పండుగ కిక్కు!

18 Jan, 2014 04:21 IST|Sakshi

సంక్రాంతి సీజను వస్తుసామగ్రి, వస్త్ర విక్రయాలకే కాకుండా మద్యం అమ్మకాలకూ మాంచి కిక్కు ఇచ్చింది. కొత్త సంవత్సరాదితో మొదలైన మద్యం విక్రయాల జోరు సంక్రాంతి నాటికి తారాస్థాయికి చేరింది. తిథుల్లో తగులూమిగులు రావడం కూడా ఈ వ్యాపారానికి కలిసి వచ్చింది. ఇదే అవకాశంగా మందుబాబులు రెండురోజులూ పండగ చేసుకున్నారు. జనవరి నెల తొలి 16 రోజుల్లో సాధారణంగా రూ.20 కోట్ల అమ్మకాలు జరుగుతాయి. అయితే ఈ ఏడాది ఇదే కాలంలో అమ్మకాలు రూ.10 కోట్లు పెరిగాయి. అంటే రూ.30 కోట్ల విలువైన మద్యాన్ని మందుబాబులు గటగట తాగేశారన్నమాట!    
 
 శ్రీకాకుళం క్రైం, న్యూస్‌లైన్ : సాకు దొరికితే చాలు మద్యం ప్రియులు రెచ్చిపోతారు. ఆనందోత్సాహాలతో పార్టీలు చేసేసుకుంటారు. పీకలదాకా తాగి సందడి చేస్తారు. జనవరి నెల వచ్చిందంటే చాలు వారికి అడ్డూ ఆపూ ఉండదు. కొత్త సంవత్సరం ప్రారంభమయ్యే 1వ తేదీ నుంచి సంక్రాంతి పండుగ మూడు రోజులు పండుగే పండుగ వారికి. ఈ ఏడాదీ అదే జరిగింది. ప్రభుత్వ ఖజానాకు భారీగా ఆదాయం సమకూరింది. ఈ నెల తొలి 16 రోజుల్లో జిల్లాలో ఏకంగా 30 కోట్ల రూపాయల మేర మద్యం విక్రయాలు జరిగాయి.
 
  జిల్లాలో 232 మద్యం దుకాణాలు ఉండగా వీటిలో 29 దుకాణాలకు లెసైన్సు రెన్యువల్ కాలేదు. దీంతో 203 దుకాణాలతోపాటు 16 బార్లు నడుస్తున్నాయి. వీటికి తోడు వందలాది బెల్టుషాపులున్నాయి. పండుగ సీజన్‌ను దృష్టి లో ఉంచుకుని వ్యాపారులందరూ పెద్దఎత్తున స్టాక్ నిల్వ చేశారు. లక్ష్య సాధనే ముఖ్యమనుకున్న ఎక్సైజ్ అధికారులూ చూసీచూడనట్టు వ్యవహరించారు. విచ్చలవిడిగా అమ్మకాలు సాగించేందుకు అవకాశం కల్పించారు. సాధారణంగా రోజుకు 15 వేల రూపాయల మద్యాన్ని విక్రయించే బెల్టుషాపుల వారు పండుగ సీజన్‌లో రోజుకు అదనంగా కనీసం 10 వేల రూపాయల సరుకును తేలిగ్గా అమ్మేశారు.
 
  అధికారిక లెక్కల ప్రకారం ఈ నెల 1 నుంచి 16వ తేదీ వరకు రూ.26 కోట్ల మేర మద్యం విక్రయాలు జరిగాయి. 68 వేల కేసుల మద్యం బాటిళ్లు, 38 వేల కేసుల బీరు బాటిళ్లు అమ్ముడయ్యాయని ఎక్సైజ్ అధికారులు చెప్పారు. మామూలుగా 16 రోజుల్లో సుమారు 20 కోట్ల రూపాయల వరకు మద్యం అమ్మకాలు జరుగుతాయని, పండుగ సీజన్ కావటంతో ఆరు కోట్ల రూపాయల మేర పెరిగాయని వివరించారు. అయితే బెల్టుషాపులు, దుకాణాల వారు అనధికారికంగా విక్రయించిన మద్యం విలువ 4 కోట్ల రూపాయలకుపైగా ఉంటుందని అంచనా.    
 

మరిన్ని వార్తలు