ఇంటర్‌ విద్యార్థులకు ఫీజు పరీక్ష

5 Nov, 2018 11:23 IST|Sakshi

15 నుంచి 200 శాతం వరకు పెంపు

చెల్లింపు గడువు కుదింపు

ఆపై అపరాధ రుసుంతో బాదుడు

లబోదిబోమంటున్న విద్యార్థులు

ఇంటర్‌ విద్యార్థులకు పరీక్షల ముందే ఫీజుల రూపంలో అగ్ని పరీక్ష ఎదురవుతోంది. పరీక్ష ఫీజులను ఏకంగా 30 శాతం వరకు పెంచుతూ ఇంటర్మీడియట్‌ బోర్డు ఉత్తర్వులు వెలువరించింది. పైగా ఫీజు చెల్లింపునకు కేవలం 12 రోజులు మాత్రమే గడువు ఇచ్చిన బోర్డు ఆ తర్వాత అపరాధ రుసుం పేరుతో విద్యార్థులపై పెనుభారం మోపింది. రూ.5 వేల వరకు అపరాధ రుసుంగా నిర్ణయించడంతో విద్యార్థులు లబోదిబోమంటున్నారు. అనాలోచిత నిర్ణయాలకు పెట్టింది పేరైన ఇంటర్మీడియట్‌ బోర్డు మరోసారి విద్యార్థుల సహనానికి పరీక్ష పెడుతోందనే విమర్శలు వినిపిస్తున్నాయి.

చిత్తూరు ,పుత్తూరు/మదనపల్లె సిటీ : విద్యార్థులను ఎలా ఇబ్బంది పెట్టాలో ఇంటర్మీడియట్‌ బోర్డుకు తెలిసినంతగా మరొకరికి తెలియదనే నానుడి ఉంది. దీన్ని నిజం చేస్తూ మరోసారి ఇంటర్మీడియట్‌ బోర్డు వివాదాస్పద నిర్ణయం తీసుకుంది. పరీక్ష ఫీజులను 15 నుంచి 200 శాతం వరకు పెంచుతూ ఉత్తర్వులు విడుదల చేసింది. సాధారణంగా ఏడాదికి పది శాతం లోపు పరీక్ష ఫీజును పెంచుతుంటారు. అలాంటిది ఈ ఏడాది భారీగా పెంచడంతో విద్యార్థులు గగ్గోలు పెడుతున్నారు. అరకొర వసతుల నడుమ ఉపకార వేతనాలపై ఆధారపడే ప్రభుత్వ జూనియర్‌ కళాశాల విద్యార్థులకు ఇంటర్మీడియట్‌ బోర్డు తీసుకున్న నిర్ణయం పెనుభారంగా మారిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

పుత్తూరులో రెండు ప్రభుత్వ జూనియ ర్‌ కళాశాలలు, ఆరు ప్రైవేట్‌ జూనియర్‌ కళాశాలల పరిధిలో సుమారు 6 వేల మంది విద్యార్థులు ఇంటర్మీడియట్‌ చదువుతున్నారు. పెంచినఫీజుల భారం ప్రధానంగా ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో చదివే నిరుపేద విద్యార్థులపై పడుతుందనే మాటలు వినిపిస్తున్నాయి. దీన్ని ఆసరాగా తీసుకొని ప్రైవేట్‌ కళాశాలల యాజమాన్యాలు విద్యార్థుల నుంచి అధిక మొత్తంలో వసూలు చేసే అవకాశాలున్నాయనే ఆరోపణలు సైతం వినిపిస్తున్నాయి.

అపరాధ రుసుంపైనే దృష్టి..
ఫీజులను భారీగా పెంచిన ఇంటర్‌ బోర్డు చెల్లింపునకు కేవలం 12 రోజులే గడువు ఇవ్వడం విమర్శలకు తావిస్తోంది. అసలే ఫీజులు పెరగడంతో ఇబ్బంది పడుతున్న విద్యార్థులకు ఫీజుల చెల్లింపునకు తక్కువ సమయం ఇవ్వడం పట్ల అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. అక్టోబర్‌ 24వ తేదీన పెంచిన ఫీజులకు సంబంధించి సర్క్యులర్‌ జారీ అయింది. ఫీజు చెల్లింపునకు నవంబర్‌ 5వ తేదీ తుది గడువుగా పేర్కొనడంతో విద్యార్థులు విస్తుపోతున్నారు. గడువు లోపు చెల్లించని విద్యార్థులకు రూ.120 నుంచి రూ.5 వేల వరకు అపరాధ రుసుం చెల్లించాల్సి ఉంటుంది. ఈ నిర్ణయంపై విద్యార్థులు భగ్గుమంటున్నారు. అపరాధ రుసుం వసూలు చేసేందుకే ఇంటర్మీడియ ట్‌ బోర్డు తక్కువ సమయం కేటాయించిందనే అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థులతో బోర్డు వ్యాపారం చేస్తోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఫీజులను పెంచిన ఇంటర్‌ బోర్డు అందుకు తగ్గట్టుగా చెల్లింపునకు కనీసం నెల రోజులు గడువు ఇచ్చి ఉంటే కొంతలోకొంత ఉపశమనంగా ఉండేదని అంటున్నారు. పెంచిన ఫీజులను ఉపసంహరించుకోవాలని విద్యార్థి సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి.

మరిన్ని వార్తలు