గ్రూప్‌ 2కు తండ్రీ కొడుకులు సెలక్ట్‌

19 May, 2018 11:13 IST|Sakshi
సుబ్బారావు, శ్రీనివాసులు

ఒకరు ఏఈఓగా మరొకరు ఏఎస్‌ఓగా ఎంపిక

ప్రకాశం, త్రిపురాంతకం: తండ్రీ కొడుకులు ఒకేసారి గ్రూప్‌ 2కు సెలక్టయ్యారు. ఒకరు ముందు, ఆ తర్వాత మరొకరు గ్రూప్‌–2 పరీక్షలు రాశారు. అయితే ఇద్దరికీ ఒకే సారి ప్రభుత్వం నుంచి ఆదేశాలు రావడంతో సంతోషంలో మునిగిపోయారు. కష్టపడితే సాధించలేనిది ఏమిలేదంటున్నారు ఈ తండ్రీ కొడుకులు. త్రిపురాంతకం మండలం దూపాడు పంచాయతీ పరిధిలోని దీవెపల్లి గ్రామానికి చెందిన కటికి సుబ్బారావు కుమారుడు శ్రీనివాసులు ఈ ఘనత సాధించారు. ఇద్దరూ ప్రభుత్వ పాఠశాలల్లో చదివారు. సుబ్బారావు 1999లో గ్రూప్‌ 2కు సెలక్ట్‌ అయ్యారు.

అయితే కొందరు కోర్టును ఆశ్రయించడంతో కాలయాపన జరిగింది. ప్రస్తుతం సుబ్బారావు ఏఈఓగా సెలక్ట్‌ అయ్యారు. ఈయన జెడ్పీ హైస్కూల్‌ దొనకొండలో ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నారు. గత పదిహేను సంవత్సరాలుగా ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నారు. ఇతని కుమారుడు శ్రీనివాసులు 2016 గ్రూప్‌2 ఫలితాల్లో ఏఎస్‌ఓ సెక్రెటరియేట్‌గా ఎంపికయ్యారు. అంతంత మాత్రం వసతులున్న స్థానిక ప్రాథమిక పాఠశాలలో ప్రాథమిక విద్య, దూపాడు జెడ్పీ ఉన్నత పాఠశాలలో ఉన్నత విద్య అభ్యసించారు. గ్రామస్తులు, పలువురు ప్రముఖులు అభినందించారు. ఒక ప్రణాళిక ప్రకారం ముందుకుసాగితే మంచి అవకాశాలను అందిపుచ్చుకోవచ్చన్నారు శ్రీనివాసులు.

మరిన్ని వార్తలు