అమ్మా మాట్లాడమ్మా.. చెల్లి ఎక్కడుందమ్మా..?

17 Sep, 2019 10:18 IST|Sakshi

లక్ష్మి మృతదేహం వద్ద తల్లడిల్లిన పెద్ద కుమార్తె రమ్య, భర్త శంకర్‌

చిన్న కుమార్తె పుష్ప ఆచూకీ కోసం

వేయి కళ్లతో ఎదురుచూపులు

వేపగుంటలో లక్ష్మికి అంత్యక్రియలు

పెందుర్తి: ‘అమ్మా లెగమ్మా.. మాట్లాడమ్మా.. నా చెల్లెలు ఏదమ్మా.. ఇప్పుడు నాకు తోడెవరమ్మా.. నెనెవరితో ఆడుకోవాలమ్మా.. ఎవరితో గిల్లికజ్జాలు పెట్టుకోవాలమ్మా.. చెల్లెప్పుడు వస్తాదమ్మా.. మమ్మల్ని వదిలేసి ఎందుకు వెళ్లిపోయావమ్మా.. నాన్నకు నాకు దిక్కెవరమ్మా’ అంటూ వేపగుంటకు చెందిన బొండా లక్ష్మి పెద్దకుమార్తె రమ్య తల్లి మృతదేహం వద్ద విలపించిన తీరు ప్రతీ ఒక్కరినీ కన్నీరు పెట్టించింది. పాపికొండలు విహారయాత్రకు వెళ్లి గోదావరి నదిలో ఆదివారం జరిగిన బోటు ప్రమాదంలో గల్లంతైన బొండా లక్ష్మి(37) మృతి చెందింది. ఆమెతోపాటు వెళ్లిన చిన్నకుమార్తె పుష్ప(13) ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు. ప్రమాద స్థలానికి చేరుకున్న బంధువులు లక్ష్మి మృతదేహాన్ని గుర్తించడంతో సోమవారం ఉదయం రామమండ్రి ప్రభుత్వాసుపత్రిలో పోస్టుమార్టం పూర్తి చేశారు. అనంతరం రోడ్డు మార్గంలో లక్ష్మి మృతదేహాన్ని వేపగుంటకు తరలించారు. శనివారం సాయంత్రం ఇంటిలో అందరికీ జాగ్రత్తలు చెప్పి యాత్రకు బయలుదేరిన లక్ష్మి విగతజీవిగా కనిపించడంతో భర్త శంకరరావు, పెద్ద కుమార్తె రమ్య తల్లడిల్లిపోయారు. లక్ష్మి అత్తామామ, తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, బంధువులు లక్ష్మి మృతదేహం వద్ద బోరున విలపించారు. శంకర్, రమ్యలను ఓదార్చడం ఎవరితరమూ కాలేదు. వేపగుంట శ్మశానవాటికలో లక్ష్మి అంత్యక్రియలు పూర్తి చేశారు. ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్‌రాజ్‌ లక్ష్మి నివాసానికి చేరుకుని కుటుంబసభ్యులను ఓదార్చారు.

మాకు దిక్కెవరమ్మా..
మధ్య తరగతి కుటుంబానికి చెందిన బొండా శంకరరావు, లక్ష్మి దంపతులు ఇద్దరు ఆడపిల్లలను అల్లారుముద్దుగా పెంచుకుంటున్నారు. శంకర్‌ ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషించుకుంటూ పిల్లలను ప్రైవేటు పాఠశాలల్లో చదివిస్తున్నాడు. పెద్ద కుమార్తె రమ్య తొమ్మిదో తరగతి కాగా.. చిన్న కుమార్తె పుష్ప ఎనిమిదో తరగతి చదువుతుంది. రమణబాబు కటుంబంతో కలిసి ఆదివారం వేకువజామున రాజమండ్రి రైలులో చేరుకుని బోటు షికారుకు విశిష్ట బోటు ఎక్కారు. ఆ బోటు ప్రమాదంలో మధుపాడ రమణబాబు కుటుంబసభ్యులు సహా లక్ష్మి, పుష్ప గల్లంతయ్యారు. లక్ష్మి మృతదేహాన్ని ఆదివారం అర్ధరాత్రి గుర్తించారు. ఇంకా పుష్ప ఆచూకీ లభించలేదు. ఓ వైపు లక్ష్మి మృతి.. మరోవైపు పుష్ప గల్లంతు కావడంతో ఆ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. తమకు దిక్కెవరంటూ శంకర్, రమ్య రోదిస్తున్నారు. ఈ ఘటనతో వేపగుంటలో తీవ్ర విషాదం అలముకుంది.

మరిన్ని వార్తలు