మీసేవలపై బాదుడు

26 Mar, 2018 11:30 IST|Sakshi
మీసేవ కేంద్రంలో లావాదేవీలు నిర్వహిస్తున్న ఆపరేటర్‌

రుసుంలు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం

నెలకు ప్రజలపై భారం సుమారు రూ. లక్ష

పెదవాల్తేరు(విశాఖతూర్పు):సులభంగా.. వేగంగా.. అంటూ మొదలై.. మీ సౌలభ్యానికి.. సౌకర్యానికి అంటూ సాగుతున్న మీసేవలకు ఇక బాదుడు మొదలైంది. మీసేవల రుసుంలు పెంచుతూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం శనివారం నుంచి అమలులోకి వచ్చిం ది. పలు రకాల సర్వీసులు మీసేవ కేంద్రాల ద్వారానే అందుతుంటాయి. దీంతో ప్రజలు ఆయా అవసరాల కోసం మీసేవ కేంద్రాలను ఆశ్రయిస్తున్నారు. ప్రస్తు తం వసూలు చేస్తున్న రుసులపై రూ.10 అదనపు భారం మోపడంపై సర్వత్రా నిరసన వ్యక్తమవుతోం ది. ఇప్పటికే పలు ప్రైవేట్‌ మీసేవ నిర్వాహకులు అదనంగా చార్జీలు వసూలు చేస్తున్నా పట్టించుకునే నా థుడే కరువయ్యాడు. ఈ నేపథ్యలో ప్రభుత్వం రూ. 10 అదనంగా పెంచడంతో నిర్వాహకులు ఇంకెంత వసూలు చేస్తారోనని ఆందోళన వ్యక్తమవుతోంది.

ప్రారంభం ఇలా..
విశాఖ జిల్లాలో 2004 మార్చిలో ఈసేవ కేంద్రాలు ప్రారంభమయ్యాయి. అనంతరం వీటినే మీసేవ కేంద్రాలుగా వ్యవహరిస్తున్నారు. జిల్లాలో ప్రభుత్వానికి చెందిన 22 మీసేవ కేంద్రాలను రామ్‌ఇన్ఫో సంస్థ నిర్వహించడం తెలిసిందే. ఈ సంస్థ ఫ్రాంఛైజీలు 200కి పైగా ఉన్నాయి. ఇక ఏపీ ఆన్‌లైన్‌ సంస్థకి ఫ్రాంఛైజీలు మరో 200 వరకు ఉన్నాయి. ఈ కేంద్రాల్లో 300 వరకు సర్వీసులు అందుతుండగా.. రెగ్యులర్‌గా ఉపయోగించుకునే సర్వీసులు 50 వరకు ఉన్నాయి. ప్రభుత్వ, రామ్‌ఇన్ఫో కేంద్రాలలో రోజుకు దాదాపుగా రూ.50లక్షల వరకు లావాదేవీలు జరుగుతున్నాయి. ఇక ఏపీ ఆన్‌లైన్‌ కేంద్రాల ద్వారా రూ.40లక్షల వరకు లావాదేవీలు సాగుతున్నట్టు సమాచారం.

ఏ, బీ క్యాటగిరీ సేవలపై భారం
మీసేవ కేంద్రాల ద్వారా అందుతున్న ఏ, బీ క్యాటగిరీ సేవలపై సర్వీసు చార్జీలను పెంచారు. ఏ క్యాటగిరీలోని అడంగళ్, వన్‌బీ, పట్టాదారు పాసుపుస్తకం వంటి సేవలు పొందడానికి ఇప్పటివరకు రూ.25 చొప్పున సర్వీసు చార్జీలు వసూలు చేస్తున్నారు. ఇక నుంచి ఈ చార్జీ రూ.35కి పెరిగింది. బీ క్యాటగిరీలోని కుల, ఆదాయ, నివాస ధ్రువపత్రాలు, కుటుంబ వారసత్వ ధ్రువపత్రం వంటి సేవలు పొందడానికి ఇప్పటి వరకు సర్వీసు చార్జీల కింద రూ.35 చొప్పున వసూలు చేస్తుండగా.. శనివారం నుంచి ఇది రూ.45కి పెరిగింది. మొత్తమ్మీద ఈ రెండు క్యాటగిరీల సేవలపైనా రూ.10 అదనపు భారం పడినట్టయింది. ఈ రెండు విభాగాలలోను మీసేవ కేంద్రాలలో నెలకు రూ.8వేల నుంచి రూ.10వేల వరకు లావాదేవీలు జరుగుతుంటాయి. అంటే జిల్లా ప్రజలపై నెలకు రూ.లక్ష వంతున అదనపు భారం మోపినట్టయింది. ప్రభుత్వ మీసేవ కేంద్రాలలో ధ్రువపత్రాల కోసం రూ.35 వసూలు చేస్తున్నారు. ప్రైవేట్‌ మీసేవ కేంద్రాలలో స్కానింగ్‌ చార్జీలంటూ రూ.15 అదనంగా వసూలు చేస్తున్నారు. గతంలో ఇదే విషయమై çఫిర్యాదు అందడంతో సీతంపేటలోని ఒక కేంద్రాన్ని అప్పటి తహసీల్దార్‌ సీజ్‌ చేయడం తెలిసిందే. అయితే గ్రామీణ ప్రాంతాల్లోని మీసేవ నిర్వాహకుల వినతి మేరకే చార్జీలు పెంచామని ప్రభుత్వం చెబుతోంది.

అదనపు భారం తగదు
మీసేవ కేంద్రాలలో అందిస్తున్న సర్వీసులపై అదనపు భారం మోపం అన్యాయం. పదో తరగతి పరీక్షల తరువాత విద్యార్థులంతా ధ్రువపత్రాలు తీసుకోవాల్సి ఉంటుంది. ఈ తరుణంలో సర్వీసు చార్జీలు పెంచడం తగదు.        – సీహెచ్‌.రాజ్యలక్ష్మి, గృహిణి, పెదజాలరిపేట

ఇప్పటికే ఇష్టానుసారం వసూలు
మీసేవ సర్వీసులపై రూ.10 వంతున అదనపు భారం మోపడం విచారకరం. ఇప్పటికే పలు కేంద్రాల నిర్వాహకులు ఇష్టానుసారం చార్జీలు వసూలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వమే చార్జీలు పెంచడం ప్రజలపై అదనపు భారం మోపినట్టయింది.      – సత్తిబాబు, ప్రైవేట్‌ ఉద్యోగి, కొత్తవెంకోజీపాలెం

మరిన్ని వార్తలు