దమ్ము రేపుతున్న పవర్‌ టిల్లర్‌

9 Jul, 2019 09:44 IST|Sakshi
పవర్‌టిల్లర్‌తో దమ్ము చేస్తున్న దృశ్యం

జిల్లాలో జోరుగా సార్వా పనులు

ఆధునిక యంత్రాలతో సులువుగా దమ్ము పనులు

పాలకొల్లు సెంట్రల్‌: జిల్లాలో సార్వా పంట దమ్ము పనులు జోరుగా సాగుతున్నాయి. అడపాదడపా వర్షాలు, కాల్వల నుంచి వదులుతున్న నీటితో డెల్టాలో పనులు జోరందుకున్నాయి. రైతులు దమ్ము పనులు వేగవంతం చేశారు. గతంలో నాగళ్లకు ఎడ్లను కట్టి దమ్ము పనులు చేసేవారు. ఆ తరువాత ట్రాక్టర్లు రావడంతో పని సులవైంది. అయితే ఇప్పుడు రైతులు పవర్‌ టిల్లర్‌తో దమ్ము పనులు చేస్తున్నాడు. వరి సాగు అనగానే దమ్ము పనులు ఎంతో కీలకం. గతంలో ఇంత ఆయకట్టుకు ఒక ట్రాక్టర్‌ను మాట్లాడుకుని దమ్ము పనులు చేసేవారు. ఉభయ గోదావరి జిల్లాల నుంచి ట్రాక్టర్లు ప్రకాశం, గుంటూరు జిల్లాలకు వెళ్లి సుమారు నెల రోజులు అక్కడే ఉండి పనులు చేసుకునేవారు. నేడు వ్యవసాయ శాఖ సబ్సిడీపై ఇచ్చే పవర్‌ టిల్లర్‌లతో రైతులు సొంతంగానే దమ్ము పనులు చేసుకుంటున్నారు. ఇటీవల కాలంలో పవర్‌ టిల్లర్‌ ప్రయోజనాలపై రైతులకు అవగాహన పెరగడంతో వాటి వైపు మొగ్గుచూపుతున్నారు. 

ఎకరాకు ఐదారు లీటర్ల ఆయిల్‌ ఖర్చు

పవర్‌ టిల్లర్‌తో దమ్ము చేస్తే ఎకరాకు సుమారు ఐదు లేక ఆరు లీటర్లు ఆయిల్‌ ఖర్చవుతుంది. ఇలా రోజుకు దాదాపుగా ఐదారు ఎకరాల్లో దమ్ము చేయవచ్చని రైతులు చెబుతున్నారు. ఈ యంత్రంతో దమ్ము చేయడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయని వ్యవసాయ అధికారులు అంటున్నారు. ట్రాక్టర్లతో చేస్తే సుమారు రెండు అడుగులు లోతు వరకూ దిగిపోతుంది. దీనివల్ల పంట దిగుబడుల్లో ఇబ్భందులు ఎదురవుతున్నాయి. అదీ కాక ట్రాక్టర్లతో దమ్ము చేసే సమయంలో ఒక్కోసారి ట్రాక్టర్లు పైకి లేచిపోవడం తిరగబడడంతో ట్రాక్టర్‌ డ్రైవర్లుకు ప్రాణనష్టం జరిగిన సందర్భాలు అనేకం ఉన్నాయి. పవర్‌టిల్లర్‌తో అలాంటి ప్రమాదాలకు చెక్‌పెట్టవచ్చు. మరో మనిషి అవసరం లేకుండా దమ్ము చేసుకునే వెసులుబాటు ఉంది. పొలం పనులకు కావలసిన సామగ్రిని దీనిపై తీసుకెళ్లిపోవచ్చు. ఈ పవర్‌టిల్లర్‌పై కూర్చుని చేయడానికి సీటు కూడా ఏర్పాటుచేసుకునే అవకాశం ఉంటుంది.

పవర్‌టిల్లర్‌తో ప్రయోజనాలు

పవర్‌టిల్లర్‌తో దమ్ము 15 అంగుళాల లోతు వరకే జరగడంతో వరినాట్లు పైపైన వేయడానికి అనుకూలంగా ఉంటుంది. వరిపంట వేర్ల వ్యవస్థ ఆరు అంగుళాలు ఉంటుంది. పవర్‌టిల్లర్‌ దమ్ముతో వరి మొక్క వేగంగా పెరగడానికి అవకాశం ఉంటుంది. ఎరువులు కూడా బాగా అందుతాయి. పవర్‌టిల్లర్‌ దమ్ము చేయడానికే కాకుండా బావులు, కాలువల నుండి పొలాలకు నీరు తోడుకోవడానికి ఉపయోగపడుతుంది. దీనికి పంకాలు ఏర్పాటుచేసి ధాన్యం ఎగరబోతకు ఉపయోగించుకోవచ్చు. 1.5 టన్నుల వరకూ బరువును తీసుకువెళ్లే వెసులుబాటు కలుగుతుంది. పవర్‌టిల్లర్‌కు 13 హెచ్‌పీ సామర్థ్యం గల ఇంజిన్‌ ఉంటుంది.  

>
మరిన్ని వార్తలు