కన్నతండ్రి..కర్కశం

12 Aug, 2014 03:38 IST|Sakshi
కన్నతండ్రి..కర్కశం

చిన్న వయసులోనే తల్లిని కోల్పోయిందా చిన్నారి. తండ్రి మంచంలో ఉండటంతో కన్నతల్లిలా సపర్యలు చేసింది. కదలలేని స్థితిలో ఉన్న తండ్రిని కంటికి రెప్పలా కాచుకుంటున్నా..కనికరం లేని అతను నిత్యం కుమార్తెకు నరకం చూపాడు. కొడుతూ చిత్రహింసలు పెట్టాడు. తొమ్మిదేళ్ల బాలిక రోదన చూడలేక..చుట్టుపక్కల వారు చైల్డ్‌లైన్‌కు సమాచారం ఇవ్వడంతో వారు ఆ బాలికకు తండ్రి నుంచి విముక్తి కల్పించారు.
 
ఒంగోలు టౌన్: కదలలేని స్థితిలో ఉన్న తనను కంటికి రెప్పలా చూసుకుంటున్న కుమార్తెను చిత్రహింసలు పెట్టాడో తండ్రి. ఒంగోలులోని పొనుగుపాటినగర్‌లో ఉంటున్న కాకర్ల కృష్ణ (40) భార్య లక్ష్మి నాలుగేళ్ల క్రితం అనారోగ్యంతో మరణించింది. బేల్దారి పని చేసుకుంటూ కుమార్తె రేణుకను పోషించేవాడు. రెండేళ్ల క్రితం బిల్డింగ్‌పై నుంచి పడటంతో వెన్నెముకకు బలమైన దెబ్బ తగిలి కృష్ణ కాళ్లు పూర్తిగా చచ్చుబడిపోయాయి. అప్పటి నుంచి రేణుక.. తండ్రికి అన్నీ తానై సపర్యలు చేస్తోంది. తండ్రి మంచంపైనే మలమూత్ర విసర్జన చేసినా చీదరించుకోకుండా శుభ్రం చే సేది. మంచంపైనే తండ్రికి స్నానం చేయించి దుస్తులు కూడా వేసేది.
 
తల్లి తన బిడ్డని ఎంత జాగ్రత్తగా చూసుకుంటుందో అలా సేవలు చేసేది. అలాంటి కూతురిని ఏ తండ్రి అయినా అపురూపంగా చూసుకుంటాడు. ఆ చిన్న మనస్సుకు ఎలాంటి కష్టం రాకుండా చూస్తాడు. కానీ కృష్ణ మాత్రం మంచంపై నుండి లేవలేని స్థితిలో ఉన్నప్పటికీ కుమార్తెను ప్రతిరోజూ రాచి రంపాన పెట్టేవాడు. కదల్లేని స్థితిలో ఉన్నప్పటికీ కుమార్తెను కొట్టేందుకు మంచం పక్కనే ఒక కర్రను కూడా సిద్ధంగా ఉంచుకునేవాడు. అయిన దానికి, కానిదానికి ఆగ్రహిస్తూ కర్రతో కొట్టడమే గాకుండా ఆ బాలిక శరీరంపై గోళ్లతో రక్కడం, తొడపాశం పెట్టడం నిత్యకృత్యమైంది.
 
ప్రతిరోజూ తండ్రి చిత్రహింసలు భరించలేని ఆ బాలిక పెట్టే కేకలకు చుట్టుపక్కల వాళ్లు చలించిపోయేవారు. ఆ తండ్రి వద్దకు వెళ్లి పలుమార్లు చెప్పినప్పటికీ అతని తీరులో ఎలాంటి మార్పు కనిపించలేదు. దాంతో చుట్టుపక్కల వాళ్లు ఆ బాలిక స్థితిని చూసి తట్టుకోలేక చైల్డ్‌లైన్(1098)కు సమాచారం అందించారు. చైల్డ్‌లైన్ ప్రతినిధి బీవీ సాగర్ ఆ బాలికను బాలల సంక్షేమ కమిటీ చైర్మన్ బీవీ శివప్రసాద్ ఎదుట హాజరు పరిచారు. ఆ బాలికను  బాలసదన్‌లో చేర్పించి కష్టాలకు తాత్కాలిక చెక్ పెట్టారు.

మరిన్ని వార్తలు