గడప ముంగిట మహిళా సైన్యం

2 Mar, 2020 04:23 IST|Sakshi

సచివాలయాల్లో సేవలకు సిద్ధమైన మహిళా పోలీసులు

ప్రాథమిక స్థాయిలోనే తక్షణం స్పందించేలా చర్యలు

సమీపంలోని పోలీస్‌స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్‌ నమోదుకు వారధులు

శాంతి కమిటీల ఏర్పాటు, చైతన్య కార్యక్రమాల్లోనూ భాగస్వామ్యం

సాక్షి, అమరావతి: గడప ముంగిటకే అన్ని సంక్షేమ ఫలాలను తెచ్చిన రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మరో అడుగు ముందుకేసి ‘రక్షణ’ వ్యవస్థను కూడా ప్రజలకు అందుబాటులోకి తెస్తోంది. ఇందుకోసం గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేసే మహిళా పోలీసులు ప్రధాన పాత్ర పోషించేలా కార్యాచరణ రూపొందించింది. ఇప్పటికే గ్రామ, వార్డు సచివాలయాల్లో దాదాపు ప్రతిదాంట్లోనూ ఒక మహిళా పోలీసును నియమించింది. రాష్ట్రవ్యాప్తంగా 14,944 మహిళా పోలీస్‌ పోస్టులకుగాను ఇప్పటివరకు 12,265 పోస్టులను భర్తీ చేసింది. మహిళా పోలీసులు ఆ ప్రాంతానికి చెందిన వారే కావడంతో స్థానిక ప్రజలతో మమేకమై పనిచేసే అవకాశం ఉంటుంది. వీరు మరింత సమర్థవంతంగా పనిచేసేలా రాష్ట్ర పోలీసు శాఖ పర్యవేక్షణలో దిశానిర్దేశం చేయనున్నారు.

ప్రాథమిక స్థాయిలోనే శాంతిభద్రతల సమస్యలపై స్పందించి గడప వద్దకే వెళ్లి రక్షణ సేవలను అందించనున్నారు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా జీరో ఎఫ్‌ఐఆర్‌ (ఎక్కడైనా ఫిర్యాదు చేసే అవకాశం) విధానాన్ని తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. దీనికి కొనసాగింపుగా ఆయా సచివాలయాల పరిధిలో వివాదాలను నేరుగా పోలీస్‌స్టేషన్‌కు నివేదించి ఉన్న చోట నుంచే ఎఫ్‌ఐఆర్‌ నమోదుకు మహిళా పోలీసులు వారధిగా ఉపయోగపడనున్నారు. అంతేకాకుండా మద్యం వంటి సామాజిక రుగ్మతలపై ప్రజా చైతన్య వీచికలుగా వీరిని సిద్ధం చేయనున్నారు. స్థానికంగా సంఘ వ్యతిరేక కార్యకలాపాలు, అక్రమాలను అరికట్టేందుకు ప్రజలతో మమేకమై మహిళా పోలీసులు పనిచేస్తారు. శాంతి కమిటీల ఏర్పాటు, ఇతర సామాజిక చైతన్య కార్యక్రమాల్లో వీరిని భాగస్వాముల్ని చేసి.. ఆయా సచివాలయాల పరిధిలో పెనుమార్పులకు ప్రభుత్వం శ్రీకారం చుడుతోంది. 

క్షేత్రస్థాయిలో వారి సేవలను ఉపయోగించుకుంటాం
రాష్ట్రవ్యాప్తంగా వార్డు, గ్రామ సచివాలయాల్లో ప్రభుత్వం మహిళా పోలీసులను నియమించడం గొప్ప విషయం. క్షేత్ర స్థాయిలో శాంతిభద్రతల నిర్వహణకు వారి సేవలు ఉపయోగించుకుంటాం. శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసులతోపాటు మహిళా మిత్ర, సైబర్‌ మిత్ర, స్టూడెంట్‌ క్యాడెట్‌ వంటి అనేక మంది సేవలు అందిస్తున్నారు. ఇదే క్రమంలో సచివాలయాల్లోని మహిళా పోలీసుల సేవలను మరింత బాగా ఉపయోగించుకునేలా చర్యలు తీసుకుంటాం. ఆయా జిల్లాల ఎస్పీలు వారిని సమన్వయం చేసేలా చూస్తాం.
– డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌

మరిన్ని వార్తలు