జన్మభూమి రసాభాస

12 Nov, 2014 01:28 IST|Sakshi
జన్మభూమి రసాభాస

‘జన్మభూమి- మా ఊరు’ కార్యక్రమం చివరి రోజు రసాభాసగా మారడం.... సభలో టీడీపీ నాయకులు,కార్యకర్తలు రెచ్చిపోయి వ్యవహరించడం....హాజరైన ప్రజలు భయబ్రాంతులకు గురైన నేపథ్యంలో పోలీసులు రంగప్రవేశం చేసి పరిస్థితిని అదుపులోకి తీసుకురావడం, ప్రొటోకాల్ వివాదం చినికి చినికి గాలివానలా మారడం...వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ సభను బహిష్కరించడం... ఇవన్నీ సత్తెనపల్లి 25వ వార్డు సభలో మంగళవారం చోటుచేసుకున్న సంఘటనలు..
 

 సత్తెనపల్లి:పట్టణంలోని 25వ వార్డు ‘జన్మభూమి-మా ఊరు’ సభ స్థానిక కౌన్సిలర్ చల్లంచర్ల సాంబశివరావు అధ్యక్షతన మంగళవారం జరిగింది. మున్సిపల్ చైర్మన్ యెల్లినేడి రామస్వామి, మున్సిపల్ కమిషనర్ సిరిసిల్ల సత్యబాబును తొలుత సాంబశివరావు వేదికపైకి ఆహ్వానించారు. వారితోపాటు వైస్ చైర్మన్ ఆతుకూరి నాగేశ్వరరావు, 24వ వార్డు టీడీపీ కౌన్సిలర్ చౌటా శ్రీనివాసరావులు వేదికపై ఆశీనులయ్యారు. వారు వేదికపై కూర్చోవటాన్ని కౌన్సిలర్ సాంబశివరావు ఆక్షేపించారు.

ఇది ప్రభుత్వ కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ సమావేశంగా మార్చారు. వార్డుకు సంబంధం లేని వ్యక్తులను వేదికపై నుంచి పంపాలని నిర్వహణ కమిటీ కన్వీనర్ అయిన కమిషనర్ సత్యబాబును సాంబశివరావు కోరారు.  దీనిపై కమిషనర్ స్పందిస్తూ ఇది అంతా కలసి పాల్గొనవలసిన ప్రభుత్వ కార్యక్రమమని, సామరస్యంగా వెళదామన్నారు.

తిరిగి కౌన్సిలర్ సాంబశివరావు మాట్లాడుతూ మున్సిపల్ చైర్మన్ టీడీపీ నుంచి గెలిచినప్పటికీ ఆయన్ను సమావేశానికి చైర్మన్‌గా స్వాగతిస్తున్నామని, ప్రొటోకాల్‌కు భిన్నంగా చేయదలచుకుంటే వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ వారిని కూడా వేదికపైకి పిలుస్తామన్నారు.

  దీనికి కమిషనర్ మాట్లాడుతూ వైఎస్సార్‌సీపీ వారిని కూడా ఆహ్వానిస్తానికి ఎలాంటి అభ్యంతరం లేదన్నారు. దాంతో వైఎస్సార్ సీపీ కౌన్సిలర్లను వేదికపైకి ఆహ్వానిస్తుండగా, కేవలం కౌన్సిలర్లను మాత్రమే పిలవాలని మాజీ కౌన్సిలర్ గుజ్జర్లపూడి నాగేశ్వరరావు ,13వ వార్డు టీడీపీ కౌన్సిలర్ సరికొండ వెంకటేశ్వరరాజు పెద్దగా కేకలు వేశారు.

  దీనిపై కొద్దిసేపు వాగ్వాదం చోటు చేసుకుంది. ప్రొటోకాల్ ఉల్లంఘిస్తున్నారని, దీనిపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తామని సాంబశివరావు అన్నారు.

  ఆ సమయంలో నచ్చకపోతే వెళ్లిపోవచ్చని మున్సిపల్ చైర్మన్ అనడంతో కౌన్సిలర్ సాంబశివరావు వెళుతున్నట్టు ప్రకటించారు.

  ఈ సందర్భంలో టీడీపీకి చెందిన  వ్యక్తి అసభ్యంగా మాట్లాడడంతో ఒక్కసారిగా  వివాదం రేగింది. ఒకానొక దశలో టీడీపీ,  వైఎస్సార్ సీపీ నాయకులు గొడవపడేందుకు సిద్ధం కాగా, పోలీసులు సమన్వయపరిచి పంపారు. సభలో మాట్లాడే అవకాశం కోసం వైస్ చైర్మన్ నాగేశ్వరరావు బతిమిలాడినా అధికారులు అవకాశం ఇవ్వలేదు.

  అనంతరం మున్సిపల్ చైర్మన్ రామస్వామి మాట్లాడుతూ సమస్యలను సామ రస్యంగా పరిష్కరించుకోవాలి తప్ప, అధికారులను ఇబ్బంది పెట్టకూడదన్నారు.
 
 అనంతరం టీడీపీ నాయకులు ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ చేసి, గర్భిణులకు సీమంతం చేశారు. బాలామృతం పంపిణీ చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ డీఈ జె.ప్రభాకర్‌రెడ్డి, పశు సంవర్ధక శాఖ అసిస్టెంట్ డెరైక్టర్ డాక్టర్ మంగు శ్రీనివాసరావు, వైద్య అధికారి డాక్టర్ రమాదేవి, ఏరియా వైద్యశాల సూపర్‌వైజర్ చంద్రశేఖర్, మలేరియా అధికారి ప్రసాద్, మున్సిపల్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
 భారీ బందోబస్తు.. జన్మభూమి సభకు సీఐ, ఎస్సై, సుమారు 15 మంది కానిస్టేబుళ్లు బందోబస్తు నిర్వహించారు. గొడవ సందర్భంలో ఇరు పార్టీల నేతలకు సీఐ యు.శోభన్‌బాబు సర్ది చెప్పారు.

>
మరిన్ని వార్తలు