పీలేరులో భూ సంతర్పణపై విచారణ

24 May, 2014 03:31 IST|Sakshi
పీలేరులో భూ సంతర్పణపై విచారణ
  •       సబ్‌కలెక్టర్ ఆదేశాలు జారీ
  •      ఖాదర్‌షరీఫ్ హయాంలో ఇచ్చిన పట్టాలపై విచారణ
  •      పీలేరు తహశీల్దార్ కార్యాలయ అధికారులు, సిబ్బందిపై ఆగ్రహం
  •      స్థానికేతరులకు ఖరీదైన స్థలాలు ఎలా ఇస్తారు?
  •      అధికారికంగా వెయ్యి, అనధికారికంగా వందల్లో పట్టాలు పంపిణీ
  •      ఆక్రమణదారులు, దళారుల్లో ఆందోళన
  •      భూ సంతర్పణను తీవ్రంగా వ్యతిరేకించిన వైఎస్సార్‌సీపీ
  •  పీలేరు, న్యూస్‌లైన్: నిబంధనలకు వ్యతిరేకంగా అధికారం మాటున కోట్లాది రూపాయలు విలువచేసే ప్రభుత్వ భూముల సంతర్పణపై  మదనపల్లె సబ్‌కలెక్టర్ భరత్ నారాయణగుప్త విచారణకు ఆదేశించారు. శుక్రవారం సబ్‌కలెక్టర్ పీలేరు తహశీల్దార్ కార్యాలయాన్ని అకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన పలువురు అధికారులు, సిబ్బందిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కోట్లు విలువ చేసే ప్రభుత్వ భూములను అనర్హులు, స్థానికేతరులకు ఎలా పంపిణీ చేశారని నిలదీశారు.

    నిబంధనలను పట్టించుకోకుండా ఇష్టానుసారం వ్యవహరించడమేంటని మండిపడ్డారు. ఇప్పటి వరకూ పంపిణీచేసిన పట్టాలపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. రెండు సంవత్సరాల్లో పీలేరు మండలంలో దాదాపు వంద కోట్ల ప్రభుత్వ స్థలాలు అన్యాక్రాంతమయ్యాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున రాజంపేట ఎంపీగా గెలుపొందిన పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, పీలేరు ఎమ్మెల్యేగా ఎన్నికైన చింతల రామచంద్రారెడ్డి, మాజీ మంత్రి, పుంగనూరు ఎమ్మెల్యేగా ఎన్నికైన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తదితరులు గతంలో ఆరోపించారు.

    పీలేరులో జరిగిన భూ సంతర్పణపైనా జిల్లా ఉన్నతాధికారులతోపాటు లోకాయుక్తలో కేసువేశారు.   ఇళ్ల స్థలాలు. భూ పంపిణీలపై పూర్తి స్తాయి విచారణ చేసి నివేదిక ఇవ్వాలని మదనపల్లె సబ్‌కలెక్టర్ భరత్ నారాయణగుప్త అధికారులను ఆదేశించారు. పీలేరుకు వచ్చిన సబ్‌కలెక్టర్‌ను పంచాయతీ కార్మికులు, పలువురు బాధితులు కలిశారు.  తమకు కాకుండా వేరేవారికి పట్టాలు ఇచ్చారని ఫిర్యాదు చేశారు.
     
    ఆరోపణలు ఇవే..


    మాజీ సీఎం నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి హయాంలో పీలేరు తహశీల్దార్‌గా ఎం ఖాదర్‌షరీఫ్ జూలై 16, 2012 నుంచి ఫిబ్రవరి 20, 2014 వరకు పనిచేశారు. ఈ కాలంలో గతంలో ఎన్నడూ లేని విధంగా కోట్లు  విలువ చేసే ప్రభుత్వ భూములు కర్పూర హారతిలా కరిగిపోయాయని  తీవ్ర స్థాయిలో ఆరోపణలు వచ్చాయి. నిబంధనలకు విరుద్ధంగా పీలేరు పట్టణంతోపాటు చుట్టుపక్కల ఖరీదైన ప్రభుత్వ భూములు అన్యాక్రాంతమయ్యాయి. తీవ్ర స్థాయిలో ఆరోపణలు వచ్చినా మొక్కుబడి చర్యలతో సరిపెట్టారు.

    పీలేరు పట్టణంతో పాటు, పట్టణ శివారు ప్రాంతమైన నాగిరెడ్డి కాలనీలో కోట్లాది రూపాయల విలువైన ప్రభుత్వ భూములు రాత్రికి రాత్రే అప్పటి అధికార పార్టీ నేతలు, వారి అనుచరులు ఆక్రమించుకున్నారు. మరోవైపు మండలస్థాయిలో అధికారులు, వారి కుటుంబ సభ్యులు, బంధువుల పేరిట బినామీ పట్టాలు మంజూరు చేశారని ఆరోపణలు ఉన్నాయి.   క ళ్లముందు అక్రమ కట్టడాలు వెలుస్తున్నా అధికారుల చేతివాటంతో ఏమీచేయలేక మిన్నకుండిపోయారు. అలాగే తిరుపతి మార్గంలో జాతీయ రహదారికిరువైపులా  ఆక్రమణలు జరిగాయని ఆరోపణలు వచ్చాయి.
     
    చిత్తూరు మార్గంలో ఆటోనగర్, కోళ్లఫారం మిట్టన వెలసిన ఇందిరమ్మ కాలనీలో ఇళ్ల స్థలాలు ఆక్రమణకు గురైనా పట్టించుకోలేదు. మదనపల్లె మార్గంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కాలనీలో అడ్డూ అదుపులేకుండా స్థలాలు ఆక్రమణకు గురయ్యాయి. పలువురు నిరుపేదలకు ఇచ్చిన స్థలాలను సైతం ఇక్కడ ఆక్రమించుకున్నారని ఆరోపణలు వచ్చినా రెవెన్యూ అధికారులు పట్టించుకోలేదు. పట్టణానికి సమీపంలో ఖరీదైన ప్రభుత్వ భూములకు బినామీ పట్టాలు సృష్టించి ఆక్రమించుకున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఆరోపించారు. కుల సంఘాలు పేరిట మంజూరు చేసిన ఇళ్ల స్థలాల్లో స్థానికేతరులకు ఇచ్చారనే ఆరోపణలు వచ్చాయి.
       
    అధికారికంగా దాదాపు వెయ్యి పట్టాలు పంపిణీ చేయగా, అనధికారికంగా వందల సంఖ్యలో అక్రమంగా పట్టాలు పుట్టుకొచ్చాయని ఆరోపణలు లేకపోలేదు. వీవర్స్, రజకులు, నాయిబ్రాహ్మణులు, వెలుగు, ఐకేపీ, ఎమ్మార్పీఎస్, పంచాయతీ వర్కర్లు, ఆటో వర్కర్లు, తదితరులకు మంజూరు చేసిన పట్టాల్లో అర్హులైన స్థానికులకు కాదని,  స్థానికేతరులు ఎక్కువగా ఇచ్చారని ఆరోపిస్తూ జిల్లా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు.
     

మరిన్ని వార్తలు