లక్ష్మీపేటలో ఫాస్ట్‌ట్రాక్ కోర్టు నేడు ప్రారంభం

1 Feb, 2014 03:35 IST|Sakshi

 లక్ష్మీపేట(వంగర), న్యూస్‌లైన్: వంగర మండల పరిధి లక్ష్మీపేటలో 2012 జూన్ 12వ తేదీన జరిగిన దళితుల మారణకాండ నేపథ్యంలో మంజూరైన ప్రత్యేక-ఫాస్ట్‌ట్రాక్ కోర్టు శనివారం ప్రారంభం కానుంది. మడ్డువలస రిజర్వాయర్ పరిధిలోని మిగులు భూముల విషయంలో బీసీ, ఎస్సీ వర్గాల మధ్య జరిగిన ఘటనలో ఐదుగురు దళితులు ప్రాణాలు కోల్పోగా.. మరో 19 మంది గాయపడ్డారు. ఈ ఘటన రాష్ట్రాన్ని కుదిపేసింది. దీనిపై రాష్ర్టస్థాయిలో వివిధ దళిత సంఘాలు, న్యాయవాదుల సంఘాలు హైదరాబాద్, ఢిల్లీలో ఆందోళనలు, ధర్నాలు చేసి ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం స్పందించి లా అండ్ హోమ్‌కోర్టు డిపార్ట్ మెం ట్ ద్వారా 2012 డిసెంబర్ 24వ తేదీన ఆర్‌సీ నంబర్ 103 ద్వారా కోర్టును మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో 19 నెలల సుదీర్ఘ కాలం అనంతరం లక్ష్మీపేటలో ప్రత్యేక న్యాయం స్థానం నిర్మించారు.
 
  ఇరువర్గాలను ఇక్కడే విచారణ చేపట్టి న్యాయన్యాలపై సమగ్ర విచారణ జరుపుతారు. ఈ ఘటనకు సంబంధించి క్రైం నంబరు 24/2012పై 72 మంది పైచిలుక నిందితులపై విచారణ జరుపుతారు. ఈ కేసు సీబీసీఐడీ ఆధ్వర్యంలో దర్యాప్తు జరిగింది. ఈ క్రమంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కోర్టును హైకోర్టు జడ్జి ఏవీ శేషసాయి ప్రారంభించనున్నారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాలు, హైదరాబాద్‌కు చెందిన జ్యూడీషియల్ ఆఫీసర్ల బృందంతోపాటు జిల్లా జడ్జి బి.ఎస్.భానుమతి, బార్ అసోషియేషన్ అధ్యక్షుడు పొన్నాడ వెంకటరమణ, పలువురు న్యాయవాధులు హాజరుకానున్నారు.
 
 పటిష్ట పోలీస్ భద్రత
 కోర్టు ప్రారంభానికి పలువురు వస్తున్న నేపథ్యంలో లక్ష్మీపేటలో పటిష్ట పోలీస్ భద్రత ఏర్పాటు చేశారు. సీబీసీఐడీ, జిల్లా పోలీస్ యం త్రాంగం భద్రతను కట్టుదిట్టం చేసింది. ఇప్పటికే కోర్టు భవనాలకు సంబంధించి పెండింగ్ పనులను సంబంధిత అధికారులు  పూర్తి చేశారు.
 
 ప్రత్యేక కోర్టును పరిశీలించిన ఏజేసీ
 లక్ష్మీపేట గ్రామంలోని ప్రత్యేక కోర్టును ఏజేసీ ఆర్‌ఎస్ రాజ్‌కుమార్ శుక్రవారం పరిశీలించారు. శనివారం నాటి కార్యక్రమాల ఏర్పాట్లపై ఆర్డీఓ తేజ్‌భరత్‌తో సమీక్షించారు. సమస్యలు గుర్తించి పరిష్కారానికి అక్కడికక్కడే చర్యలు తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఈఈ జగ్గారావు, తహశీల్దార్ ఏవీ రమణమూర్తి, లిల్లీపుష్పనాథం, రెవెన్యూ, ట్రాన్స్ అధికారులు పాల్గొన్నారు.
 
 నేడు హైకోర్టు న్యాయమూర్తి రాక
 శ్రీకాకుళం లీగల్ : శ్రీకాకుళం జిల్లా పోర్టు పోలియో హైకోర్టు న్యాయమూర్తి ఏవీ శేషసాయి శనివారం జిల్లాకు రానున్నారు. ఉదయం ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్‌లో ఆమదాలవలసలో దిగి జిల్లా కేంద్రంలో విశ్రాంతి తీసుకున్న అనంతరం అరసవల్లి, శ్రీకూర్మం దేవాలయాలను సందర్శిస్తారు. అనంతరం వంగర మండలం లక్ష్మీపేటలో ఏర్పాటు చేస్తున్న ప్రత్యేక కోర్టును ప్రారంభిస్తారు. అనంతరం శ్రీకాకుళం వచ్చి సాయంత్రం 4.30 గంటలకు బార్ అసోసియేషన్‌లో న్యాయవాదులనుద్దేశించి ప్రసంగిస్తారని బార్ అసోసియేషన్ అధ్యక్ష కార్యద్శులు పొన్నాడ వెంకటరమణ, రెడ్డాపు శ్రీకృష్ణప్రసాద్‌లు తెలిపారు.

>
మరిన్ని వార్తలు