‘వాడు లేకుండా బతకలేను రాజేశ్వరీ..’

18 Jun, 2020 13:03 IST|Sakshi
ఏపి టూరిజం శాఖ సిబ్బంది రక్షించిన అధికారి రాజబాబు గోదావరిలో గల్లంతైన అధికారి సత్తిబాబు (ఫైల్‌ఫొటో)

క్యాన్సర్‌తో బాధపడుతున్న కొడుకుని చూసి తట్టుకోలేకపోయిన తండ్రి

ఆస్తుల వివరాలు భార్యకు చెప్పి కుమారుడితో పాటు ఆత్మహత్యాయత్నం

తండ్రిని రక్షించిన ఏపీ టూరిజం శాఖ సిబ్బంది, జాలర్లు  

గోదావరిలో కొడుకు గల్లంతు ఆచూకీ కోసం గాలింపు

రాజమహేంద్రవరం క్రైం/ కడియం: శ్రమను నమ్ముకున్న కుటుంబమది. తల్లి, తండ్రి, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమాడితో జీవితం సాఫీగా సాగుతోంది. కుమార్తెలిద్దరికీ వివాహాలు జరిగాయి. ఒక్కగానొక్క వారసుడి జీవితానికి కూడా స్థిరత్వం ఏర్పరచాలన్న తలంపులో ఉన్న ఆ తల్లిదండ్రుల ఆశలపై క్యాన్సర్‌ మహమ్మారి నీళ్లు చల్లింది. తన కొడుకు క్యాన్సర్‌ బారిన పడ్డాడనే విషయం తెలిసింది. క్యాన్సర్‌ వ్యాధితో బాధపడుతున్న తన కొడుకుని చూసి ఆ కన్నతండ్రి తట్టుకోలేకపోయాడు. తన గారాలపట్టీ బతకడని తెలిసి కుమిలిపోయాడు. తను లేని జీవితం వ్యర్థమనుకొన్నాడు. తనతో పాటే తానూ చనిపోవాలని నిర్ణయించుకున్నాడు. కొడుకు కళ్ల ముందే చనిపోతే ఎలాగంటూ మానసికంగా కుంగిపోయాడు. ఇక లాభం లేదనుకుని తనకున్న ఆస్తిపాస్తుల వివరాలు భార్య, కుటుంబసభ్యులకు చెబుతూ వస్తున్నాడు. వారు అటువంటి పిచ్చిపనులేవీ చేయవద్దంటూ వారిస్తున్నారు. ఇలా వారం రోజులుగా తీవ్ర తర్జనభర్జన పడుతున్నారు. చివరికి మంగళవారం కొడుకుతో సహా ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఏపీ టూరిజం శాఖ సిబ్బంది, జాలర్లు రక్షించడంతో ప్రాణాలతో తాను ప్రాణాలతో బయటడినా.. కుమారుడిని తన కళ్లముందేనిజంగా కోల్పోయాడు.

వైద్యం చేయించినా దక్కడనే ఆందోళనతో..
కడియం మండలం మురమండ పంచాయతీ పరిధిలోని దొరగారితోటలో ఈ ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. అధికారి రాజబాబు, రాజేశ్వరి దంపతులకు ఇద్దరు కుమార్తెల  తరువాత అధికారి సత్తిబాబు (23) పుట్టాడు. అతడికి ప్రేగు క్యాన్సర్‌ అని ఇటీవలే తెలిసింది. రాజమహేంద్రవరంలోని ప్రైవేటు ఆసుపత్రిలో వారి శక్తికి మించి ఖర్చు చేసి వైద్యం కూడా చేయిస్తున్నారు. అయినా  ఆరోగ్య పరిస్థితిలో మార్పు లేదు. మరింత మెరుగైన వైద్యం కోసం భారీగా ఖర్చవుతుందని వైద్యులు చెప్పడంతో కుటుంబంలో తీవ్ర ఒత్తిడి నెలకొంది. మరోవైపు తెలిసిన వారి వద్ద నుంచి డబ్బులు పోగేసుకుని హైదరాబాదు వెళ్లే ప్రయత్నాల్లో ఉన్నారు. ఇదిలా ఉండగా ‘నా కొడుకు బతకకపోతే నేను కూడా బతకను’ అంటూ చెప్పే తండ్రి రాజబాబు తన మాటలను నిజం చేసేందుకు ప్రయత్నించాడు. దీంతో బుధవారం ఆసుపత్రికి వెళుతున్నామని చెప్పి రాజబాబు అతడి కుమారుడు సత్తిబాబు ఇంటి నుంచి బైక్‌పై బయలుదేరారు. నేరుగా రాజమహేంద్రవరం పరిధిలోని రోడ్డుకం రైల్వే బ్రిడ్జి వద్దకు చేరుకుని  గోదావరి నదిలోకి దూకేశారు.

రోడ్డు కం రైల్వే బ్రిడ్జి పై నుంచి ఇద్దరు వ్యక్తులు దూకడం గమనించి గోదావరిలో చేపలు పట్టుకునే జాలర్లు, ఒడ్డున ఉన్న ఏపీ టూరిజం శాఖ సిబ్బంది హుటాహుటిన బోట్లలో సంఘటన స్థలానికి చేరుకొని గోదావరిలో కొట్టుకుపోతున్న తండ్రి అధికారి రాజబాబును రక్షించి ఒడ్డుకు చేర్చారు. కుమారుడు అధికారి సత్తిబాబు గోదావరిలో గల్లంతయ్యాడని రాజమహేంద్రవరం టూటౌన్‌ పోలీస్‌ స్టేషన్‌ ఇన్‌స్పెక్టర్‌ వెంకటేశ్వరరావు తెలిపారు.

గ్రామంలో విషాదఛాయలు..
ఒక్కగానొక్క మగసంతానానికి స్థిరత్వం ఏర్పరచాలన్న తలంపుతో ఇటీవలే ఇల్లు కూడా నిర్మించుకున్న రాజబాబు తన కొడుకుతో కలసి ఆత్మహత్యా ప్రయత్నం చేయడం స్థానికుల్లో తీవ్ర విషాదం నింపింది. ఎప్పుడూ కొడుకు ఆరోగ్యం గురించే ఆలోచించేవాడని, అతడి వైద్యం కోసం తన శక్తికి మించి ఖర్చు చేశాడని స్థానికులు తెలిపారు. తండ్రీ కొడుకులిద్దరూ నదిలోకి దూకేశారని తెలిసి గ్రామస్తులు, స్నేహితుల హృదయాలు బరువెక్కాయి. స్నేహతులతో ఎప్పుడూ సరదాగా ఉండే సత్తిబాబు కూడా తండ్రితో కలిసి ఇటువంటి నిర్ణయం తీసుకోవడం అతని స్నేహ బృందాన్ని నిశ్చేష్టుల్ని చేసింది. విషయం తెలిసిన వెంటనే పెద్ద సంఖ్యలో గోదావరి వద్దకు చేరుకుని నదివెంబడి అతడి ఆచూకీ కోసం అన్వేషించడం చూపరుల్ని కంటతడి పెట్టించింది. తండ్రికి మాదిరిగానే ఎక్కడొక చోట ప్రాణాలతో సత్తిబాబు ఉండకపోతాడా? అన్న ఆశతో అతడి స్నేహితులు వెతికే ప్రయత్నం చేయబోగా పోలీసులు వారికి నచ్చజెప్పి అక్కడి నుంచి వారిని పంపేశారు.

వారం రోజులుగా తర్జనభర్జన
అధికారి రాజబాబు తన కుమారుడు బతకడని, కొడుకుతో పాటే చనిపోతానని వారం రోజులుగా ఇంట్లో భార్య, కుటుంబ సభ్యులతో చెప్పాడు. తన ఆస్తుల వివరాలు సైతం భార్యకు చెప్పాడు. వారు ఎటువంటి పిచ్చిపని చేసుకోవద్దని, వారించారు. అయినా వినకుండా మంగళవారం ఉదయం రాజమహేంద్రవరం హాస్పిటల్‌కు తీసుకువెళుతున్నట్టు ఇంట్లో చెప్పి రాజమహేంద్రవరం రోడ్డు కం రైల్వే బ్రిడ్జి పైకి మోటారు సైకిల్‌పై చేరుకొని అక్కడి నుంచి ఇద్దరూ గోదావరిలోకి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు.   ఈ సంఘటనలో తన కళ్లముందే కుమారుడు మృతి గోదావరి నదిలో కొట్టుకుపోవడాన్ని  తట్టుకోలేక తండ్రి రాజబాబు పొగిలిపొగిలి రోదించాడు.

మరిన్ని వార్తలు