ఐదేళ్లలో 2,635మంది రైతుల ఆత్మహత్య..

5 Apr, 2019 09:44 IST|Sakshi

తుపాకీ పట్టి ప్రభుత్వంపై తిరుగుబాటు చేయడమే నిరశన కాదు. ఆత్మహత్య కూడా ఓ విధమైన నిరశనే. దేశానికింత తిండి పెట్టే ‘సాగు యుద్ధం’లో అన్నదాతలు కన్నుమూస్తున్నారు.సాగు సంక్షోభంతో అల్లాడుతూ రైతులు పిట్లల్లా రాలిపోతున్న వేళ రాష్ట్ర ముఖ్యమంత్రి అత్యధికవృద్ధిరేటును చూపిస్తూ తిమ్మిని బమ్మి చేసి చూపించాలనుకుంటున్నాడు. రాష్ట్రంలో ఇప్పటికీ 67 శాతం మందికి వ్యవసాయమే ఆధారమైనా.. భూమి నుంచి రైతును దూరం చేస్తున్నాడు. వ్యవసాయాన్ని కార్పొరేట్లకు, ప్రపంచ బ్యాంకుకు తాకట్టు పెట్టారు. పంట భూముల్ని విదేశీ సంస్థలకు అప్పగిస్తున్నారు. రాష్ట్రంలో పూటకో రైతుఆత్మహత్య చేసుకుంటుంటే చంద్రబాబు ప్రభుత్వం ఏమీ ఎరగనట్టు, చావులే లేనట్టు నటిస్తోంది. అన్నా హజారే వారసుడిగా, బాబా రాందేవ్‌ భక్తుడిగా, స్వామినాథన్‌ అనుచరుడిగా చెప్పుకునే చంద్రబాబు..
వాళ్లు అడిగీ అడక్క మునుపే వాళ్ల దీక్షలకు మద్దతు తెలిపిన ‘బిగ్‌ బాస్‌’ రాష్ట్రంలో గత ఐదేళ్లలో 2,635 మంది రైతులు బలవన్మరణాలకు పాల్పడితే, కేవలం 169 మందికి మాత్రమే సాయం అందించడం దేనికి సంకేతం? సమస్యను, సంక్షోభాన్ని గుర్తించడానికిబదులు దాటవేయాలని చూడడం గమనార్హం.
– ఆకుల అమరయ్య సాక్షి, అమరావతి

ఆత్మహత్యలకుకారణాలు..
సాగు భూమి తరిగింది. పంటలు విఫలమయ్యాయి. నీటిపారుదల సౌకర్యం కొరవడింది. నకిలీ,కల్తీ విత్తనాలు, అరకొర పరపతిసౌకర్యం, కరవు కాటకాలు, రుణభారం, పెరిగిన ఎరువుల ధరలు, మార్కెట్‌ సౌకర్య లేమి, గిట్టుబాటు ధరలులేకపోవడం, కనీసం పెట్టుబడులు కూడా రాని పరిస్థితుల్లో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. లాభాల మాట అటుంచి ఉత్పత్తి ధర కూడా లేకుండా పోయింది. పంటల బీమా రైతులకు కాకుండా బీమా కంపెనీలకు, రుణాలుఇచ్చే బ్యాంకులకు ఇన్సూరెన్స్‌గా మారింది. కనీసం 5 శాతం మంది రైతులు కూడా దీన్నిఉపయోగించుకోవడం లేదు. పంట చేతికి రాకముందు ఉండే గిట్టుబాటు ధర ఆ తర్వాత ఉండదు. కనీస మద్దతు ధరతో నిమిత్తం లేకుండా దళారులే ఒక ధరను నిర్ణయించి రైతు నెత్తిన రుద్దుతారు. ఉదాహరణకు వరి ధాన్యం కొనుగోలే ఇందుకు సాక్ష్యం. క్వింటాల్‌ ధర రూ.1,750 ఉంటే దళారులు మాత్రం రూ.1,200 నుంచి రూ.1,300 వరకే ఖరారు చేసి కళ్లాల వద్దే కొనుగోలు చేస్తామంటారు. వంద కిలోలకు బదులు 110 కిలోలు తీసుకుంటారు. మరోపక్క స్వామినాథన్‌ కమిషన్‌ సిఫార్సులుఅటకెక్కాయి. భూ సంస్కరణలు మూలనపడ్డాయి.

ఏటికేడూ పెరుగుతున్న ఆత్మహత్యలు
దేశవ్యాప్తంగా ప్రతినిత్యం 35 మంది, రాష్ట్రంలో సగటున ఇద్దరు రైతులు ఆత్మహత్యలు చేసుకోవడం దిగ్భ్రాంతి కలిగిస్తోంది. ఎన్‌సీఆర్‌బీ నివేదిక ప్రకారం వ్యవసాయ సంక్షోభానికి సంబంధించి చంద్రబాబు హయాంలో 123 ఆందోళనలు జరిగాయి. గత ఐదేళ్లలో గ్రామీణ ఆర్థిక వ్యవస్థ ఎంతగా చితికిపోయిందో అందరికీ తెలిసిందే. నిజానికి ప్రతి దినం సగటున రెండు వేల మంది కాడీ మేడీ వదిలిపెట్టి ప్రత్యామ్నాయ అవకాశాలను వెతుక్కుంటున్నట్టు సర్వేలు చెబుతున్నాయి. గిట్టుబాటు ధర ఎండమావై, అప్పుల ఊబిలోంచి బయటకు రాలేక నిస్సహాయ స్థితిలో ఉన్నారు. నేలతల్లి ముద్దుబిడ్డల బలవన్మరణాల ఘోర విషాదం అంతులేని కథలా కొనసాగుతుంటే రాష్ట్రంలో ఆత్మహత్యలే జరగలేదన్నట్టు ముఖ్యమంత్రి చెప్పడం అసమంజసం.. అసత్యం. గత నాలుగేళ్లలో 2,635 మంది ఆత్మహత్యలకు పాల్పడితే చంద్రబాబు మాత్రం అవేమీ జరగనట్టు చెబుతూనే ఏడాదికి సగటున 79 మంది మాత్రమే బలవన్మరణాలకు పాల్పడుతున్నారని సన్నాయినొక్కులు నొక్కారు. ఈ ఏడాది ఖరీఫ్‌ సీజన్‌ జూన్‌ ఒకటి నుంచి డిసెంబర్‌ వరకు దాదాపు 163 మంది ఆత్మహత్యలకు పాల్పడిన మాట నిజం. ఈ ఐదేళ్లలో వ్యవసాయ సంక్షోభం పరిష్కారం దిశగా చంద్రబాబు ఏ చర్యా చేపట్టలేదు. అన్నదాతల ఆత్మహత్యలను వ్యక్తిగత వ్యవహారంగా కొట్టిపారేయడం చంద్రబాబుకే చెల్లింది. చంద్రబాబు అధికారాన్ని చేపట్టిన 2014లో 164 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే 2015లో ఆ సంఖ్య 516కి చేరింది. ఇలా ఏటేటా పెరుగుతూ పోయిందే తప్ప తరగలేదు.

కాకుల్ని కొట్టి గద్దలకువేయడం బాబుకు అలవాటే..
కాకుల్ని కొట్టి గద్దలకు వేసిన చందాన వ్యవసాయ సబ్సిడీలకు ఎగనామం పెట్టి ప్రకృతి సేద్యం, సేంద్రియ వ్యవసాయం మాటున వ్యాపారం చేస్తున్న ప్రభుత్వేతర సంస్థలకు కోట్లకు కోట్లు బాబు దోచిపెట్టిన తీరు రైతు వ్యతిరేకతకు నిదర్శనం. వ్యవసాయం లాభసాటి కాదంటూ దేశానికే వెన్నెముక అయిన రైతు వెన్ను విరుస్తున్నారు. తిరిగి అదే వ్యక్తి వ్యవసాయం మూడు పువ్వులు ఆరు కాయలు అంటారు. సగటున 11 శాతం అభివృద్ధి అని చెబుతారు. ఈ వార్త రాస్తున్న సమయానికి అనంతపురం జిల్లా నార్పల మండలం జంగమరెడ్డిపల్లిలో రైతు వై.శివారెడ్డి రెండు రోజుల కిందట ఆత్మహత్య చేసుకున్నాడు. నాలుగేళ్లుగా పంటలు పండక పోవడం, అప్పులు పెరిగిపోవడం, ప్రైవేటు వ్యాపారుల ఒత్తిడి పెరగడం, దిక్కుతోచని పరిస్థితిలో బలవన్మరణానికి పాల్పడ్డాడు. నూటికి 99 శాతం మంది రైతులు ఇవే కారణాలతో చనిపోతున్నా.. చంద్రబాబు మాత్రం ఉలకడూ పలకడు. కనీసం ఆయా కుటుంబాలను పరామర్శించేందుకు కూడా ఇష్టపడడు. బలవన్మరణాలకు పాల్పడిన కుటుంబాలను ఈ దేశ ప్రధానులు సందర్శించిన సంఘటనలను.. రాజకీయాలలో 40 ఏళ్ల ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు గుర్తుకు తెచ్చుకోవాలి. డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి అయిన కొత్తలో ప్రధాని మన్మోహన్‌ కర్నూలు జిల్లా సోమయాజులపల్లిలో రెండు కుటుంబాలను సందర్శించి ఆర్థికసాయాన్ని ప్రకటించిన విషయాన్ని.. ఇప్పటి తన మిత్రపక్షంగా ఉన్న కాంగ్రెస్‌ నేతల్ని అడిగైనా తెలుసుకోవాలి. చనిపోయిన కుటుంబాల పట్ల చంద్రబాబు వ్యవహరిస్తున్న తీరును ప్రముఖ వ్యవసాయ జర్నలిస్టు పాలగుమ్మి సాయినా«థ్‌ మొదలు సామాజిక విశ్లేషకుడు డాక్టర్‌ కె.నాగేశ్వర్‌ వరకు ఎందరెందరో తూర్పారబడుతున్నారు.

ఎన్నికల ప్రచారంలో బాబు అబద్దాలు..
‘నేను రైతు బిడ్డను. రైతుకు శాశ్వతంగా పెద్దన్నగా ఉండిపోవాలనుకుంటున్నా’ అని చంద్రబాబు ఇటీవలి ఎన్నికల్లో పదే పదే చెబుతున్నారు. వాస్తవానికి చంద్రబాబు గత ఐదేళ్ల కాలంలో రైతుల పాలిట పెద్ద విరోధిగా మారారు. 2014 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ప్రకటించిన రుణమాఫీ ఇంతవరకు పూర్తి కాలేదు. దురదృష్టవశాత్తు మరణించే రైతులకు రూ.5 లక్షల పరిహారం ఇస్తానంటూ ఘనంగా ప్రకటించుకున్న చంద్రన్న రైతు బీమా ఆచూకీ లేకుండా పోయింది.  డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత జయతి ఘోష్‌ కమిటీ సిఫార్సుల మేరకు ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలకు ఇచ్చే పరిహారాన్ని రూ.లక్షన్నరకు పెంచి ఎంతో పకడ్బందీగా అమలు చేశారు. చంద్రబాబు తిరిగి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ మొత్తాన్ని పెంచడానికి సైతం ఇష్టపడలేదు. వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌ అసెంబ్లీలో పదేపదే డిమాండ్‌ చేయడంతో రైతు ఆత్మహత్యలపై తప్పనిసరి పరిస్థితుల్లో పరిహారాన్ని పెంచుతున్నట్టు ప్రకటించి రకరకాల ఆంక్షలు విధించారు. చావును పరిగణనలోకి తీసుకోవడానికి బదులు వయస్సు తారతమ్యాలు పెట్టారు. ఇలా చెప్పి మూడేళ్లు గడిచినా పట్టుమని 200 మందికి కూడా సాయం అందలేదు.

మానవ హక్కులఫోరం నివేదిక ప్రకారం..
‘చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక 2017 జనవరి వరకు 960 మంది రైతులు ఆంధ్రప్రదేశ్‌లో చనిపోయారు. దురదృష్టం ఏమిటంటే కేవలం 96 మంది రైతు కుటుంబాలకు మాత్రమే నష్టపరిహారం అందింది. నిజానికిలా చేయడం రైతుల్ని ఆదుకునేందుకు ఉద్దేశించిన జీవో–62ను తుంగలో తొక్కడమే. ఇంకా విచారకరమేమిటంటే.. ప్రకాశం జిల్లాలో 78 మంది రైతులు బలవన్మరణాలకు పాల్పడితే ఆరుగురికి మాత్రమే సాయం ఇచ్చారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.చంద్రబాబు చెప్పినట్టు వ్యవసాయ రంగమే అంత బాగుంటే ఇంతమంది ఎందుకు చనిపోతున్నారు? 

రెయిన్‌ గన్‌లు పేలిందెక్కడ?

రెయిన్‌ గన్‌ను తానే కనిపెట్టినట్టు చెబుతున్న చంద్రబాబు వర్షాభావంతో ఎండిన పంటను కాపాడే పేరుతో రూ. 164 కోట్లతో 13,334 జల ఫిరంగులు, నిర్వహణ, మరమ్మతుల పేరుతో మరో రూ. 103 కోట్లు, మొత్తం రూ.2 67 కోట్లు ఖర్చు చేసి తుస్సుమనిపించిన మాట నిజం కాగా సుమారు 3 లక్షల హెక్టార్లలో పంటల్ని కాపాడినట్టు సీఎం చెప్పుకున్నారు. చిత్రమేమిటంటే ముఖ్యమంత్రి స్వయంగా అనంతపురం జిల్లా వెళ్లి రెయిన్‌గన్‌ను ప్రారంభించిన రెండెకరాల పంట కూడా ఎండిపోయింది. చివరకు ఆ పొలం యజమాని ఇవాళ బెంగళూరులో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న మాట వాస్తవమైతే 2016–17లోనే 2.54 లక్షల హెక్టార్ల పంటను కాపాడినట్టు చంద్రబాబు చెప్పుకోవడం విడ్డూరం. రెయిన్‌ గన్‌ ఓ అట్టర్‌ఫ్లాప్‌ షో అని, దీనివల్ల ప్రభుత్వానికి, కాంట్రాక్టర్లకు లబ్ధి చేకూరడం మినహా రైతులకు ఒరిగేందేమీ లేదని ప్రతిపక్షాలు ఆ వేళే తీవ్రస్థాయిలో ధ్వజమెత్తాయి. చంద్రబాబు పెట్టిన రైతురథం జన్మభూమి కమిటీ సభ్యులు, పచ్చచొక్కాల పాలైంది. రైతు బీమా ఆవిరైంది. పగటి పూట ఇస్తామన్న 9 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్‌ సర్కారు వారి ఇష్టానుసారమైంది.

ఇదీ జగన్‌ భరోసా
ప్రతి రైతు కుటుంబానికి పెట్టుబడి కోసం రూ.50 వేలు ఇస్తాం. పంట వేసే సమయానికి మే నెలలో రూ.12,500 చొప్పున నాలుగేళ్లపాటు రెండో సంవత్సరం నుంచి ఇస్తాం
పంట బీమా గురించి రైతులు ఆలోచించాల్సిన పనిలేకుండా బీమా ప్రీమియం మొత్తాన్ని మేమే చెల్లిస్తాం. రైతన్నలకు వడ్డీలేని పంట రుణాలు ఇస్తాం
n    రైతులకు ఉచితంగా బోర్లు ఇస్తాం. వ్యవసాయానికి పగటి పూటే 9 గంటలపాటు ఉచిత విద్యుత్‌. ఆక్వా రైతులకు కరెంటు చార్జీలు యూనిట్‌కు రూ.1.50కే ఇస్తాం
రూ.3 వేల కోట్లకు ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు, గిట్టుబాటు ధరకు గ్యారంటీ ఇస్తాం. రూ.4 వేల కోట్లతో ప్రకృత్తి విపత్తుల సహాయ నిధి ఏర్పాటు. ప్రతి మండలంలో శీతలీకరణ గిడ్డంగులు, గోదాములు ఏర్పాటు
మొదటి ఏడాది సహకార రంగాన్ని పునరుద్ధరిస్తాం. రెండో ఏడాది నుంచి సహకార డెయిరీకి పాలు పోసే ప్రతి పాడి రైతుకు లీటరుకు రూ.4 బోనస్‌. వ్యవసాయ ట్రాక్టర్లకు
రోడ్డు ట్యాక్స్‌ రద్దు చేస్తాం
ప్రమాదవశాత్తు లేదా ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబానికి రూ.7 లక్షలు ఇస్తాం. గొర్రెల కాపరులకు చనిపోయిన ప్రతి గొర్రెకు రూ.6 వేలు బీమా అందిస్తాం

మరిన్ని వార్తలు