చీకట్లో చిమ్ముతున్న కన్నీరు

22 Feb, 2019 13:48 IST|Sakshi

అర్థరాత్రి కరెంట్‌తో అన్నదాతలకు అవస్థలు..!

చీకటివేళ ప్రాణాలు ఫణంగా పెడుతున్న రైతులు

ఓ వైపు కరువు పరిస్థితులు..  మరో వైపు కరెంట్‌ కష్టాలు

ఈ నెల 18న చక్రాయపేటలో పాము కాటుతో రైతు మృతి

సరఫరా వేళలను తప్పుబడుతున్న రైతులు

వ్యవసాయానికి సరఫరా చేసే కరెంటు విషయంలో సర్కారు తాజాగా అవలంభిస్తున్న విధానం జిల్లా రైతులకు పరీక్షగా తయారైంది. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రాణాల మీదకు తెస్తోంది. రాత్రిపూట 9 గంటల కరెంట్‌ సరఫరా కర్షకులకు కష్టాలు తెచ్చిపెడుతోంది. అధికారంలోకి రాగానే వ్యవసాయానికి 7 గంటల నుంచి 9గంటలకు విద్యుత్‌ సరఫరా పెంచుతామని గత ఎన్నికల్లో చంద్రబాబు ప్రకటించారు. అధికారంలోకి వచ్చాక పట్టించుకోక పోగా ఎన్నికలు సమీపిస్తున్న తాజా తరుణంలో 9గంటల విద్యుత్‌ పేరిట కొత్త విధానం ప్రకటించింది. పగటి పూట, తెల్లవారుజామున ఇచ్చే విద్యుత్‌ను అర్థరాత్రి 12 గంటల నుంచి ఇస్తుండటంతో రైతులు అరచేతిలో ప్రాణాలు పెట్టుకుని పొలానికెళ్లాల్సి వస్తోంది. సాగునీటి ఆశతో వెళ్లి ఇబ్బందులు పడుతున్నారు. విషపురుగుల బారిన పడుతూ ప్రాణాలు కోల్పోతున్నారు. ఈనెల 18న చక్రాయపేట మండలం ఎర్రబోమ్మనపల్లెలో వెంకటరామిరెడ్డి అనే రైతు పొలంలోనే పాము కాటుతో మృతి చెందాడు. రెండు రోజులు తిరక్కముందే వేంపల్లె మండలం కుమ్మరాంపల్లె రామాంజనేయులు పాము కాటుకు గురయ్యాడు. కరెంట్‌ సరఫరా వేళల  తీరును రైతులు, ప్రజా సంఘాల నాయకులు తప్పుపడుతున్నారు.

వైఎస్‌ఆర్‌ జిల్లా , చాపాడు: జిల్లాలో ఈ రబీలో 1.60 లక్షల హెక్టార్లలో రైతులు పంటలు సాగు చేశారు. శనగ అధికంగా సాగు కాగా, వరి, వేరుశనగ, ప్రొద్దుటూరు, పత్తి, నువ్వులు, మినుము వంటి పైర్లు సాగులో ఉన్నాయి. వీటిలో శనగ మినహా అన్ని పైర్లు బోరు బావులు, చెరువులు, కుంటలు, కుందూనది పరివాహక ప్రాంతాల్లో సాగు చేస్తున్నారు. ఈ పైర్లన్నీంటికీ విద్యుత్‌ మోటార్ల ద్వారా సాగునీటిని అందించుకుంటున్నారు. ఇప్పటికే సాగునీటి ఇబ్బందులతో శనగ పూర్తిగా దెబ్బతింది. ఈ క్రమంలో శనగ నష్టాలను ఇతర పైర్ల ద్వారా తీర్చుకోవాలనే ఆశలతో ప్రభుత్వం ఇస్తున్న 9గంటల విద్యుత్‌ సరఫరా కోసం పడరాని పాట్లు పడుతున్నారు. కష్టాలెదురవుతాయని తెలిసినా చీకటిని చీల్చుకుంటూ పొలం గట్లపై గడుపుతున్నారు.

జిల్లాలో 1.56 లక్షల విద్యుత్‌ కనెక్షన్లు.. రూ.4.92లక్షల మంది రైతులు..
జిల్లాలోని 50 మండలాల్లో కేసీ కెనాల్‌ఆయకట్టు మినహా బోర్లు, బోరు బావులు, కుందూనది, పెన్నానదుల ఆధారంలో బోర్ల ద్వారా వ్యవసాయం జరుగుతోంది. ఇలా సాగు చేస్తున్న రైతులు 4.92లక్షల మందికి పైగా ఉన్నారు. ప్రతి మండలంలో 9500–11వేల వరకూ రైతులు ఉన్నారు. జిల్లా వ్యాప్తంగా సాగునీటి కోసం 1.56లక్షల విద్యుత్‌ కనెక్షన్లు తీసుకున్న రైతులున్నారు. ప్రస్తుత రబీలో పైరకు విద్యుత్‌ మోటార్ల ఆధారంతో రైతులు సాగునీటిని అందించాల్సి ఉంది.

అర్థరాత్రి కరెంట్‌తో అవస్థలు..
ఈ నెల 17వ తేది నుంచి ప్రభుత్వం వ్యవసాయానికి 9గంటల విద్యుత్‌ ఇస్తోంది. గతంలో ఇచ్చే 7గంటల వేళలకు విరుద్ధంగా సరఫరా చేస్తోంది.  అర్థరాత్రి 12 నుంచి ఉదయం 9గంటల వరకూ ఇస్తుండటంతో మోటార్లు వేసుకుని సాగునీరు పెట్టుకునేందుకు రాత్రిళ్లు రైతులు అగచాట్లు పడుతున్నారు. గతంలో తెల్లవారుజాము 4 నుంచి ఉదయం 11 వరకూ, పగటి పూట 11 నుంచి సాయంత్రం 6 గంటల వరకూ ఇస్తుండటంతో ఇబ్బందులుండేవి కావు.  సాగునీరు పైర్లకు పెట్టుకునేవారు. ఎన్నికలకు రెండు నెలల ముందు ప్రభుత్వం తీసుకున్న 9గంటల సరఫరా నిర్ణయం రైతులకు ప్రాణ సంకటంలా మారింది.  అర్థరాత్రి నుంచి ఇస్తుండటంతో  విష పురుగులు, విద్యుత్‌ ప్రమాదాల ద్వారా రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చాలా మంది రైతుల పొలాలను తడుపుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు. 9 గంటల విద్యుత్‌ మంచిదేని అయితే విడతల వారిగా రైతులకు అనుకూలమైన సయమాల్లో ఇస్తే ఉపయుక్తంగా ఉంటుందని రైతులు అభిప్రాయ పడుతున్నారు.

ప్రభుత్వ ఆదేశాల మేరకే..
అర్థరాత్రి కరెంట్‌ ద్వారా కలిగే ఇబ్బందులపై జిల్లా ట్రాన్స్‌కో ఎస్‌ఈ శివప్రసాద్‌రెడ్డిని వివరణ కోరగా ప్రభుత్వ ఆదేశాల మేరకే ఇస్తున్నామన్నారు. వంతులు వారిగా ఇచ్చినా ఒక వంతులో రాత్రిళ్లు తప్పనిసరిగా ఇవ్వాలిందేని చెప్పారు.

విద్యుత్‌ మోటార్ల ఆధారంతో2.50 ఎకరాల్ల వరి సాగు
కుందూనది పరివాహంలో విద్యుత్‌ మోటారు ఆధారంతో 2.50 ఎకరాల్లో వరి సాగు చేసుకున్నాను. గతంలో ఉన్న కరెంట్‌ విధానంతో ఎలాంటి ఇబ్బందులు లేకుండా సాగునీరు పెట్టుకునేవాళ్లం. ఇప్పుడు ఐదు రోజులుగా రాత్రి సమయాల్లో పొలాల్లో సాగునీటి కోసం ఇబ్బందులు పడుతున్నాము. పగటి పూట కరెంట్‌ ఇస్తే ఉపయుక్తంగా ఉంటుంది.–వెన్నపూస ఓబుళ్‌రెడ్డి, రైతు, మిడుతూరు గ్రామం, ఖాజీపేట మండలం

మరిన్ని వార్తలు