చేయి చేయి కలిపి...

18 Jul, 2019 12:05 IST|Sakshi
సాగునీరు నిల్వ చేసేందుకు ఇసుక బస్తాలతో కరకట్టను నిర్మిస్తున్న రైతులు

సాక్షి, ఇచ్ఛాపురం (శ్రీకాకుళం) : ఆ ఏడు గ్రామాల్లోని ప్రజల కడుపు నిండాలంటే...పంట పొలాల్లోకి బాహుదానది నీరు చేరాలి. సాగునీరు పంట పొలాల్లోకి చేరాలంటే కరకట్టల నిర్మాణానికి రైతులు నడుం కట్టాలి. చేయి చేయి కలపాలి...సొంత సొమ్ము ఖర్చుపెట్టాలి. ఇదీ గత ఐదేళ్ల నుంచి ఇచ్ఛాపురం మండలం కేశుపురం, బూర్జపాడు పంచాయతీ పరిధిలో ఉన్న 7 గ్రామాలకు చెందిన రైతన్నల ఖరీఫ్‌ కష్టాలు. స్థానిక బాహుదానది నుంచి వచ్చే నీటిపైనే ఆధారపడి కేశుపురం, బూర్జపాడు గ్రామ పంచాయతీలకు చెందిన 3 వేల మందికి పైగా రైతులు సుమారు 2,500 ఎకరాల్లో పంటలు పండిస్తున్నారు. ఈదుపురం వంతెనకు సమీపంలో ఉన్న ఓల్డ్‌ కేశుపురం గ్రోయిన్‌నే నమ్ముకొని రైతులు పంటలు పండిస్తుంటారు.

ఖరీఫ్‌ సీజన్‌లో అధికంగా వర్షాలు కురిసినప్పుడు వరద నీరు పంట పొలాల వైపుకు దూసుకు రాకుండా ఈ గ్రోయినే రైతులకు శ్రీరామరక్షగా నిలుస్తోంది. పంట పొలాలకు కావాల్సిన నీటిని తీసుకొని మిగతా నీటిని బంగాళాఖాతానికి మళ్లిస్తూ తమ పంట పండించుకుంటూ వస్తున్నారు. అప్పుడప్పుడు ఈ గ్రోయిన్‌ మరమ్మతులకు గురైతే రైతులే శ్రమదానం చేస్తూ తమ పంటలను రక్షించుకుంటున్నారు. విషయాన్ని రైతులు గత ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లగా, స్థానిక ఎమ్మెల్యే బెందాళం అశోక్‌ రూ.71 లక్షలతో 2016–17 సంవత్సరంలో గ్రోయిన్‌ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. దీంతో తమ ఆశలు ఫలిస్తాయంటూ స్థానిక రైతులు సంబరాలు చేసుకున్నారు. ప్రజా ప్రతినిధులకు సత్కారాలు చేశారు.

గ్రోయిన్‌ మరమ్మతులు పేరిట రాయిని పేర్చి చేతులు దులుపుకున్నారు. అంతే గ్రోయిన్‌ నిర్మాణం సంగతినే సదరు ప్రజాప్రతినిధులు మరిచిపోయారు. గతేడాది వచ్చిన తిత్లీ తుఫాన్‌కు బాహుదానదిలో అధికంగా వరద నీరు చేరడంతో మరమ్మతుకు గురైన గ్రోయిన్‌ పూర్తిగా ధ్వంసమయింది. విషయం తెలుసుకున్న సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు సంఘటనా స్థలానికి చేరుకొని రైతులను ఓదార్చారు. తమ ప్రభుత్వం హయాంలో నిలిచిపోయిన పనులు వెంటనే చేయిస్తామంటూ మాట సైతం ఇచ్చి తప్పించుకున్నారు. ‘ఎవరో వస్తారని, ఏదో చేస్తారని ఎదురు చూసి మోసపోకుమా’ అన్న సినీ గేయాన్ని ఐదేళ్లలో బాగా వంటబట్టించుకున్న రైతులు ఖరీఫ్‌ సీజన్‌లో తమ పంటలను తామే రక్షించుకోవాలనే నిర్ణయానికి వచ్చారు. అందుకు తగ్గట్టుగానే 7 గ్రామల రైతులంతా చేయిచేయి కలిపారు. 

రూ.7 లక్షలతో శ్రమదానం
ఈ ఏడాది తాత్కాలిక పనులు చేపట్టి పంటను రక్షించుకునే ఆరాటంలో రైతులు పడ్డారు. పనులు చేపట్టాలంటే సుమారు రూ.7లక్షల వరకు ఖర్చవుతోంది. ఈ మొత్తాన్ని కేశుపు రం, బూర్జపాడు పంచాయతీలకు చెందిన రైతులే భరించుకునేందుకు ముందుకు వచ్చా రు. సెంటు భూమికి రూ.5 చొప్పున్న ఎకరా రైతుకు రూ.5 వేలు చందాగా ఇవ్వాలని రైతులు తీర్మానించారు. అనుకున్నదే తడువుగా శ్రమదానంతో పనులు మొదలుపెట్టారు.

స్పందించిన కలెక్టర్‌
అధికారంలోకి వచ్చిన నూతన ప్రభుత్వం వైఎస్సార్‌సీపీపైనే రైతులు ఆధారపడ్డారు. తమను కష్టాల నుంచి గట్టెక్కించాలంటూ రైతులంతా కలసి వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే పిరియా సాయిరాజును కలిసి విన్నవించుకున్నారు. తక్షణమే స్పందించిన ఆయన గత నెల కలెక్టర్‌ నివాస్‌ను స్వయంగా కలిసి విన్నవించుకున్నా రు. తాత్కాలిక మరమ్మతుల కోసం తక్షణ సా యం రూపంలో సంబంధిత శాఖ ద్వారా రూ. 4 లక్షల 80 వేలు నిధులు మంజూరు చేస్తామంటూ హామీ ఇవ్వడంతో రైతులు హర్షం వ్యక్తం చేశారు. పదిహేను రోజుల నుంచి రైతులు తమ సొంత సొమ్ముతో జేసీబీ, ట్రాక్టర్ల సాయంతో పనులు ప్రారంభించారు. వందలాది ఇసుక బస్తాలతో కరకట్ట నిర్మించి తమ పంట పొలాలకు సాగునీరు అందేటట్టు దీక్షబూనారు. 

ప్రతి ఏటా పంటను కోల్పోతున్నాం
బాహుదానదిలో నీరు అధికం కావడంతో ప్రతి ఏటా పంటను కోల్పోతున్నాం. గ్రోయిన్‌ పాడైపోవడంతో పంట పొలాలకు కావాల్సినంత సాగునీరు దొరకడంలేదు. అవసరమైన పరిస్థితుల్లో సాగునీరు వృథాగా సముద్రంలో కలసిపోతుంది. పలుమార్లు జిల్లా ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకువెళ్లాం. ప్రభుత్వం స్పందించి మాకు న్యాయం చేయాలి.
– దున్న లోకనాథం, రైతు, డొంకూరు గ్రామం

చందాలు పోగుచేసి శ్రమదానం చేస్తున్నాం
గత ప్రభుత్వం చేతగాని తనం వల్ల మా రైతులమంతా భారీగా నష్టపోయాం. పదవులపై ఉన్న చిత్తశుద్ధి పనులపై లేకపోవడంతో గ్రోయిన్‌ పనులు నామమాత్రంగా చేసి చేతులు దులుపుకున్నారు. ఇప్పుడు ప్రతీ రైతు ఎకరా పొలంకు రూ.5 వేలు చందా ఇవ్వాల్సివస్తోంది. అధికారులు శాశ్వత పరిష్కారం కోసం చర్యలు తీసుకోవాలి.
– పిలక వెంకటరావు, రైతు, కేశుపురం

మరిన్ని వార్తలు