కాంట్రాక్టర్ నిర్లక్ష్యానికి.. పసి ప్రాణం బలి

15 Mar, 2016 00:40 IST|Sakshi
కాంట్రాక్టర్ నిర్లక్ష్యానికి.. పసి ప్రాణం బలి

రెడీమిక్స్ ప్లాంట్ కోసం తవ్విన 40 అడుగుల గోతిలో పడి మృతి
 కన్నవారికి కడుపుకోత

 
విజయవాడ (పటమట) : కాంట్రాక్టర్ నిర్లక్ష్యం ఓ పసివాడి నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. అల్లారు ముద్దుగా పెంచుకున్న తల్లికి కడుపుకోత మిగిల్చింది. ఏపీఐఐసీ కాలనీలో చేపట్టిన హౌసింగ్ ప్రాజెక్టు నిర్మాణం కోసం కాంట్రాక్టర్ రెడీమిక్స్ తయారీ కోసం ప్లాంట్‌ను ప్రాజెక్టుకు పక్కనే ఉన్న మరో స్థలంలో ఏర్పాటు చేశారు.  రెడీమిక్స్ తయారీలో వచ్చే నీటిని పంపేందుకు 40 అడుగుల మేర భారీ గొయ్యి తీశారు. దాని చుట్టూ ఎలాంటి రక్షణ ఏర్పాట్లు చేయలేదు. ఈ నేపథ్యంలో కాలనీ వాసి ఆఫ్రిన్ ఏకైక కుమారుడు అజారుద్దీన్ (8) సోమవారం సాయంత్రం ఆరున్నర గంటల సమయంలో ఆడుకుంటూ ఆ గొయ్యిలో పడిపోయాడు. బాలుడితో ఉన్న పిల్లలు వెంటనే అతని తల్లికి సమాచారం అందించారు. స్థానికుల సహాయంతో గొయ్యిలో పడిన బాలుడిని వెలికి తీయగా అప్పటికే మృతి చెందాడు. బాలుడి తండ్రి సిజారుద్దీన్ ఆర్మీలో పనిచేస్తున్నాడు. తల్లి ఆఫ్రిన్ ప్రైవేటు కళాశాలలో లెక్చరర్‌గా పనిచేస్తున్నారు. బాలుడు స్థానిక ప్రైవేటు పాఠశాలలో రెండో తరగతి చదువుతున్నాడు.
 
స్థానికుల ఆందోళన
కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్లే ఈ ఘటన జరిగిందంటూ స్థానికులు ఆందోళన చేపట్టారు. కాలనీ రోడ్డుపై రాస్తారోకో చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని బాధితులతో చర్చలు జరిపారు. విష యం తెలుసుకున్న మేయర్ కోనేరు శ్రీధర్ ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. బాధితులతో మాట్లాడారు. సీపీఐ నేత దోనేపూడి శంకర్ ఘటనా స్థలానికి చేరుకుని బాధితులను పరామర్శించారు. బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
 

మరిన్ని వార్తలు