వేగంగా మూడో విడత సర్వే

8 Apr, 2020 03:49 IST|Sakshi

మూడు రోజుల్లో పూర్తిచేయాలి

కరోనా అనుమానితులకు పరీక్షల నిర్వహణ

కంటైన్మెంట్‌ జోన్లపై ప్రత్యేక దృష్టి పెట్టాలి

కలెక్టర్లు, మున్సిపల్‌ కమిషనర్లు, డీఎం అండ్‌ హెచ్‌వోలతో సీఎస్‌ వీడియో కాన్ఫరెన్స్‌

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కరోనా వైరస్‌ను కట్టడి చేసేందుకు మరోమారు ఇంటింటా సర్వే నిర్వహించి అనుమానితుల నుంచి శాంపిల్స్‌ సేకరణ, పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని కోరారు. వైరస్‌ నియంత్రణకు చర్యలు.. ఆసుపత్రుల సన్నద్ధత కూడా అత్యంత ప్రాధాన్యతా అంశాలని ఆమె తెలిపారు. కోవిడ్‌–19పై మంగళవారం విజయవాడ ఆర్‌ అండ్‌ బీ కార్యాలయం నుండి జిల్లా కలెక్టర్లు మున్సిపల్‌ కమిషనర్లు, డీఎం అండ్‌ హెచ్‌ ఓలతో ఆమె వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎస్‌ మాట్లాడుతూ.. రాష్ట్రంలోని కోవిడ్‌–19 ఆసుపత్రులతోపాటు క్వారంటైన్‌ కేంద్రాల్లో ఉన్నత ప్రమాణాలతో కూడిన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.

సమావేశంలో ఆమె ఇంకా ఏమన్నారంటే..
► సర్వే ప్రక్రియను మూడు రోజుల్లోగా పూర్తిచేయాలి.
► కంటైన్మెంట్‌ జోన్లలో ఏ ఒక్క పాజిటివ్‌ కేసు ఉండకూడదు. వీటిపై ప్రత్యేక దృష్టి పెట్టాలి.
► లాక్‌డౌన్‌ గడువు ముగిసే సమయం దగ్గర పడుతున్నందున ప్రతి ఒక్కరూ మరింత జాగ్రత్తగా పనిచేయాలి.
► రాష్ట్రంలోని 121 కంటైన్మెంట్‌ జోన్లు అన్నింటిపై ప్రత్యేక దృష్టి సారించాలి.

ఈ సమావేశంలో వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డా. కేఎస్‌ జవహర్‌రెడ్డి, గనుల శాఖ ముఖ్య కార్యదర్శి రాంగోపాల్, వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్‌ కె. భాస్కర్, పరిశ్రమల శాఖ సంచాలకులు సుబ్రహ్మణ్యం, ఆరోగ్యశ్రీ సీఈఓ మల్లికార్జున్‌ తదితరులు పాల్గొన్నారు. 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా