తెరపైకి రికవరీ వివాదం 

14 Dec, 2019 11:03 IST|Sakshi
ఎఫ్‌సీఐ గోదాముల వద్ద బియ్యం నిల్వ

జిల్లాలోని 80మంది మిల్లర్లకు ఎఫ్‌సీఐ నోటీసులు 

గతంలో అధికంగా చెల్లించిన రూ. 5కోట్లు రికవరీకి చర్యలు 

మిల్లింగుకు దూరంగా  ఉండాలని మిల్లర్ల యోచన 

ధాన్యం మరాడించేందుకు తలెత్తిన కొత్త సమస్య 

రంగంలోకి దిగిన మంత్రి బొత్స... 

సమస్య పరిష్కారానికి చర్యలు 

విజయనగరం గంటస్తంభం: ప్రభుత్వం సేకరించే ధాన్యం మరపట్టే విషయంలో మరో చిక్కు వచ్చి పడింది. భారత ఆహార సంస్థ గతంలో అధికంగా చెల్లించిన బిల్లులు రికవరీ చేయాలని ఇప్పుడు అధికారులు చూస్తున్నారు. ఈ మేరకు కొందరు మిల్లర్లకు నోటీసులు కూడా ఇచ్చారు. ఇప్పుడు ఆయా మిల్లర్లు ఈ ఏడాది ధాన్యం మరపట్టేందుకు దూరంగా ఉండాలని యోస్తున్నారు. ఖరీ ఫ్‌ సీజన్‌కు సంబంధించి సేకరించిన ధాన్యం మరపట్టే విషయంలో మిల్లర్లు ఆది నుంచి అనేక అనుమానాలు వ్యక్తం చేస్తూనే ఉన్నారు. సార్టెక్స్‌ మిల్లులు పెట్టలేమని, ధాన్యం కొనుగోలు జీవో ఇవ్వలేదని, మర ఛార్జీలు నిర్ణయించలేదని, రవాణా టెండర్లు ఇంకా ఫైనల్‌ కాలేదని... ఇలా అనేక సమస్యలు తెరపైకి తెచ్చి బ్యాంకు గ్యారంటీలు చెల్లించడంలో జాప్యం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం నుంచి గట్టి వాదన వినిపించింది. బ్యాంకు గ్యారంటీలు ఇస్తేనే ధాన్యం ఇస్తామని, లేకుంటే వేరే జిల్లాలకు పంపించి మర పట్టించుకుంటామని అధికారులు స్పష్టం చేశారు. మెట్టు దిగిన మిల్లర్లు బ్యాంకు గ్యారంటీ చెల్లిస్తున్న తరుణంలో ఎఫ్‌సీఐ నోటీసులు కలకలం సృష్టిస్తున్నాయి. 

తొమ్మిదేళ్లనాటి మొత్తాల రికవరీ 
2010లో మిల్లర్లు బియ్యం ఎఫ్‌సీఐకి ఇచ్చినపుడు మండీ(నెట్‌) చార్జీలు చెల్లించారు. ఆ సందర్భంలో రూ. ఐదుకోట్లు ఎఫ్‌సీఐ అదనంగా చెల్లించేసింది. ఆ మొత్తాన్ని తిరిగి చెల్లించాలంటూ జిల్లాలోని 80మంది మిల్లర్లకు ఇప్పుడు నోటీసులు జారీ చేసింది. పౌరసరఫరాల సంస్థ ఉన్నతాధికారుల ద్వారా జిల్లా అధికారులకు ఆ నోటీసులు పంపించి మిల్లర్లకు అందించాలని ఆదేశాలు జారీ చేశారు. అందుకు సివిల్‌సప్లయ్స్‌ అధికారులు అంగీకరించలేదు. అధిక చెల్లింపులు చేసింది ఎఫ్‌సీఐ కాబట్టి నేరుగా నోటీసులు జారీ చేసుకోవాలని చెప్పేశారు.

మిల్లర్లలో రికవరీ భయం 
మిల్లర్లలో ఇప్పుడు రికవరీ భయం పట్టుకుంది. రాష్ట్రంలో నాణ్యమైన బియ్యం సరఫరాలో భాగంగా సార్టెక్స్‌ మిల్లుల్లో ఆడిన బియ్యం మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది. మిగతా మిల్లర్లు మరాడించిన బియ్యాన్ని ఎఫ్‌సీఐకు ఇవ్వాలి. జిల్లాలో 192మందికి 32మంది మాత్రమే సార్టెక్సుకు మారుతుండడంతో మిగతా మిల్లర్లంతా ఎఫ్‌సీఐకే బియ్యం ఇవ్వాల్సి ఉంటుంది. అప్పుడు ఎలాగైనా తిరిగి చెల్లించాల్సిందేనని మిల్లర్లు అనుమాన పడుతున్నారు. ఒక్కో మిల్లరు రూ.10 నుంచి రూ.80లక్షల వరకు చెల్లించాల్సి ఉండడంతో వారిలో ఆందోళన నెలకొంది. ఇప్పుడు కొత్త ధాన్యం కోసం బ్యాంకు గ్యారంటీలు చెల్లించాల్సిన తరుణవంలో రికవరీ సొమ్ము ఎల్లా చెల్లించగలమని వారు ప్రశి్నస్తున్నారు. ఈ పరిస్థితుల్లో మిల్లింగ్‌కు దూరంగా ఉండాలని వారంతా యోచస్తున్నట్టు తెలుస్తోంది.

దృష్టిసారించిన అధికారులు, మంత్రి.. 
ఈ సమస్యపై అధికారులు దృష్టిసారించారు. మిల్లర్ల నుంచి రికవరీ వ్యవహారం ఎఫ్‌సీఐ, మిల్లర్ల మధ్య ఉన్న సమస్య. దీనివల్ల ప్రభుత్వానికి, రైతులకు వచ్చిన నష్టం లేదు. మిల్లర్లు బ్యాంకు గ్యారంటీ ఇవ్వకపోయినా ఇతర జిల్లాలకు ధాన్యం పంపాలని ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కానీ ఇలా చేయడం వల్ల జిల్లా మిల్లర్లు నష్టపోయే ప్రమాదం ఉంది. పైగా ఇతర జిల్లాలకు రవాణా చేయడం వల్ల ప్రభుత్వంపై ఆరి్ధకభారం పడుతుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికప్పుడు రికవరీ చేయకున్నా ధాన్యం కొనుగోలు సీజన్‌ పూర్తయిన తర్వాత రికవరీ గురించి ఆలోచన చేస్తే బాగుంటుందన్న అభిప్రాయంలో అధికారులు ఉన్నారు. అంత వరకూ తాత్కాలికంగా వాయిదా వేయాలని ఉన్నతాధికారులు దృష్టికి తీసుకెళ్లారు. ఇన్నేళ్లుగా మిన్నకున్న ఉన్నతాధికారులు ఇప్పుడు రికవరీ చేయాలనుకోవడం కేవలం మిల్లర్లను ఇబ్బంది పెట్టడానికేనన్న వాదన వినిపిస్తోంది. 

ఉన్నతాధికారులతో మాట్లాడాం 
రూ.5కోట్ల రికవరీకి 80మంది అధికారులకు నోటీసులు ఇవ్వడం వాస్తవం. దీనిపై మిల్లర్లు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. బ్యాంకు గ్యారంటీలు ఇచ్చేందుకు సంశయిస్తున్నారు. వారితో మాట్లాడాం. ఉన్నతాధికారులతో కూడా మాట్లాడాం. ధాన్యం కొనుగోలు ముఖ్యం కాబట్టి రికవరీ గురించి తర్వాత దృష్టిసారించాలని చెప్పాం. మంత్రి బొత్స సత్యనారాయణ కూడా దీనిపై మాట్లాడారు. ఎటువంటి సమస్య ఉండదు.  
– కె.వెంకటరమణారెడ్డి, సంయుక్త కలెక్టర్‌   

మరిన్ని వార్తలు