బెయిలొచ్చింది పండగ తెచ్చింది

24 Sep, 2013 00:53 IST|Sakshi
బెయిలొచ్చింది పండగ తెచ్చింది

ఊరూరా పండగొచ్చింది.. ఇంటింటావెలుగునిచ్చింది.. గుండెగుండెలో ఆక్సిజన్ నింపింది.. ధర్మం గెలిచింది.. న్యాయం నిలిచింది.. కుమ్మక్కు కుట్రలు, కుయుక్తులు, చీకటి శక్తులు చతికిలబడ్డాయి.. పేదల మోము వేయి వోల్టుల్లా వికసించింది..  పచ్చని పైరు, విచ్చుకునే పువ్వు, స్వేచ్ఛగా విహరించే పావురాయి సరికొత్త రాగమాలపించాయి.. ప్రకృతి పరవశించింది.. తెలుగుతల్లి గుండెనిండా ఊపిరి పీల్చుకుంది.. కొండంత అండగా తన బిడ్డ వస్తున్నాడని, ఇక సమైక్యతావాణి ప్రతిధ్వనిస్తుందని మురిసిపోయింది.. జైలు చిన్నబోయింది.. ఇన్నాళ్లూ ఈ అక్రమ నిర్బంధానికి తను నెలవైనందుకు తల్లడిల్లింది.. జననేత జగనన్నకు బెయిల్ వచ్చింది.. సెప్టెంబరు 23 చరిత్రలో చిరస్థాయి పొందింది.. తమ వాడొస్తున్నాడంటూ జనం ముందుగానే దసరా, దీపావళి సంబ రాల్ని ఒకేసారి చేసుకున్నారు.. చిన్నాపెద్దా తేడా మర్చి ఆనందతరంగాలై సందడి చేశారు.
 
సాక్షి ప్రతినిధి, విజయవాడ : కుమ్మక్కు కుట్రలు, అక్రమ కేసులతో 16 నెలలుగా జైలులో నిర్బంధించిన వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి బెయిల్ మంజూరు చేస్తూ సీబీఐ కోర్టు ఇచ్చిన తీర్పుతో జిల్లాలో ఒక్కసారిగా ఆనందోత్సాహాలు పెల్లుబికాయి. సోమవారం సాయంత్రం బెయిల్ వార్తలు వెలువడగానే జిల్లావ్యాప్తంగా వైఎస్సార్‌సీపీ శ్రేణులు, జగన్‌మోహన్‌రెడ్డి అభిమానులు, ప్రజలు ఆనందంతో ఉక్కిరిబిక్కిరయ్యారు. జగన్‌మోహన్‌రెడ్డికి బెయిల్ మంజూరైన వార్తను టీవీల్లో చూసిన జనం ‘ధర్మం గెలిచింది.. న్యాయం పలికింది’ అంటూ రోడ్లపైకి వచ్చి సంబరాలు చేసుకున్నారు. డప్పుల మోత, బాణాసంచా కాల్పులతో జిల్లా అంతటా పండగ వాతవరణం నెలకొంది. ఊరూవాడా వైఎస్సార్‌సీపీ శ్రేణులతోపాటు జగన్‌మోహన్‌రెడ్డి అభిమానులు, ప్రజలు స్వచ్ఛందంగా రోడ్లపైకి వచ్చి ఈ ఆనందోత్సాహాల్లో పాల్గొనడం విశేషం.
 
 తిరుగులేని నేత..

 మహానేత వైఎస్ మరణంతో రాష్ట్రానికి నాయకత్వ లోటును భర్తీ చేస్తూ తిరుగులేని నేతగా ఎదిగిన జగన్‌మోహన్‌రెడ్డిపై సాగిన కుమ్మక్కు కుట్రల విషయం ప్రజలకు తెలిసిందే. ఆయన జనంలో ఉంటే తమ ఉనికికే ఇబ్బంది అనుకున్న కాంగ్రెస్, టీడీపీలు కుమ్మక్కు కుట్రలు చేసి అక్రమ కేసులు పెట్టి ఇరికించి దాదాపు 16 నెలలుగా జైలులో ఉంచిన సంగతి విదితమే. ఆయన జైలులో ఉన్నా ప్రజల కష్టాలపై ఎప్పటికప్పుడు స్పందించారు. జగన్‌పై అక్రమ కేసులు, అధికారపార్టీ ప్రజావ్యతిరేక విధానాలను నిరసిస్తూ జిల్లాకు చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు పదవులను తృణప్రాయంగా త్యజించారు. జగన్‌మోహన్‌రెడ్డి సూచనతో వైఎస్సార్‌సీపీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ కృష్ణా జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రాంతీయ సదస్సును నిర్వహించారు. జగన్‌మోహన్‌రెడ్డిపై సాగుతున్న కుమ్మక్కు కుట్రలను ప్రజలకు వివరిస్తూ ఆయన సోదరి షర్మిల జిల్లాల్లో మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర దిగ్విజయంగా నిర్వహించిన సంగతి తెల్సిందే.

 హైదరాబాద్‌కు పయనమైన నేతలు..

 జగన్‌మోహన్‌రెడ్డి రాకకోసం నిలువెల్లా కనులై ఎదురుచూస్తున్న అభిమానుల కోరిక నేటికి ఫలించనుంది. చంచల్‌గూడ జైలులో 484 రోజులుగా ఉన్న జగన్‌మోహన్‌రెడ్డికి బెయిల్ విషయంలో సోమవారం సీబీఐ కోర్టు తీర్పు కోసం జిల్లా వాసుల్లో సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు జిల్లాలోని వైఎస్సార్‌సీపీ శ్రేణులు, ప్రజలు టీవీలకు అతుక్కుపోయారు. ఆయనకు బెయిల్ రావాలని కోరుకున్న అభిమాన జనం గంటల తరబడి టీవీల వద్ద ఆసక్తిగా తిలకించారు. జగన్‌మోహన్‌రెడ్డికి బెయిల్ మంజూరు చేస్తూ సీబీఐ కోర్టు తీర్పు వెలువరించడంతో  జిల్లా అంతటా ఒక్కసారిగా ఉత్సాహం ఉప్పొంగింది. ఇదే సందర్భంగా  జిల్లా అంతటా పెద్ద ఎత్తున ఆనందోత్సాహాలు జరుపుకొని మంగళవారం జిల్లా అంతటా పెద్ద ఎత్తున ర్యాలీలు నిర్వహించేందుకు వైఎస్సార్‌సీపీ శ్రేణులు సమాయత్తమవుతున్నాయి. ఇప్పటికే జిల్లాలోని ముఖ్యనేతలు, పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో హైదరాబాద్‌కు పయనమయ్యారు.

 జిల్లా పార్టీ కార్యాలయంలో..

 రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు అక్టోబరు ఒకటిన ప్రతిష్టాత్మకంగా జరపతలపెట్టిన సమైక్య రైతు శంఖారావం విజయవంతానికి గుంటూరు, కృష్ణాజిల్లా నేతలు సమావేశం నిర్వహించుకున్నారు. ఉదయం నుంచి కోర్టువద్ద జరుగుతున్న పరిణామాలను ప్రసార మాధ్యమాల్లో చూస్తూ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న నాయకులు సాయంత్రం జగన్ బెయిల్ వార్త వినడంతో ఒక్కసారిగా ఆనందోత్సాహాలతో ఉక్కిరిబిక్కిరయ్యారు. పార్టీ రాష్ట్ర నాయకులు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, తలశిల రఘురామ్, ఉభయ జిల్లాల పార్టీ క న్వీనర్లు సామినేని ఉదయభాను, మర్రి రాజశేఖర్, పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ ఆళ్ల రామకృష్ణారెడ్డి, మాచర్ల ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి, జలీల్‌ఖాన్, జోగి రమేష్, పేర్ని నాని, మేకా ప్రతాప్ అప్పారావు, గౌతమ్‌రెడ్డి, తాతినేని పద్మావతి, తాడి శకుంతల, వాకా వాసుదేవరావు, ఉప్పాల రామప్రసాద్, జిల్లా పార్టీ ప్రచార అధ్యక్షుడు సానికొమ్ము వేంకటేశ్వరరెడ్డి, డాక్టర్ మొహబూబ్ తదితరులు ఉత్సవాలు నిర్వహించుకున్నారు. ఆనందోత్సాహాలతో స్వీట్లు పంచుకుని పండగ నిర్వహించుకున్నారు.

 అంబరాన్నంటిన సంబరాలు..

 జగన్‌కు బెయిల్ మంజూరవటంతో నగరంలో, జిల్లాలో సంబరాలు మిన్నంటాయి. తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ, గుణదల మేరీమాత ఆలయంలో ప్రార్థనలు జరిపారు. అంనతరం బందరు రోడ్డులో బాణాసంచా పేల్చారు. వన్‌టౌన్‌లో జలీల్‌ఖాన్ ఆధ్వర్యంలో కార్యకర్తలు, నాయకులు వీధులలో సందడి చేశారు. సెంట్రల్  నియోజకవర్గం సమన్వయకర్త పీ గౌతంరెడ్డి ఆధ్వర్యంలో కార్యకర్తలు బాణాసంచా కాల్చి మిఠాయిలు పంచి సంబరాలు జరిపారు. జిల్లా కేంద్రమైన మచిలీపట్నంలో మాజీ ఎమ్మెల్యే పేర్ని వెంకట్రామయ్య (నాని) ఆధ్వర్యంలో పార్టీ నాయకులు భారీ ర్యాలీ నిర్వహించారు. బందరు కోనేరు సెంటర్ నుంచి లక్ష్మీటాకీస్ వరకూ ర్యాలీ చేశారు. బాణాసంచా కాల్చారు.

మిఠాయిలు పంచుకున్నారు. పెడన నియోజకవర్గంలో పార్టీ నాయకులు ఉప్పాల రాము, రామ్‌ప్రసాద్, వాకా వాసుదేవరావు ఆధ్వర్యంలో సంబరాలు జరుపుకున్నారు. బాణాసంచా కాల్చి ర్యాలీ నిర్వహించారు. కైకలూరు నియోజకవర్గంలో పార్టీ సమన్వయకర్త దూలం నాగేశ్వరరావు ఆధ్వర్యంలో  బాణాసంచా కాల్చి స్వీట్లు పంచుకున్నారు. గుడివాడలో పార్టీ ఆధ్వర్యంలో నెహ్రూచౌక్‌లో సంబరాలు జరిగాయి. పట్టణంలో కార్యకర్తలు ప్రదర్శన జరిపారు. బైక్ ర్యాలీ నిర్వహించారు. పెనమలూరులో పార్టీ సమన్వయకర్త తాతినేని పద్మావతి ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి టపాసులు పేల్చారు. తిరువురు నియోజకవర్గంలో పార్టీ మండల కన్వీనర్ శీలం నాగనర్సిరెడ్డి, దుర్గగుడి మాజీ చైర్మన్ పిడపర్తి నారాయణరెడ్డి ఆధ్వర్యంలో సంబరాలు జరిగాయి.

మైలవరం నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే జోగి రమేష్ ఆధ్వర్యంలో ఇబ్రహీంపట్నం నుంచి జీ కొండూరు, మైలవరం వరకూ ర్యాలీ నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే జ్యేష్ఠ రమేష్‌బాబు ఆధ్వర్యంలో మైలవరంలో పార్టీ కార్యకర్తలు, నాయకులు ర్యాలీ నిర్వహించి వైఎస్ కాంస్య విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. జగ్గయ్యపేట పట్టణంలో సామినేని విశ్వనాథం కార్యకర్తల ఆనందోత్సాహాల మధ్య కేక్ కట్ చేశారు. బైక్ ర్యాలీ నిర్వహించారు. బాణాసంచా కాల్చి, మిఠాయిలు పంచుకున్నారు. నందిగామ నియోజకవర్గంలో పార్టీ సమన్వయకర్త మొండితోక జగన్మోహనరావు నాయకత్వం వహించారు.

నియోజకవర్గంలో చందర్లపాడు, కంచికచర్ల, వీరులపాడు మండలాలలో కూడా పార్టీ సంబరాలు జరిగాయి. నూజివీడు పట్టణంలో పార్టీ ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. స్వీట్లు పంచారు. నియోజకవర్గ సమన్వయకర్త మేకా ప్రతాప్ అప్పారావు ఈ కార్యక్రమానికి నాయకత్వం వహించారు. గన్నవరంలో గాంధీబొమ్మ సెంటర్‌లో బాణాసంచా కాల్చి సంబరాలు జరిపారు. హనుమాన్‌జంక్షన్‌లో నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ దుట్టా రామచంద్రరావు ఆధ్వర్యంలో విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు.
 

మరిన్ని వార్తలు