శాస్త్ర సాంకేతిక పరిశోధకులకు ఫెలోషిప్‌ పెంపు

17 Sep, 2018 05:14 IST|Sakshi

సాక్షి, అమరావతి: శాస్త్ర, సాంకేతిక రంగాల్లో పరిశోధనలు పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రైమ్‌ మినిస్టర్‌ రీసెర్చ్‌ ఫెలోషిప్‌ (పీఎంఆర్‌ఎఫ్‌) కింద కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. సైన్స్‌ అండ్‌ టెక్నాలజీలో పరిశోధకులకు ఇస్తున్న ఫెలోషిప్‌ మొత్తాన్ని భారీగా పెంచడంతోపాటు దీనికి జాతీయ సమన్వయకర్త బాధ్యతలను హైదరాబాద్‌ ఐఐటీకి అప్పగించింది. ఫెలోషిప్‌పై విద్యార్థులకు అవగాహన కలిగించాలని కేంద్ర మానవవనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఆయా యూనివర్సిటీలు, ఉన్నత విద్యాసంస్థలకు సూచించింది. ఈ కొత్త మార్గదర్శకాలు 2019 ఫెలోషిప్‌ ఎంపికలకు వర్తిస్తాయని వివరించింది. 

పరిశోధనాసక్తిని తెలియచేసేలా ప్రాజెక్ట్‌ 
అభ్యర్థి.. పరిశోధన చేయదలుచుకున్న అంశానికి సంబంధించి ప్రాజెక్టును రూపొందించుకొని సమర్పించాల్సి ఉంటుంది. ప్రాజెక్ట్‌ శాస్త్ర, సాంకేతిక అంశాలకు చెందినదై, జాతీయ ప్రాధాన్యతలను దృష్టిలో పెట్టుకొని రూపొందించి ఉండాలి. ప్రాజెక్ట్‌ అభ్యర్థికి పరిశోధనపై గల ఆసక్తి, పరిశీలన సామర్థ్యాలకు దర్పణం పట్టేలా ఉండాలి. అంతేకాకుండా సెలెక్షన్‌ కమిటీ ఫీడ్‌బ్యాక్‌ తీసుకునేందుకు ఈ ప్రాజెక్టుతోపాటు ఇద్దరు నిపుణుల పేర్లను రిఫర్‌ చేయాల్సి ఉంటుంది. సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ అంశాలపై ఆయా అభ్యర్థులు ఎంచుకొనే సబ్జెక్టులకు ఒక్కోదానికి ఒక్కో విద్యా సంస్థను నోడల్‌ ఇన్‌స్టిట్యూట్‌గా కేంద్ర మానవ వనవరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఎంపిక చేస్తుంది. ఆ సంస్థలు ఆయా పరిశోధనాంశాలను పర్యవేక్షిస్తాయి. 

ప్రత్యేక పోర్టల్‌ ఏర్పాటు
ఈ పీఎంఆర్‌ఎఫ్‌ కోసం ప్రత్యేక వెబ్‌సైట్‌ను ఏర్పాటు చేయనున్నారు. అభ్యర్థులు ఈ వెబ్‌సైట్‌ ద్వారా సమర్పించిన దరఖాస్తులు సంబంధిత నోడల్‌ ఇన్‌స్టిట్యూట్లకు చేరతాయి. ఆయా నోడల్‌ ఇన్‌స్టిట్యూట్లు నియమించే నిపుణుల కమిటీలు ఇంటర్వ్యూలు చేసి అర్హులైన అభ్యర్థుల జాబితాలను రూపొందిస్తాయి. ఇంటర్వ్యూలను అవసరమైతే వీడియో కాన్ఫరెన్సుల ద్వారా కూడా నిర్వహించనున్నారు. జాబితాల్లోని వారిని మరింత వడపోసేందుకు జాతీయ సమన్వయ కమిటీ (ఎన్‌సీసీ) రాతపరీక్షలు, చర్చాగోష్టులు తదితర మార్గాల ద్వారా ఫెలోషిప్‌కు అర్హులను ఎంపిక చేస్తుంది. అనంతరం వారికి విద్యా సంస్థలను కేటాయించనున్నారు. ఎంపిక మార్గదర్శకాలను ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్స్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఐఐటీలు), ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ (ఐఐఎస్‌సీ), ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్స్‌ ఆఫ్‌ సైన్స్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రీసెర్చ్‌ (ఐఐఎస్‌ఈఆర్‌లు) రూపొందించనున్నాయి. 

అనుకున్న మేర పరిశోధన సాగితేనే మరుసటి ఏడాదికి రెన్యువల్‌
ఆశించిన మేర అభ్యర్థి పరిశోధన సాగిస్తేనే మరుసటి ఏడాదికి ఫెలోషిప్‌ రెన్యువల్‌ అవుతుంది. పరిశోధకుడు వారంలో ఒకరోజు తమకు సమీపంలోని ఐటీఐ, పాలిటెక్నిక్, ఇంజనీరింగ్‌ కాలేజీల్లో బోధన చేయాలి. జాతీయ సమన్వయ కమిటీ (ఎన్‌సీసీ) పీఎంఆర్‌ఎఫ్‌ను అమలుచేసే వ్యవస్థగా ఉంటుంది. పరిశోధనలకు సంబంధించిన మార్గదర్శకాల్లో మార్పులుచేర్పులు చేసే అధికారం ఎన్‌సీసీకి ఉంటుంది. ఎంతమందిని పరిశోధనలకు అనుమతించాలన్న నిర్ణయమూ ఎన్‌సీసీ పరిధిలోనే ఉంటుంది.

ఫెలోషిప్‌ ఇలా..
పీఎంఆర్‌ఎఫ్‌ కింద మొదటి రెండేళ్లు 70 వేల చొప్పున, మూడో ఏడాది రూ.75 వేలు, చివరి రెండేళ్లు రూ 80 వేల చొప్పున ఇవ్వనున్నారు. దీంతోపాటు రీసెర్చ్‌ గ్రాంట్‌ కింద ఏటా రూ.2 లక్షల చొప్పున ఐదేళ్లకు రూ.10 లక్షలు అందిస్తారు. ఈ పరిశోధనల కాలపరిమితి ఇంటిగ్రేటెడ్‌ కోర్సుల విద్యార్థులకు నాలుగేళ్లు, బీటెక్‌ విద్యార్థులకు ఐదేళ్లు ఉంటుంది. ఎంటెక్, ఎంఎస్, ఎంఈ కోర్సులు పూర్తిచేసినవారికి కూడా నాలుగేళ్ల కాలపరిమితి వర్తిస్తుంది. 

మరిన్ని వార్తలు