‘కోవిడ్‌’ పేరిట రైతులకు బురిడీ

17 Feb, 2020 04:19 IST|Sakshi

మిర్చి వ్యాపారుల తప్పుడు ప్రచారంతో నష్టపోతున్న రైతులు 

15 రోజుల క్రితం దాకా రూ.22 వేలు పలికిన మిర్చి  

కోవిడ్‌ ప్రభావంతో చైనాకు ఎగుమతులు నిలిచిపోయాయంటున్న వ్యాపారులు  

క్వింటాల్‌ మిర్చి రూ.8 వేల నుంచి రూ.13,500కు కొనుగోలు 

సాక్షి, అమరావతి: కోవిడ్‌ వైరస్‌ పేరుతో మిర్చి వ్యాపారులు రైతులను నిలువునా దోచేస్తున్నారు. ఈ వైరస్‌ కారణంగా చైనాకు ఎగుమతులు నిలిచిపోవడంతో మిర్చి ధరను సగానికి సగం తగ్గించి కొనుగోలు చేస్తున్నారు. 15 రోజుల క్రితం దాకా క్వింటాల్‌ రూ.22 వేలకు కొనుగోలు చేసిన వ్యాపారులు ప్రస్తుతం రూ.8,000 నుంచి రూ.13,500లకు కొంటున్నారు. మరో మార్గం లేక రైతులు పంటను అమ్ముకుంటున్నారు. వ్యాపారులు ఆ మిర్చిని ఇతర రాష్ట్రాలకు, బంగ్లాదేశ్‌కు ఎగుమతి చేస్తూ భారీగా సొమ్ము చేసుకుంటున్నారు. కొందరు వ్యాపారులు సమీప భవిష్యత్తులో ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తూ కోల్డు స్టోరేజీల్లో మిర్చీని నిల్వ చేస్తున్నారు.  

ఇతర రాష్ట్రాల్లో అధిక డిమాండ్‌ 
ప్రతి సంవత్సరం గుంటూరు నుంచి చైనాకు 1.30 లక్షల మెట్రిక్‌ టన్నుల మిర్చి ఎగుమతి అవుతోంది. ఈ ఏడాది సీజను ప్రారంభమైన మొదటి రెండు నెలల్లో 20 వేల మెట్రిక్‌ టన్నుల సరుకు ఎగుమతి అయింది. కోవిడ్‌ వైరస్‌ కారణంగా ఫిబ్రవరి మొదటి వారం నుంచి ఎగుమతులు నిలిచిపోయాయి. క్వింటాల్‌ రూ.22 వేలు పలికిన మిర్చీ ధర రూ.8 వేలకు పడిపోయింది. ఎటువంటి తాలు లేని మిర్చి గుంటూరు మార్కెట్‌ యార్డులో రూ.13,500 పలుకుతోంది. చైనాకు ఎగుమతులు నిలిచినా ఇతర రాష్ట్రాలు, బంగ్లాదేశ్‌లో మంచి మిర్చికి డిమాండ్‌ ఉంది. చైనాకు ఇప్పట్లో ఎగుమతులు తిరిగి ప్రారంభమయ్యే అవకాశం లేదంటూ వ్యాపారులు మాయ మాటలు చెబుతూ రైతుల నుంచి తక్కువ ధరకే పంటను కొనుగోలు చేస్తున్నారు. 

మార్కెటింగ్‌ శాఖ నిర్లక్ష్యం  
గుంటూరు నుంచి బంగ్లాదేశ్‌కు ప్రతిఏటా 30 వేల నుంచి 50 వేల మెట్రిక్‌ టన్నులు మిర్చి ఎగుమతి జరుగుతోంది. ఇప్పుడు చైనాకు ఎగుమతులు నిలిచిపోవడంతో వ్యాపారులంతా రోజుకు 500 నుంచి 1,000 టన్నులను బంగ్లాదేశ్‌కు ఎగుమతి చేస్తున్నారు. ప్రస్తుతం మిర్చికి ఇతర రాష్ట్రాల్లో డిమాండ్‌ అధికంగానే ఉందన్న విషయాన్ని మార్కెటింగ్‌ శాఖ ప్రచారం చేయకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు.  

వ్యాపారుల ప్రచారాన్ని నమ్మి మోసపోవద్దు  
‘‘గుంటూరు మిర్చి యార్డులో మంచి ధర లభిస్తుంది. జనవరి నెలాఖరు వరకు గుంటూరు యార్డుకు రోజుకు 1.20 లక్షల బస్తాల (ఒక బస్తా 40 కిలోలు) మిర్చీ వచ్చింది. ప్రస్తుతం చైనాకు ఎగుమతులు నిలిచిపోయాయి. గ్రామాల్లోని వ్యాపారులు రైతుల నుంచి పంటను కొనుగోలు చేస్తుండటంతో రోజుకు దాదాపు 70 వేల బస్తాలే యార్డుకొస్తున్నాయి. మార్కెట్‌ పరిస్థితులను తెలుసుకుంటూ పంటను మంచి ధరకు అమ్ముకోవాలి. వ్యాపారుల ప్రచారాన్ని నమ్మి మోసపోవద్దు’’  
– వెంకటేశ్వరరెడ్డి, సెక్రెటరీ, గుంటూరు మిర్చి యార్డు    

మరిన్ని వార్తలు