకుని వెళుతున్నాం.  
– ఎ.ఉపేంద్రకుమార్, మార్కెట్‌శాఖ ఏడీఎం 

మరిన్ని వార్తలు