రైతులను దొంగలతో పోలుస్తారా!

13 Dec, 2014 04:33 IST|Sakshi

- అన్నదాతల ఓట్లతోనే అధికారం పొందారని మరవొద్దు  
- సీఎం చంద్రబాబుపై బాలరాజు ధ్వజం

బుట్టాయగూడెం : ప్రకాశం జిల్లాలో ముఖ్యమంత్రి చంద్రబాబు రైతులను దొంగలతో పోల్చడంపై వైఎస్సార్ సీపీ ఎస్టీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు తెల్లం బాలరాజు మండిపడ్డారు. రైతుల ఓట్లతో గద్దెనెక్కిన చంద్రబాబు అధికారం ఉందన్న అహం కారంతో రుణమాఫీని పూర్తిస్థాయిలో అమలు చేయాలని కోరిన అన్నదాతలను దొంగలుగా పోల్చడం దారుణమన్నారు. బుట్టాయగూడెంలో బాలరాజు శుక్రవారం విలేకరులతో మాట్లాడారు. రైతులను మోసం చేసిన చంద్రబాబు చరిత్రపుటల్లో నిలిచిపోతారని ఎద్దేవా చేశారు.

బాబుకు రైతులే బుద్ధిచెప్పి కాలగర్భంలో కలుపుతారని బాలరాజు చెప్పారు. రూ.50 వేల లోపు రుణాలన్నీ మాఫీ చేస్తానని చెప్పి కొందరు రైతులకే మాఫీని వర్తింప చేసి మోసం చేశారని విమర్శించారు. రైతులు తిరగబడే రోజులు త్వరలోనే రానున్నాయని బాలరాజు తెలిపారు. దివంగత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి పాలన రైతులకు స్వర్ణయుగమని పేర్కొన్నారు. వైఎస్ అనేక సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టి రైతుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారన్నారు. రైతుల రుణాలన్నీ మాఫీ చేశారని గుర్తు చేశారు.

బీడు భూములను సాగు భూములుగా చేశారని, లక్షల ఎకరాలకు సాగు నీరు అందించారని చెప్పారు. మోసపూరిత వాగ్దానాలతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు రైతులతో పాటు డ్వాక్రా మహిళలను కూడా దగా చేశారని మండిపడ్డారు. నిరుద్యోగ భృతి, ఇంటికో ఉద్యోగం ఎక్కడని ప్రశ్నించారు. పార్టీ జిల్లా నాయకుడు ఆరేటి సత్యనారాయణ, మండల కన్వీనర్ సయ్యద్ బాజీ, రేపాకుల చంద్రం, పొడియం శ్రీనివాస్, గె ద్దె వీరకృష్ణ, తెల్లం చిన్నారావు, కుక్కల లక్ష్మణరావు, కొదం కడియ్య పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు