టోల్‌గేట్లలో ఇక ఫాస్ట్‌గా! 

21 Nov, 2019 03:59 IST|Sakshi

గుంటూరు – విజయవాడ మధ్య జాతీయ రహదారిపై రద్దీగా ఉండే కాజ టోల్‌గేట్‌ను దాటాలంటే వాహనాలు బారులు తీరిన సమయంలో 10 – 15 నిమిషాలు పడుతోంది. పండుగలు, ప్రత్యేక సందర్భాల్లో గంటల తరబడి నిరీక్షణ తప్పదు. వాహనాలు చీమల్లా కదులుతుండటంతో ఇంధనం వృథా అవుతోంది. జాతీయ రహదారులపై 10 టోల్‌గేట్లు దాటాలంటే సగటున అర లీటరు నుంచి లీటరు దాకా ఇంధనం వృథా అవుతోందని అంచనా. అదే ‘ఫాస్టాగ్‌’ వరుసలో వెళ్తే రెండు నిమిషాల్లో టోల్‌గేట్‌ దాటవచ్చు.  

ప్రస్తుతం టోల్‌గేట్లలో ఒక వరుస మాత్రమే ఫాస్టాగ్‌ కోసం అందుబాటులో ఉంది. డిసెంబర్‌ 1వ తేదీ నుంచి టోల్‌గేట్లలో అన్ని వరుసలను ఫాస్టాగ్‌గా మారుస్తారు. వాహనదారులు కేవలం ఒక్క వరుసలో మాత్రమే డబ్బులు చెల్లించి రశీదు తీసుకునే వీలుంటుంది.  

సాక్షి, అమరావతి: దేశవ్యాప్తంగా డిసెంబరు 1వ తేదీ నుంచి ‘వన్‌ నేషన్‌.. వన్‌ ట్యాగ్‌’ నినాదంతో అన్ని టోల్‌గేట్లలో ఫాస్టాగ్‌ విధానాన్ని విధిగా అమలు చేయనున్నారు. కేవలం ఒక్క వరుసలో మాత్రమే నగదు చెల్లించే అవకాశం ఉంటుంది. ఏపీలోని 43 ఎన్‌హెచ్‌ఏఐ టోల్‌గేట్లలో ఫాస్టాగ్‌ అమలవుతుంది. టోల్‌గేట్‌కు 20 కిలోమీటర్ల పరిధిలో ఉండే స్థానికులు, స్థానిక రిజిస్ట్రేషన్‌ ఉన్న వాహనాలకు ఆర్‌ఎఫ్‌ఐడీ ట్యాగ్‌ ప్రీ పెయిడ్‌ పాసులు ఇచ్చి.. ఫాస్టాగ్‌ విధానంలో రాయితీలు వర్తించేలా ఎన్‌హెచ్‌ఏఐ ఉత్తర్వులిచ్చింది.  

పలు రకాలుగా రీ చార్జి సదుపాయం: టోల్‌గేట్‌ వద్ద ఫాస్టాగ్‌ వరుసలో వాహనాలు 25–40 కి.మీ. వేగంతో మాత్రమే వెళ్లాలి. క్యాష్‌ లెస్‌ విధానంలో ఫాస్టాగ్‌ అమలవుతుంది. ఫాస్టాగ్‌ ఆర్‌ఎఫ్‌ఐడీ ట్యాగ్‌ల కోసం కేంద్రం 23 బ్యాంకులతో ఒప్పందం కుదుర్చుకుంది. కనీసం రూ.వందతో ఫాస్టాగ్‌ ఆర్‌ఎఫ్‌ఐడీ ట్యాగ్‌ పొందవచ్చు. అమెజాన్, ఫాస్టాగ్‌ యాప్, పేటీఎం ద్వారా రీ ఛార్జి చేసుకునే సదుపాయం ఉంది. 

 ఇవీ ఉపయోగాలు..
- ఇంధనం, సమయం ఆదా. 
కాలుష్యం తగ్గుతుంది.  
ట్రాఫిక్‌ సమస్యలుండవు.  
చోరీకి గురైన ఫాస్టాగ్‌ ఉన్న వాహనం టోల్‌ప్లాజా దాటగానే యజమాని ఫోన్‌కు మెస్సేజ్‌ వస్తుంది.  

స్టేట్‌ హైవే టోల్‌ప్లాజాల్లోనూ... 
జాతీయ రహదారులతోపాటు రాష్ట్ర రహదారులపై ఉన్న టోల్‌ప్లాజాల్లోనూ ఫాస్టాగ్‌ అమలు చేయాలని ఎన్‌హెచ్‌ఏఐ ఆదేశాలిచ్చింది. నార్కట్‌పల్లి–అద్దంకి రహదారిలో తుమ్మలచెరువు వద్ద, సంతమాగులూరు సమీపం లోని ఏల్చూరు, రాజమండ్రి బ్రిడ్జి, పులిగడ్డ వారధి వద్ద ఇలాంటి టోల్‌గేట్లు ఉన్నాయి. వీటిలో రెండువైపులా ఫాస్టాగ్‌ డెడికేటెడ్‌ లైన్లు ఏర్పాటు చేయనున్నారు.  టోల్‌గేట్లలో ఆర్‌ఎఫ్‌ఐడీ యంత్రాల వ్యయంలో 50 శాతాన్ని ఇండియన్‌ హైవేస్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీ లిమిటెడ్‌ భరించనుంది.  

 ఫాస్టాగ్‌ అంటే..?
బ్యాంకు ఖాతాతో అనుసంధానం కలిగి ఉండే రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్‌ టెక్నాలజీతో కూడిన స్టిక్కర్‌ను ఫాస్టాగ్‌ అంటారు. ఫాస్టాగ్‌ స్టిక్కర్‌ మీదున్న బార్‌కోడ్‌ను టోల్‌ప్లాజాలోని ఆర్‌ఎఫ్‌ఐడీ యంత్రం గుర్తించి రీడ్‌ చేస్తుంది. వాహనం టోల్‌ప్లాజాను దాటుతుండగా టోల్‌ రుసుమును రీఛార్జి మొత్తం నుంచి మినహాయించుకుంటుంది. ఈ వివరాలు వెంటనే వాహనదారుడి ఫోన్‌కు ఎస్‌ఎంఎస్‌ ద్వారా అందుతాయి. ఏపీలో ఫాస్టాగ్‌ ద్వారా ప్రస్తుతం 20 నుంచి 25 శాతం వాహనాలు ప్రయాణిస్తున్నట్లు అంచనా.  

సిబ్బంది కుదింపు?: టోల్‌ప్లాజాల్లో ఫాస్టాగ్‌ అమలుతో భవిష్యత్తులో సిబ్బంది కుదింపు చర్యలు చేపట్టనున్నట్లు కొంతమంది టోల్‌ నిర్వాహకులు పేర్కొంటున్నారు. రాష్ట్రంలో అన్ని టోల్‌ప్లాజాల్లో సగటున 105 మంది సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. తమకు ప్రత్యామ్నాయ ఉపాధి కల్పించేలా ఎన్‌హెచ్‌ఏఐ చర్యలు చేపట్టాలని సిబ్బంది కోరుతున్నారు. 

సరుకు రవాణా సమయం ఆదా 
టోల్‌ప్లాజాల్లో ట్రాఫిక్‌ సమస్యతో సమయం, ఇంధనం వృథా అవుతోంది.  పెరుగుతున్న డీజిల్, పెట్రోల్‌ ధరలతో ఇప్పటికే రవాణా రంగం కుదేలైంది. ఫాస్టాగ్‌ అమలుతో కొన్ని సమస్యలు తీరినట్లే. 
– ఈశ్వరరావు, లారీ యజమానుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు

ఫాస్టాగ్‌కు కేంద్రం సాయం
స్టేట్‌ హైవేస్‌లోని టోల్‌ప్లాజాల్లో ఫాస్టాగ్‌ అమలుకు  రూ.20 లక్షల చొప్పున ఖర్చవుతుంది. ఈ భారం భరించేందుకు కేంద్రం ముందుకొచ్చింది.  
– మనోహర్‌రెడ్డి, రోడ్‌ డెవలప్‌మెంట్‌కార్పొరేషన్‌ ఎండీ 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా