బదిలీ భయం

8 Aug, 2015 00:52 IST|Sakshi
బదిలీ భయం

ఇంద్రకీలాద్రిపై జోరుగా ఊహాగానాలు
40 మంది ఉద్యోగులు బదిలీ అంటూ ప్రచారం
దీర్ఘకాలంగా పాతుకుపోయిన సిబ్బంది
కృష్ణా పుష్కరాల నేపథ్యంలోనే ఈ నిర్ణయం?

 
విజయవాడ : శ్రీదుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానం ఉద్యోగులకు బదిలీల ఫీవర్ పట్టుకుంది. ఈనెల 15వ తేదీ వరకు బదిలీలకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతిచ్చిన నేపథ్యంలో ప్రతి ఒక్కరూ టెన్షన్ టెన్షన్‌గా ఉన్నారు. రాష్ట్రంలోని ప్రధాన ఆలయాల్లో దీర్ఘకాలంగా పనిచేస్తున్న సిబ్బందిని మారిస్తే బాగుంటుందని దేవాదాయశాఖ కమిషనర్ అనూరాధ భావిస్తున్నారు. దీనికితోడు ఇటీవల దేవాదాయశాఖ మంత్రి పి.మాణిక్యాలరావు నగరానికి వచ్చినప్పుడు తమ శాఖలో బదిలీలు ఉంటాయని చెప్పడంతో ఇంద్రకీలాద్రిపై ఈ ప్రచారం మరింత జోరందుకుంది.

2006 తరువాత బదిలీలే లేవు..
2006లో అప్పటి కమిషనర్ ఏబీ కృష్ణారావు రాష్ట్రంలోని 12 దేవాలయాల్లో భారీగా  మార్పులు చేర్పులు చేశారు. ఏఈవో స్థాయి నుంచి అటెండర్ వరకు పూర్తిస్థాయిలో ప్రక్షాళన జరిగింది. అప్పట్లో దుర్గగుడిలో పనిచేసిన ఉద్యోగిని శ్రీకాళహస్తికి కూడా బదిలీ చేశారు. ఆ తరువాత కాలంలో అధికారులు, సిబ్బంది తమ పరపతిని ఉపయోగించుకుని తిరిగి సొంత దేవాలయాలకు చేరుకున్నారు. 2010 నాటికి దరిదాపుగా సిబ్బంది అంతా ఎక్కడివారు అక్కడికి వచ్చేశారు. అప్పటి నుంచి పని సర్దుబాటు కోసమో, ఉద్యోగుల కోరిక మేరకో బదిలీలు జరుగుతున్నాయి తప్ప పెద్ద ఎత్తున జరగలేదు. తిరిగి ఇప్పుడు సమూలంగా ప్రక్షాళన చేయాలని ఆ శాఖ మంత్రి, కమిషనర్ భావిస్తున్నారు.

 దీర్ఘకాలంగా పాతుకుపోయిన ఉద్యోగులు
 దుర్గగుడిలో వివిధ హోదాల్లో పనిచేస్తున్న 70శాతం మంది సిబ్బంది ఇక్కడే దీర్ఘకాలంగా పాతుకుపోయారు. తప్పని పరిస్థితుల్లో పెనుగంచిప్రోలు దేవాలయంలోనో, ద్వారకా తిరుమల దేవస్థానంలోనో కొద్దిరోజులు చేసి తిరిగి స్వస్థలానికి చేరుకుంటున్నారు. దీర్ఘకాలంగా ఇక్కడే పాతుకుపోయి ఉండటంతో దేవస్థానంలోని పనులను బినామీ పేర్లతో తామే చేయడం, ఖాళీ అవుతున్న పోస్టులపై దృష్టిపెట్టి తమ వారికి తెచ్చుకోవడంపైనే శ్రద్ధ చూపుతున్నారు.

 దేవస్థానంలో ఎన్‌ఎంఆర్‌లుగా పనిచేసే సిబ్బందిలో మూడొంతుల మందికి పర్మినెంట్ ఉద్యోగులతో బంధుత్వాలు ఉన్నాయి. దేవస్థానానికి చెందిన ఒక మహిళా ఇంజినీర్ తన తమ్ముడిని తాత్కాలిక ఇంజినీర్‌గా నియమించుకోవడమే ఇందుకు ఉదాహరణ. ఇక శానిటేషన్, ప్రసాదాల తయారీ తదితర విభాగాల్లో టెండర్లు, క్యాంటీన్ లీజులు, దుకాణాలు.. సిబ్బంది బినామీలకే దక్కుతున్నాయి.
 
40 మందికి బదిలీలు?
 ప్రస్తుతం దేవస్థానంలో సమూల ప్రక్షాళన చేస్తే తప్పా కృష్ణా పుష్కరాలను సమర్థవంతంగా నిర్వహించడం కష్టం. ఇప్పుడు చేయకపోతే పుష్కరాలు పూర్తయ్యే వరకు చేయకూడదు. మధ్యలో బదిలీలు చేస్తే ఇబ్బంది అవుతుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం దేవస్థానం నుంచి 40 మందిని సాగనంపాలనే ఆలోచనలో కమిషనర్ ఉన్నట్లు తెలిసింది. అయితే, ఈ వారంలోనే బదిలీలు జరుగుతాయా? లేక సిబ్బంది యధావిధిగా కొనసాగుతారా? అనేది వేచిచూడాలి.
 

>
మరిన్ని వార్తలు