దిక్కులేని సిగ్నల్స్

21 Apr, 2016 00:58 IST|Sakshi

నగరంలో పనిచేస్తున్న సిగ్నల్స్ ఆరు
23 చోట్ల పనిచేయని వైనం
పట్టించుకోని నగరపాలక సంస్థ అధికారులు
సతమతమవుతున్న ట్రాఫిక్ పోలీసులు

 

రాజధాని నగరంలో సిగ్నలింగ్ వ్యవస్థ భ్రష్టుపట్టడంతో ప్రజలకు ట్రాఫిక్ కష్టాలు తప్పడం లేదు. నిత్యం ముఖ్యమంత్రి మొదలుకొని కేంద్ర మంత్రుల వరకు అనేకమంది నగరానికి రాకపోకలు సాగిస్తుంటారు. వీరందరి వాహనాలతో ప్రధాన రోడ్లన్నీ బిజీగా ఉంటాయి. తరచూ  రూట్ డైవర్షన్లు, ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తుంటారు. ఇంతటి రద్దీ ఉన్నా సౌకర్యాలు మాత్రం మున్సిపాలిటీని తలపిస్తున్నాయి. వాహనచోదకులకు దిక్కులు చూపించాల్సిన ట్రాఫిక్ సిగ్నల్స్ అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో దిక్కూదివాణం లేనివిగా తయారయ్యాయి.

 

విజయవాడ : రాజధాని అవసరాలకు తగ్గట్లు నగరానికి వసతులు సమకూరడం లేదు. తక్షణ అవసరాల్లో ఒకటైన ట్రాఫిక్ వ్యవస్థను అధునాతనంగా తీర్చిదిద్దడంలో        పాలకులు పూర్తిగా విఫలమయ్యారు. ముఖ్యంగా  ట్రాఫిక్ సిగ్నలింగ్ వ్యవస్థ పూర్తి అధ్వానంగా తయారైంది. నగరంలో అనేక రద్దీ ప్రాంతాలు, ముఖ్య కూడళ్లు, ఇతర ట్రాఫిక్ జంక్షన్లు పదుల సంఖ్యలో ఉన్నాయి. నగరంలో  29 చోట్ల మాత్రమే సిగ్నల్స్ ఏర్పాటుచేశారు. అవి కూడా కొన్నేళ్ల కిందట ఏర్పాటుచేసిన సిగ్నల్స్ కావడంతో పూర్తిగా అటకెక్కాయి. ప్రస్తుతం ఆరు మాత్రమే పనిచేస్తున్నాయి. అవి కూడా అధిక ప్రాధాన్యత లేని ప్రాంతాల్లోని సిగ్నల్స్ కావడం గమనార్హం. విజయవాడలో రోజుకు సగటున 3.5 లక్షల వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయి.  ప్రధానమైన బందరు రోడ్డులో కంట్రోల్ రూమ్ నుంచి బెంజిసర్కిల్ వరకు నాలుగు సిగ్నల్స్ పాయింట్లు ఉన్నాయి. వీటిలో ఒక్కటి కూడా పనిచేయడం లేదు. నిర్మల కాన్వెంట్ సెంటర్, రమేష్ హాస్పిటల్ సెంటర్, దీప్తి జంక్షన్ సెంటర్, చుట్టుగుంట సెంటర్, సీతన్నపేట గేటు, వెటర్నరీ కాలనీ రోడ్డులోని సిగ్నల్స్ మినహా మిగిలినవి అన్ని అట్టకెక్కాయి. విఐపి జోన్‌గా మారిన బందరు రోడ్డులో ట్రాఫిక్ సిగ్నల్స్ పనిచేయకపోవడంతో నిత్యం 35 మంది ట్రాఫిక్ పోలీసులు సిగ్నల్స్ వద్ద ఉండి షిఫ్టులవారీగా విధులు నిర్వహిస్తున్నారు. వారున్నంతవరకు బాగానే ఉన్నా ఆ తర్వాత ట్రాఫిక్ గజిబిజి గందరగోళంగా మారుతోంది. దీనికితోడు సీఎం ఈ రూట్‌లో పర్యటించినప్పుడల్లా గ్రీన్ జోన్ కారిడార్ ఏర్పాటుచేయడంతో ట్రాఫిక్‌ను నిలిపివేస్తుంటారు.


నగరపాలక సంస్థ నిర్లక్ష్యంతో గందరగోళం
నగరంలో ట్రాఫిక్‌కు సంబంధించి సిగ్నల్స్, జంక్షన్ల వద్ద మార్కింగ్ ఇతర సౌకర్యాలు కల్పించాల్సిన నగరపాలక సంస్థ పూర్తి నిర్లక్ష్యం ప్రదర్శించడంతో అటు వాహనదారులు, ఇటు ట్రాఫిక్ పోలీసులకు తీవ్ర ఇబ్బందికరంగా మారింది. కనకదుర్గ ఫ్లైవోవర్ నిర్మాణపనుల వల్ల  జాతీయ రహదారి ట్రాఫిక్ మొత్తం చిట్టినగర్, చనుమోలు వెంకట్రావ్ ఫ్లైవోవర్, సొరంగం వైపు మళ్లించారు. ఈ క్రమంలో ఈ ప్రాంతంలో రోడ్డు పూర్తిగా 30 అడుగుల లోపు ఉండటంతో నిత్యం ట్రాఫిక్ జామ్‌లతో వాహనదారులు సతమతమవుతున్నారు.  ముఖ్యంగా నగరంలోని రోడ్డు అవసరమైన చోట్ల విస్తరణ చేయాల్సి ఉన్నా నగరపాలక సంస్థ పట్టించుకోవటం లేదు. సిగ్నల్స్ ఏర్పాటు చేయాల్సిన బాధ్యత నగరపాలక సంస్థ అధికారులదే. మరో నాలుగు నెలల్లో పుష్కరాలు కూడా ప్రారంభం కానున్న తరుణంలో ట్రాఫిక్ సమస్య పెనసవాలుగా మారే అవకాశం ఉంది. జాతీయ రహదారితో అనుసంధానంగా ఉన్న బెంజిసర్కిల్ వద్ద సిగ్నల్స్ వద్ద రెడ్‌లైట్ వయొషన్ కెమోరా ఉన్నప్పటికి పనిచేయటం లేదు. దీంతో ఈసెంటర్‌లో ఆరుగురికిపైగా పోలీసులతో పాటు అధికారులు ఇక్కడ విధులు నిర్వహిస్తున్నారు.

 

>
మరిన్ని వార్తలు