ప్రధానికి అన్నదాతల లేఖలు

21 Jan, 2015 03:46 IST|Sakshi
ప్రధానికి అన్నదాతల లేఖలు

రైతు అంగీకారంతోనే భూసేకరణ చేయాలని వినతి
తాడేపల్లి: ఏడాదికి మూడు పంటలు పండే  భూములను రాజధాని నిర్మాణం నుంచి మినహాయించాలని గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం పెనుమాక, ఉండవల్లి గ్రామాల రైతులు ప్రధాని నరేంద్రమోదీని కోరారు. ఈ మేరకు వారు మంగళవారం పోస్టుకార్డు ఉద్యమం చేపట్టారు. ఇంగ్లిష్, తెలుగులో రాసిన వెయ్యి లేఖలను ప్రైమ్‌మినిస్టర్ ఆఫీస్, రూం నంబర్ 152, రైసీనాహీల్, సౌత్ బ్లాక్, న్యూఢిల్లీ-110001 చిరునామాకు పంపారు. పంటలు పండే తమ భూములు తీసుకుంటే ఆహార భద్రతకు ముప్పువాటిల్లుతుందని లేఖల్లో పేర్కొన్నారు. రైతులు, కూలీల జీవనోపాధి ప్రశ్నార్థకమవుతుందన్నారు.
 
  పంటలు పండే భూముల సేకరణకు రైతు అంగీకారం తప్పనిసరిగా ఉంచాలని కోరారు. 2 వేల ఎకరాలకుపైగా ఉన్న ఇరు గ్రామాల భూముల్లో 20 కోట్ల మందికి సరిపడే ఆహార ధాన్యాలను పండిస్తున్నామన్నారు. రాష్ట్రంలో నాలుగు పం టలు పండే సారవంతమైన భూములు తక్కువ విస్తీర్ణంలోనే ఉన్నాయని, అలాంటి భూములను నాశనం చేయడం సమంజసం కాదని వాపోయారు. రాజధాని నిర్మాణానికి తాము వ్యతిరేకం కాదని, పంట భూముల సేకరణలో తమ గ్రామాలను మినహాయించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడు తూ అన్నదాతే దేశానికి వెన్నెముక అన్న ప్రధాని తమకు న్యాయం చేస్తారని భావిస్తున్నామని చెప్పారు. ప్రభుత్వం నియంతృత్వ పోకడనే అనుసరిస్తే అన్నదాతలంతా ఏకమై ఉద్యమం చేపడుతామని స్పష్టం చేశారు.

మరిన్ని వార్తలు