‘ఫాస్ట్‌’గా  వెళ్లొచ్చు!

12 Jan, 2020 10:11 IST|Sakshi
అగనంపూడి టోల్‌ప్లాజా వద్ద విశాఖ వైపు మార్గంలోని నాలుగు లైన్లలో మూడు ఫాస్టాగ్‌ వాహనాల కోసం కేటాయించిన దృశ్యం (ఇన్‌సెట్‌లో) ఫాస్టాగ్‌ స్టిక్కర్‌

15 నుంచి పక్కాగా ఫాస్టాగ్‌ నిబంధనలు అమలు

సంక్రాంతి సెలవులకు సొంతూళ్లకు కార్లలోనే ప్రయాణం

జాతీయ రహదారిపై టోల్‌ప్లాజాలకు పెరగనున్న తాకిడి

రాక, పోక మార్గాల్లో మూడేసి లైన్లు

ఫాస్టాగ్‌ లేని వాహనాలకు క్యాష్‌ లైనే దారి

పొరపాటున ఫాస్టాగ్‌ లైన్‌లోకి వెళ్లినా రెట్టింపు బాదుడు

70 శాతానికి చేరిన ‘ఫాస్టాగ్‌’ రిజిస్టేషన్‌ వాహనాలు

సాక్షి, విశాఖపట్నం: వాహనదారులకు టోల్‌ ప్లాజాల వద్ద కష్టాలు తప్పనున్నాయి. దీనికి కారణం ఫాస్టాగ్‌ విధానం అమల్లోకి రానుండడమే. సాధారణంగా టోల్‌ ఫీజు చెల్లించడానికి ఒక్కో వాహనానికి కనీసం ఐదు నిమిషాలు పడుతోంది. ఈ పరిస్థితిల్లో టోల్‌ప్లాజా వద్ద ఆగకుండానే వాహనాలు వెళ్లిపోవడానికి జాతీయ రహదారుల సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ) ఎలక్ట్రానిక్‌ టోల్‌ వసూలు చేసేందుకు ఫాస్టాగ్‌ విధానాన్ని తీసుకొచ్చింది. విశాఖ శివారులోని అగనంపూడి సహా జిల్లాలోని నాలుగు టోల్‌ప్లాజాల వద్ద ప్రత్యేక “ఫాస్టాగ్‌’లైన్లు ఇప్పటికే ఏర్పాటు చేశారు. ఇప్పటివరకూ నగదు రూపేణా టోల్‌ చెల్లించి వెళ్లడానికి ఉన్న క్యాష్‌ లైన్లు తగ్గించేశారు. ఉదాహరణకు అగనంపూడి టోల్‌ప్లాజా వద్ద రాక, పోక మార్గాల్లో నాలుగేసి చొప్పున మొత్తం ఎనిమిది మార్గాలు ఉన్నాయి. వాటిలో రాక, పోక మార్గాల్లో ఒక్కొక్కటి మాత్రమే క్యాష్‌ లైన్‌ ఉంటుంది. మూడేసి చొప్పున ఆరు లైన్లు ఫాస్టాగ్‌ ఉన్న వాహనాల కోసం కేటాయించారు. ఇప్పటివరకూ ఈ లైన్లలో ఫాస్టాగ్‌ ఉన్న వాహనాలే గాక నగదు రూపేణా టోల్‌ చెల్లించే వాహనాలనూ అనుమతిస్తున్నారు. ఈనెల 15వ తేదీ నుంచి అలా కుదరదు. ఫాస్టాగ్‌ ఉన్న వాహనాలనే సంబంధిత లైన్లలోకి అనుమతిస్తామని ఎన్‌హెచ్‌ఏఐ అధికారులు చెబుతున్నారు. ఒకవేళ ఫాస్టాగ్‌ లేని వాహనాలు ఆ మార్గాల్లో వెళ్తే రెట్టింపు టోల్‌ (రుసుం) వసూలు చేస్తారు.

సంక్రాంతికి వాహనాల తాకిడి.. 
నక్కపల్లి, విశాఖ నగరంలో అగనంపూడి, పోర్టు అనుసంధాన మార్గంలోని పంచవటి, డాక్‌యార్డు టోల్‌ప్లాజాలు ఉన్నాయి. నక్కపల్లి టోల్‌ప్లాజా రాజమండ్రి రీజియన్‌లో ఉండగా.. మిగతా మూడు విశాఖ పరిధిలో ఉన్నాయి. జిల్లాలోని టోల్‌ప్లాజాల్లో అగనంపూడి, నక్కపల్లి జాతీయ రహదారి (ఎన్‌హెచ్‌ 16)పై ఉండటంతో ఇవెంతో కీలకమైనవి. అక్కడ సగటున రోజుకు 35 వేల నుంచి 40 వేల వాహనాలకు సంబంధించిన టోల్‌ చెల్లింపులు జరుగుతున్నాయి. రాక, పోక మార్గాల్లోని ఎనిమిది లైన్లలో ప్రయాణించే వాహనాలకు సంబంధించి టోల్‌ చెల్లించడానికి ఒక్కో వాహనానికి కనిష్టంగా ఐదు నిమిషాల సమయం పడుతోంది. దీంతో సాధారణ రోజుల్లో టోల్‌ప్లాజా దాటడానికి పది నిమిషాల సమయం పడుతోంది. సంక్రాంతి, దసరా వంటి పండుగల సమయాల్లో వాహనాల తాకిడి మూడు రెట్లు పెరుగుతుండాయి. ఇప్పటికే సంక్రాంతి సెలవులు ఇచ్చేయడంతో ఆదివారం నుంచి రోజూ లక్ష వాహనాల వరకూ రాకపోకలు సాగిస్తాయని ఎన్‌హెచ్‌ఏఐ అధికారులు అంచనా వేస్తున్నారు.

 ఫాస్టాగ్‌ లేకుంటే ఇబ్బందే...
జిల్లాలోని నాలుగు టోల్‌ప్లాజాల వద్ద గత డిసెంబరు ఒకటో తేదీ నుంచే ఫాస్టాగ్‌ లైన్లను పక్కాగా అమలు చేయడానికి ఎన్‌హెచ్‌ఏఐ అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. అందుకు ట్రయల్‌ రన్‌ కూడా నిర్వహించారు. కానీ ప్రజాప్రతినిధులు, వాహనదారుల సంఘాల వినతి మేరకు ఆ గడువు పెంచుకుంటూ వచ్చారు. ఈనెల 15 నుంచి టోల్‌ప్లాజాల వద్ద రాక, పోక మార్గాల్లో ఒక్కొక్కటి చొప్పున మాత్రమే టోల్‌ రుసుం చెల్లింపు కౌంటర్లు ఉంటాయి. మిగతావన్నీ ఫాస్టాగ్‌ లైన్లే. ఫాస్టాగ్‌ రిజిస్ట్రేషన్‌ ఉన్న వాహనాల్లో ప్రయాణం సాఫీగా సాగిపోతుంది. లేని వాహనాలకు రాక, పోక మార్గాల్లో క్యాష్‌ లైను ఒక్కొక్కటి మాత్రమే ఉండటంతో టోల్‌ప్లాజా దాటడానికి ఎక్కువ సమయం పట్టవచ్చు. ఎంత రద్దీ ఉన్నా ఫాస్టాగ్‌ లైనులోకి మాత్రం వెళ్లకూడదు.

70 శాతానికి చేరిన ‘ఫాస్టాగ్‌’
ఫాస్టాగ్‌ రిజిస్ట్రేషన్‌ చేసుకున్న వాహనదారులకు ప్రత్యేక స్టిక్కర్‌ ఇస్తున్నారు. దీన్ని ఏ వాహనం నంబరుతో కొనుగోలు చేశారో ఆ వాహనం కోసమే వినియోగించాలి. ఈ స్టిక్కర్‌ను వాహనం అద్దంపై కుడివైపు పైభాగంలో అతికించాలి. ఈ స్టిక్కర్‌పైనున్న చిప్‌ను, బార్‌ కోడ్‌ను స్కాన్‌ చేయడానికి శక్తివంతమైన రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్‌ డివైస్‌ (ఆర్‌ఎఫ్‌ఐడీ)లను టోల్‌ప్లాజాల వద్ద ఏర్పాటు చేశారు. వాహనం టోల్‌ప్లాజా సమీపంలోకి వస్తున్నప్పుడే ఇవి స్కాన్‌ చేస్తాయి. దీంతో ఆ వాహనానికి చెల్లించాలి్సన టోల్‌ ఫాస్టాగ్‌కు అనుసంధానమైన బ్యాంకు ఖాతా నుంచి చెల్లింపు క్షణాల్లో జరిగిపోతుంది. ఆ సమాచారం వాహనదారుని సెల్‌ఫోన్‌కు వస్తుంది. ప్రస్తుతం టోల్‌ప్లాజా వద్దకు వస్తున్న వాహనాల్లో ఫాస్టాగ్‌ ఉన్నవి 70 శాతం వరకూ ఉంటున్నాయి. వీటిని వంద శాతం చేసేలా అధికారులు కృషి చేయాలని ఇటీవల విశాఖలో జరిగిన పార్లమెంటరీ స్థాయీసంఘం సూచించింది. 

రిజిస్ట్రేషన్‌కు పలు మార్గాలు... 
ఫాస్టాగ్‌ రిజిస్ట్రేషన్‌కు వాహనం రిజిస్ట్రేషన్‌ సర్టిఫికెట్లతో పాటు వాహనదారుడి బ్యాంకు ఖాతాకు సంబంధించిన కేవైసీ సమర్పించాలి. ఆ వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేస్తారు. ఇందుకోసం రూ.500 చెల్లించాల్సి ఉంటుంది. దీనిలో రూ.100 స్టిక్కర్‌ (ట్యాగ్‌) ఖరీదు కాగా మిగిలిన మొత్తంలో రూ.200 బ్యాంకులో సెక్యూరిటీ డిపాజిట్‌కు, రూ.200 టాప్‌అప్‌కు కేటాయిస్తారు. ఈ స్టిక్కర్‌ జాతీయ రహదారులపైనున్న అన్ని టోల్‌ప్లాజాల్లోనూ పనిచేస్తుంది. టోల్‌ప్లాజాలు, పలు పబ్లిక్‌ పాయింట్ల వద్ద ఫాస్టాగ్‌ల విక్రయానికి అధీకృత బ్యాంకులు ప్రత్యేక కౌంటర్ల (పాయింట్‌ ఆఫ్‌ సేల్‌ – పీవోఎస్‌)ను ఏర్పాటు చేశాయి. ఇది కొనుగోలు చేసిన తర్వాత వాహనదారులు ‘మై ఫాస్టాగ్‌ యాప్‌’ను సెల్‌ఫోన్‌లో డౌన్‌లోడ్‌ చేసుకోవాలి. వాహన రిజిస్ట్రేషన్‌ నంబరుతో బ్యాంకు ఖాతాను అనుసంధానం చేసుకోవాలి. 

డీలర్లూ ఫాస్టాగ్‌ ఇవ్వాలి 
మోటారు వాహనాల చట్టానికి 2017లో చేసిన సవరణ ప్రకారం కొత్త కార్లు, భారీ వాహనాల కొనుగోలు సమయంలోనే డీలర్లు ఫాస్టాగ్‌ ఇవ్వాలి. ఈ దృష్ట్యా వాహల కొనుగోలుదారులకు ఫాస్టాగ్‌ స్టిక్కర్‌ ఇచ్చేందుకు డీలర్లంతా సహకరించాలి. ప్రస్తుతం టోల్‌ప్లాజాల నుంచి వస్తున్న సమాచారం ప్రకారం 70 శాతం వాహనాలు ఫాస్టాగ్‌ రిజిస్ట్రేషన్‌ ఉన్నవి వస్తున్నాయి. మిగతా వాహనదారులంతా ఈ విధానంలోకి వస్తే జాతీయ రహదారిపై టోల్‌ప్లాజాల వద్ద ఇబ్బంది ఉండదు. 
– పి.శివశంకర్, ప్రాజెక్టు డైరెక్టరు, ఎన్‌హెచ్‌ఏఐ విశాఖ రీజియన్‌ 

మరిన్ని వార్తలు